వేణుమాధవ్, వరుణ్‌తేజ్ మృతదేహాలు: వేణుమాధవ్(ఫైల్)
సాక్షి, కురవి: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు రావడంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన అన్నదమ్ములను ఈత సరదా రూపంలో మృత్యువు కాటేసింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. కురవి మండలం సూదనపల్లికి చెందిన పొల్లూరి లక్ష్మీ, సోమయ్య దంపతులకు వేణుమాధవ్(18), వరుణ్‌తేజ్(14) సంతానం. కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. దసరా సెలవులు రావడంతో వేణుమాధవ్, వరుణ్‌తేజ్ అమ్మమ్మ పద్మతో కలసి గురువారం కురవిలోని చిన్నమ్మ గుండేటి రాధిక, రవి ఇంటికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత చిన్నమ్మ కొడుకు ధనుష్, అతడి స్నేహితులు జక్కుల గణి, నద్దునూరి వెంకటేశ్‌తో కలసి ఈత కొట్టడానికి చెరువు వద్దకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో సమీపంలోని మండలి వీరయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్దకు చేరారు. వెంకి, గణి బావిలోకి దిగి ఈతకొడుతుండగా ధనుష్ ఒడ్డున ఉన్నాడు.
ఈ క్రమంలో వేణుమాధవ్, వరుణ్‌తేజ్ ఒడ్డున ఉన్న కట్టెను పట్టుకుని బావిలోకి దిగే ప్రయత్నంలో నీళ్లలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతుండగా.. అప్పటికే బావిలో ఉన్న వెంకి, గణి భయంతో బయటకు వచ్చి ధనుష్‌తో కలసి పరుగున ఊర్లోకి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. రాధికతో పాటు భర్త రవి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం గ్రామస్తులు, చుట్టుపక్కల వారికి తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎస్సై శంకర్‌రావుకు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి చేరుకుని స్థానిక యువకుల సాయంతో మృతదేహాల కోసం గాలించారు. మానుకోట నుంచి అగ్నిమాపక శాఖ అధికారి కొమురయ్య, సిబ్బంది వచ్చి రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మృతదేహాలను బయటకు తీసి ఆటోలో వారి చిన్నమ్మ రాధిక ఇంటికి తరలించారు.
ఏం పాపం చేశాం బిడ్డా..
‘ఏం పాపం చేశాం బిడ్డా.. మమ్ములను అన్యాయం చేసి వెళ్లిపోయారా?’.. అంటూ అక్కడికి చేరుకున్న తల్లి లక్ష్మీ మృతదేహాలపై పడి బోరున విలపించింది. ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూపిన ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కురవితోపాటు సూదనపల్లిలో విషాదం అలుముకుంది. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై శంకర్‌రావు తెలిపారు. సంఘటన స్థలానికి మానుకోట ఆర్డీఓ కొమురయ్య, ఇన్‌చార్జ్ తహసీల్ధార్ శేషగిరిస్వామి, సీఐ వెంకటరత్నం చేరుకుని వివరాలను సేకరించారు.
ఎమ్మెల్యే పరామర్శ..
డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కురవికి చేరుకుని మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీటీసీ చిన్నంభాస్కర్, టీఆర్‌ఎస్ నాయకులు బాదావత్ రాజునాయక్, సోమిశెట్టి శ్రీనివాస్, మేక నాగిరెడ్డి, తుకారాంనాయక్ ఉన్నారు.
మంత్రి సత్యవతిరాథోడ్ సంతాపం ఇద్దరు చిన్నారులు బావిలో పడిపోయి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment