
వాగులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
సాక్షి, కొత్తగూడ(వరంగల్) : డ్రైవర్ సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ నడపడం వల్ల ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లిన సంఘటన మండలంలోని కొత్తపల్లి వాగు వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం నర్సంపేట నుంచి కోనాపూర్ వెళ్లే బస్సు 45 మంది ప్రయాణికులతో వెళ్తోంది. కొత్తపల్లి పెద్దచెరువుకు వెళ్లే వాగు సమీపంలో డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడుతూ బస్సు నడుపుతున్నాడు. రోడ్డు నుంచి సరిగా కల్వర్ట్ ఎక్కే సమయంలో బస్సు అదుపుతప్పి ఒక వైపు మొత్తం కల్వర్ కిందకు ఒరిగింది. బస్సు హౌసింగ్, ఒకటైర్ పై బస్సు మొత్తం ఆగింది. బస్సును అదుపు చేసే క్రమంలో హఠాత్తుగా బ్రేక్ వేయడం, బస్సు ఒక వైపు ఒరగడంతో ప్రయాణికులు ఒకరిపై మరొకరు పడిపోయారు.
దీంతో పలువురు ప్రమాణికులతోపాటు కండక్టర్ భూక్యా రమకు గాయాలయ్యాయి. ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సు తక్కువ వేగంతో వస్తుండడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. విషయం తెలుసుకున్న డిపో మేనేజర్ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిని తీరును తెలుసుకున్నారు. కాగా బస్సు కండీషన్ సరిగా లేదని తెలుస్తోంది. ఇదే బస్సు 2016లో వరంగల్ జిల్లా ధర్మారం వద్ద డ్రైవర్ బ్రేక్ వేయడంతో ఎడమవైపు లాగి ముందు వెళ్లే మోటార్ సైకిల్‌పైకి దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందారు.
మరోసారి కొత్తగూడ మండలకేంద్రంలో ఫారెస్ట్ కార్యాలయం వద్ద ముందు టైర్ ఊడిపోయింది. ప్రస్తుతం మంగళవారం కొత్తపల్లి వద్ద కూడా బ్రేక్ వేయడంతో ఎడమ వైపునకు లాక్కుపోయింది. దీంతో డ్రైవర్ నిర్లక్ష్యమా, లేక ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యమా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా నిరుపేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో భద్రత తగ్గుతోందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం పాత బస్సుల కండీషన్‌పై, డ్రైవర్ల పనితీరుపై దృష్టి కేంద్రీకరించాలని కోరుతున్నారు.
చచ్చిపోతామనుకున్నా..
బస్సు ఒక్కసారిగా వాగులోకి దూసుకెళ్లింది. ఇక మా పనైపోయింది అనుకున్నాం. ఒకరిపై ఒకరు పడిపోయారు. తేరుకునేసరికి ప్రాణాలు అరచేతిలోకి వచ్చాయి. డ్రైవర్ చాలా సేపటి నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ బస్సు నడిపాడు. సెల్‌ఫోన్‌పై ఉన్న సోయి పనిపై లేకపోవడమే ప్రమాదానికి కారణం అయింది. డ్రైవర్లకు డ్యూటీ సమయంలో ఫోన్ ఇవ్వొద్దు. వందలాది మంది ప్రాణాలు ఒక్కడి చేతిలో ఉంటాయి.
– విజయ, ప్రయాణికురాలు