
సాక్షి, సిటీబ్యూరో: ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల భద్రతకు సైబరాబాద్ పోలీసులు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. వారి కోసం ఇప్పటికే సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో ‘షీ షటిల్’ సర్వీసులు నడిపిస్తున్న పోలీసులు... రాత్రి సమయాల్లో వారికి మరింత భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. లేబర్ ఎంప్లాయ్‌మెంట్ ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ పేరుతో 2016 జూన్ 16న విడుదల చేసిన జీవో 51 ప్రకారం... రాత్రి సమయాల్లో మహిళలకు తప్పనిసరిగా రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలని, ఆ బాధ్యతలను ఆయా కంపెనీలు చూసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ బుధవారం ఆదేశించారు. ఏదైనా పని నిమిత్తం కంపెనీ ఏర్పాటు చేసే క్యాబ్‌లలో వెళ్లని పక్షంలో సదరు ఉద్యోగినులు కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఉద్యోగులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. చాలా సందర్భాల్లో కార్యాలయాలకు వెళ్లిన మహిళలు ఇంటికి తిరిగిరాని పక్షంలో కుటుంబసభ్యులు కంగారుపడి పోలీసులను ఆశ్రయిస్తున్న సంఘటనలు పెరుగుతుండడంతో సీపీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాలకు ఐటీ కంపెనీలు సమ్మతించాయి. మహిళల కోసం క్యాబ్‌లు నడుపుతామంటూ తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment