
సాక్షి, సిటీబ్యూరో: ఆస్తుల సేకరణ పూర్తికానందున ఎంతోకాలంగా ముందుకు సాగని జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులిక వేగం పుంజుకోనున్నాయి. వాస్తవానికి గత సంవత్సరమేఈ కారిడార్ పనులు పూర్తి కావాల్సి ఉండగా, నిర్మాణ పనులకు అవసరమైన ఆస్తుల సేకరణలో 21 ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఆస్తుల సేకరణ పూర్తయిందని, ఇప్పుడిక పనుల వేగం పెంచుతామనిఅధికారులు చెబుతున్నారు.
దుర్గం చెరువుకు అనుసంధానం..
దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న కేబుల్ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తయినప్పటికీ, రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పూర్తయితేనే దాన్ని ప్రారంభించనున్నారు. లేని పక్షంలో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తనుండటంతో రోడ్‌నెంబర్ 45 పనుల్ని వీలైనంత త్వరితంగా పూర్తిచేసేందుకుఅధికారులు చర్యల్లో మునిగారు. దుర్గం చెరువు, రోడ్‌నెంబర్ 45 పనులు పూర్తయితే ఐటీ కారిడార్ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు తగ్గుతాయని భావించిన మునిసిపల్ మంత్రి కేటీఆర్ సైతం వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నెల ఆరంభంలో ఈ ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పరిశీలించారు. విద్యుత్ లైన్ల తరలింపు పనులు జరగాల్సి ఉందని జీహెచ్‌ఎంసీ అధికారులు మంత్రి దృష్టికి తేవడంతో వెంటనే విద్యుత్ అధికారులతో మాట్లాడారు. వారు రెండు వారాల్లోగా విద్యుత్ లైన్లు తరలిస్తామని హామీ ఇచ్చారు. అందుకనుగుణంగా విద్యుత్ అధికారులు తగు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కారిడార్ పనులు జరిపేందుకు అవసరమైన మేర విద్యుత్ లైన్ల తరలింపు మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కానున్నట్లు సమాచారం. దాంతో ఎలివేటెడ్ కారిడార్ పనులు చేసేందుకు మార్గం సుగమమవుతుంది. ఆస్తుల సేకరణ, యుటిలిటీస్ తరలింపు పనుల సమస్యలు కొలిక్కి రావడంతో సత్వరం పనులు పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.
జూన్ 2న ప్రారంభించే యోచనలో..
రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన దుర్గం చెరువు కేబుల్ వంతెనతో పాటు రోడ్‌నెంబర్ 45 కారిడార్‌లను ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. యంత్రాలు, కార్మికుల సంఖ్యను పెంచైనా సరే పనులు పూర్తిచేయాలని మునిసిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో కాంట్రాక్టు ఏజెన్సీ, అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. దుర్గం చెరువు పనులు దాదాపుగా ఇప్పటికే పూర్తయినా, రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ పనులు జరగాల్సి ఉంది. రోడ్‌నెంబర్ 45 ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పూర్తయితే, పంజగుట్ట, బంజారాహిల్స్‌ల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వరకు సాఫీగా సాగిపోవచ్చు. తద్వారా ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ చిక్కులు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ ఎలివేటెడ్ కారిడార్ అంచనా వ్యయం రూ.150 కోట్లు.
షేక్‌పేట కారిడార్‌కు తొలగనున్న ఇబ్బందులు..
దీంతోపాటు దాదాపు రూ.335 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన షేక్‌పేట ఎలివేటెడ్ కారిడార్ పనులకు కూడా సమస్యలు తొలగనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. దీని నిర్మాణానికి అవసరమైన భారీ ఆస్తి సేకరణ పూర్తయిందని, అంతమేర పనులు చేపట్టేందుకు వీలుందని అధికారులు తెలిపారు. మిగతా ఆస్తుల సేకరణ కూడా ఈనెలాఖరు వరకు పూర్తిచేయనున్నట్లు సంబంధిత టౌన్ ప్లానింగ్ విభాగం చెబుతోంది. దీని నిర్మాణం పూర్తయితే మెహిదీపట్నం, సెవెన్ టూంబ్స్, ఫిల్మ్‌నగర్ తదితర మార్గాల నుంచి ఐటీ కారిడార్‌కు వెళ్లేవారికి ట్రాఫిక్ చిక్కులు తగ్గుతాయి.
Comments
Please login to add a commentAdd a comment