
బంగారు తెలంగాణ నిర్మిద్దాం
నల్లగొండ : ఎందరో త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం....వారి ఆశలు, ఆశయాలు నెరవేర్చే దిశగా అందరం కృషి చేసి ‘బంగారు తెలంగాణ’ నిర్మిద్దామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం 68వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో జాతీయపతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మంత్రి గౌరవవందనం స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1969 నుంచి తెలంగాణ ఉద్యమం కోసం అనేకమంది ఆత్మబలిదానాలు చేసుకున్నారని, ఆత్మాభిమానం కోసం ప్రజల అరవైఏళ్ల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానన్నారు.
తెలంగాణ కోసం పోరాడి ఆత్మబలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, రైతులు, చేనేత కార్మికులకు రుణమాఫీ, వ్యవసాయ ఆధారిత పేద దళిత కుటుంబాలకు మూడెకరాల సాగుభూమి పంపిణీ, ఎస్సీ, ఎస్టీ యువతుల వివాహాలకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ. 50వేల ఆర్థిక సాయం, ఉద్యోగులకు తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంటు వంటి కీలక నిర్ణయాలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు.
హామీల అమలు దిశగా...
ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు రక్షిత మంచినీటిని అందించి, ఫ్లోరైడ్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. సమగ్ర సాగు,తాగునీటి పథకాలు చేపట్టి ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా సీఎం కేసీఆర్ కంకణబద్ధులై ఉన్నారన్నారు.
పంటరుణాల మాఫీ
రుణమాఫీ వల్ల జిల్లాలో సుమారు 4,20,936 మంది రైతులకు దాదాపు 1895 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాలో ప్రకృతి ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ సంవత్సరం 304.3 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను, ఇప్పటి వరకు కేవలం 124.7 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్ర మే నమోదైందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో రైతులకు ఆదుకోవడానికి జిల్లా వ్యవసాయశాఖ ప్రత్యామ్నాయ పంటల సాగు కు అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. నాగార్జునసాగ ర్ ప్రాజెక్టు నీటిమట్టం 515.8 అడుగులు ఉన్నప్పటికీ ఈ నెల 6వ తేదీన సాగర్ ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశామన్నారు.
తెలంగాణ హరితహారం
జిల్లాలో భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం ఉండాల్సిన అటవీ ప్రాంతం, కేవలం 5.8 శాతం మాత్రమే ఉందని, దీంతో తరచు కరువుకాటకాలు ఏర్పడుతున్నాయన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ హరితహారం’లో భాగంగా జిల్లా లో ఒక్కో గ్రామపంచాయతీలో ప్రతి ఏడాది 33 వేల మొక్కలు నాటడానికి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
తండాలు...పంచాయతీలు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 జనాభా కలిగిన గిరిజన తండాలను రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా మార్చుతుందన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 210 గిరిజన తం డాలను గ్రామపంచాయతీలుగా ఏర్పడబోతున్నాయన్నారు.
భూ పంపిణీ
వ్యవసాయ కూలీలుగా కొనసాగుతున్న దళిత కుటుంబాల ఆర్థిక ఉన్నతి కోసం ప్రతి కుటుంబానికి మూడు ఎకరాల భూ పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ పథకం కింద నియోజకవర్గానికి ఒకగ్రామం చొప్పున 12 గ్రామాల్లో 620 ఎకరాల భూమిని 232 మంది ఎస్సీ మహిళల కు పంపిణీ చేస్తున్నామని చెప్పా రు.
మనఊరు-మనప్రణాళిక
‘మన ఊరు-మన ప్రణాళిక’ను ప్రజల భాగస్వామ్యంతో రూపొందించామన్నారు. జిల్లాలో మొత్తం 1176 గ్రామపంచాయతీల ప్రణాళికలో 4,357 వేల కోట్ల రూపాయలు మౌలిక వసతుల కల్పనకు, మండల ప్రణాళికలో 1015 కోట్ల రూపాయలు, జిల్లా ప్రణాళికలో భాగంగా సుమారు 3500 కోట్ల రూపాయల విలువ గల పనులను గుర్తించామని, ఈ పనుల ప్రాధాన్యతననుసరించి దశలవారీగా చేపడతామన్నారు.
సమగ్రకుటుంబ సర్వే
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే విశిష్టంగా ఈ నెల 19వ తేదీన సమగ్ర సర్వే చేయిస్తున్నారని, ఈ సర్వేలో ఎన్యుమరేటర్లకు సమగ్రమైన సమాచారాన్ని అందించి, బంగారు తెలంగాణ నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలంటూ ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు.
అమరవీరుల కుటుంబాలకు చేయూత
1969 నుంచి 2014 దాకా ఎంతోమంది తెలంగాణ కోసం ఎంతోమంది ఆత్మబలిదానం చేశారని, వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవడానికి ప్రతీ అమరవీరుడి కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామన్నారు. అమరువీరుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని, అంతేకాకుండా ఉద్యమకారులపై నమోదైన కేసులన్నింటిని మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణ యం తీసుకుందన్నారు.
ముస్లిం రిజర్వేషన్లు
సమాజంలో అసమానతలు తొలగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, జనాభా నిష్పత్తిలో అవకాశాలు అందరికి దక్కాలని, అందుకే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి అన్నారు. అందుకోసం కమిషన్ ఏర్పాటు చేశామని, ఈ కమిషన్‌కు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ చిరంజీవులు, జెడ్పీచైర్మన్ బాలునాయక్, నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గాదరి కిశోర్, వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు దుబ్బాక నర్సింహారెడ్డి, చాడ కిషన్‌రెడ్డి, సీపీఎం నేతలు నర్రా రాఘవరెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, చెరుపల్లి సీతారాములు, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, జాయింట్ కలెక్టర్ ప్రీతీమీనా, ఏఎస్పీ రమారాజేశ్వరి, ఏజేసీ వెంకట్రావు పాల్గొన్నారు.