* నల్లగొండ జిల్లా ఫణిగిరిలో లభ్యం
* ప్రధాన బౌద్ధ సన్యాసి వాడినట్లు నిర్ధారణ
* మూడో శతాబ్దంనాటి బౌద్ధస్తూపం వద్ద గుర్తింపు
* క్షేత్రపారాజు ముఖచిత్రం గల అరుదైన నాణేలు కూడా లభ్యం
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలంలోని బౌద్ధ క్షేత్రం ఫణిగిరిలో క్రీస్తు శకం మూడో శతాబ్దంనాటి మహాస్తూపం వద్ద వెలకట్టలేని బౌద్ధధాతు పాత్ర లభించింది. బుద్ధుడు లేదా బౌద్ధ సన్యాసుల్లోని ముఖ్యుడు ఈ మహాస్తూపం వద్ద ప్రార్థనలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ పురావస్తు శాఖ కొన్నేళ్లుగా 16 ఎకరాల్లో బౌద్ధస్తూప పరిరక్షణ, పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది. 1942 నుంచే ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. అప్పుడే ఇక్కడి మహాస్తూపాన్ని గుర్తించారు. తాజాగా ఇక్కడ విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే ఫణిగిరిలోని స్తూపం తూర్పుభాగంలో మంగళవారం చేపట్టిన పనుల్లో బౌద్ధధాతు పేటిక లభ్యమైంది. ఎరుపు రంగులోని మట్టిపాత్రలో వెండి పూతతో పాటు మూడు పలుచని వెండి పుష్ప రేకులు ఉన్నాయి. దీన్ని బౌద్ధుల్లోని ముఖ్య సన్యాసి వినియోగించి ఉంటారని, దీన్ని బట్టి ఇక్కడి స్తూపాన్ని పారిభోగిక స్తూపంగా పరిగణించవచ్చని ఆర్కియాలజీ విభాగం అధికారులు పేర్కొన్నారు. బౌద్ధ స్తూపాలు మూడు రకాలుగా ఉంటాయని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్య వివరించారు. వాటిని పారిభోగిక (బౌద్ధ సన్యాసులు వాడిన వస్తువులు కలది), శారీరక(బుద్ధుని శరీర అవశేషం ఉంచినది), ఉద్దేశిక(బౌద్ధ మత ప్రచారం కోసం ఉద్దేశించినది) స్తూపాలుగా పిలుస్తారని చెప్పారు. అలాగే ఇక్కడ రాగి, సీసంతో తయారైన నాణెం కూడా లభించిందని, ఇది వృత్తాకారంలో 1.3 గ్రాముల బరువుందని పేర్కొన్నారు. దీనికి ఒకవైపు మహాక్షేత్రపా మహరాజు బొమ్మ, రెండోవైపు పడవ ముద్ర ఉంది.
వెలకట్టలేని బౌద్ధ పాత్ర
Published Thu, Jan 8 2015 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM
Advertisement
Advertisement