విరిగిన ‘మూసీ’ గేటు..! | Broken the Crust Gate at Moosi Reservoir | Sakshi
Sakshi News home page

విరిగిన ‘మూసీ’ గేటు..!

Published Sun, Oct 6 2019 6:38 AM | Last Updated on Sun, Oct 6 2019 6:39 AM

Broken the Crust Gate at Moosi Reservoir - Sakshi

కేతేపల్లి (నకిరేకల్‌) :  ఎగువ నుంచి వస్తున్న వరదను అంచనా వేడయంలో అధికారులు విఫలం చెందారో.. ప్రాజెక్టు గేట్ల అమరికలో నాణ్యతకు తిలోదకాలిచ్చారో.. కారణాలైతే తెలియవు కానీ. వేల ఎకరాలకు సాగునీరందిస్తున్న మూసీ ప్రాజెక్టు ఓ రెగ్యులేటర్‌ గేటు విరిగిపోయింది. ఫలితంగా వేలాది క్యూసెక్కుల నీరు వృథాగా దిగువకు పోతోంది.  రిజర్వాయర్‌ నీటి మట్టం గరిష్ట స్థాయిలో ఉండడంతో ఈ ఏడాదైనా పం టలు సంమృద్ధిగా పండుతాయనుకున్న రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.  ఇరవై రోజుల నుంచి హైదరాబాద్‌ నగరంతో పాటు వరంగల్, జనగాం ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బిక్కేరు, వసంత వాగు ద్వారా మూసీ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగింది.  మూసీ రిజర్వాయర్‌ పూర్తిస్థాయిలో నిండటంతో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ఏడాది మొదటిసారిగా సెప్టెంబర్‌ 30 ప్రాజెక్టు రెండు క్రస్ట్‌ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు.

నాటి నుంచి ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో ఆధారంగా నీటిమట్టాన్ని 644.5 అడుగుల వద్ద నిలకడగా ఉండేలా చూస్తూ గేట్లను ఎత్తడం, మూయడం చేస్తున్నారు.  శనివారం సాయంత్రం 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండగా నీటిమట్టం 644.8 అడుగులకు చేరుకుంది. ఈ క్రమంలో శనివారం రాత్రి 7గంటల సమయంలో ప్రాజెక్టు 6నంబరు రెగ్యులేటర్‌ గేటు విరిగింది. దీంతో ప్రాజెక్టు నుంచి దాదాపు 5వేల క్యూసెక్‌ల నీరు వృథాగా దిగువకు పోతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తెల్లవారే సరికే దాదాపు ప్రాజెక్టులో ఐదారడుగుల మేర నీటిమట్టం తగ్గే అశకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మూసీని సందర్శించిన మంత్రి
విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యుత్‌శాఖ మం త్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హూటాహుటిన మూసీ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నీటిపారుదలశాఖ ఈఈ భద్రునాయక్, డీఈ నవికాంత్, సిబ్బందితో సమావేశమై. గేటును సరిచేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. సిబ్బందితో పాటు క్రేన్‌లను రప్పించి గేటుకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయనున్నట్టు అధికారులు తెలి పారు. అవసరమైతే అందుబాటులో ఉన్న టాంప్లాగేటును అమర్చి నీటి విడుదలను అరికట్టేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

ఆందోళనలో ఆయకట్టు రైతులు
మూసీ గేటు విరిగి నీరు వృథాగా దిగువకు వెళ్తుండడంతో ఆయకట్టు రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. మూసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని కేతేపల్లి, మాడ్గులపల్లి, వేములపల్లి, సూర్యాపేట, చివ్వెంల, పెన్‌పహాడ్‌ మండలాల్లోని 35 వేల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అన«ధికారికంగా మరో 10వేల ఎకరాల కు పైగానే సాగవుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో సరైన వర్షాలు లేక ప్రాజెక్టు నిండలేదు. ఆయకట్టులో కేవలం బోరుబావుల ఆధారంగా  అరకొరగా పంటలు సాగు చేశారు.ఆయకట్టు భూముల పూర్తిస్థాయి సాగుకు నోచుకోక పడావుగా ఉన్నాయి. ఈనేపథ్యంలో మూసీ ప్రాజెక్టు నిండటంతో రబీలోనైనా పంటలు సాగు చేసుకోవచ్చుననే అనందంలోరైతులు ఉన్నారు. అయితే మూసీగేటు  విరిగి నీరు వృ«థాగా పోతుందనే సమాచారం తెలుసుకున్న రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
 
2015లో గేట్ల మార్పు
నిజాం కాలం 1963లో పూర్తయిన మూసీ ప్రాజెక్టు ఆధునికీకరణను సమైక్య పాలకులు పట్టించుకోలేదు. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు ఆధునికీకరణకు  రూ.20కోట్ల నిధులు మంజూరు చేసింది.  ఇందులో భాగంగా శిథిలావస్థకు చేరిన ప్రాజెక్టు 12రెగ్యులేటర్‌ గేట్లతో పాటు ఎనిమిది క్రస్ట్‌ గేట్లను పూర్తిగా తొలగించి కొత్తగేట్లు అమర్చారు. దీంతో ప్రాజెక్టు గేట్ల లీకేజీలకు అడ్డుకట్టపడింది.

 అధికారుల నిర్లక్ష్యంతోనే..
మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను సరిగా అంచనా వేసి నీటిని దిగువకు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రాజెక్టు గేటు విరిగిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రాజెక్టులో నీటిమట్టం 644.5 అడుగుల చేరిన వెంటనే గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేసేవారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో నీటిమట్టం 644.8 అడుగులకు చేరడంతో పాటు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వస్తున్నా అధికారులు శనివారం గేట్లు ఎత్తక పోవడం వల్లనే గేట్లపై ఒత్తిడి పెరిగి ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శలు వస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

అధికారులతో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement