సబ్సిడీ కట్
కొత్తగూడెం : ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా విడుదలయ్యే నిధులతో ఆయా వర్గాల వారికే లబ్ధి చేకూరేలా ప్రవేశపెట్టిన పథకాలు అర్హులకు అందడం లేదు. 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ఈ నిధుల నుంచే బిల్లులు చెల్లించాల్సి ఉంది. అయితే వీటి విడుదలలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏడాది క్రితం నుంచి పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ ట్రాన్స్‌కో అధికారులు చెపుతుండడంతో పేద గిరిజన, దళిత వర్గాల వారు లబోదిబోమంటున్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో దళితులు, గిరిజనులకు చెందిన బకాయిలను రద్దు చేయడంతోపాటు 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే వారికి బిల్లు మాఫీ అయ్యేలా గత ప్రభుత్వం తీర్మానించింది. ఇందుకు సంబంధించి జిల్లాలో 2013 మార్చి వరకు 22,327 మంది ఎస్సీలకు చెందిన రూ.4.51 కోట్లు, 48,054 మంది గిరిజనులకు చెందిన రూ.6.02 కోట్ల బకాయిలు రద్దు చేయాలని అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీల బకాయిలను ఎస్సీ కార్పొరేషన్, గిరిజనుల బకాయిలను ఐటీడీఏ నుంచి ట్రాన్స్‌కోకు చెల్లించాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి నిధులు విడుదల చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. బకాయిలు పెరగడంతో ఇప్పుడు వాటిని లబ్ధిదారుల నుంచి వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో అధికారులు రంగం సిద్ధం చేశారు.
పైసా విదల్చని ఐటీడీఏ..
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల ద్వారా ఎస్టీలకు సంబంధించిన రూ.6.02 కోట్ల బకాయిలను జిల్లాలోని గిరిజన సమీకృతాబివృద్ధి సంస్థ (ఐటీడీఏ) భద్రాచలం వారు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఏడాది కాలంగా ట్రాన్స్‌కోకు ఈ నిధులు చెల్లించడంలో జాప్యం చేయడంతో ఇప్పుడు రద్దయిన బకాయిలు తిరిగి వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. ట్రాన్స్‌కో అధికారులు అడిగినప్పుడు నిధులు ఇస్తామని చెపుతున్న ఐటీడీఏ అధికారులు.. ఆ తర్వాత ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇక ఎస్సీలకు సంబంధించిన రూ.4.51 కోట్ల బకాయిలో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు రూ.2.25 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2.26 కోట్లు విడుదల చేయలేదు. దీంతో ఈ మొత్తాన్ని కూడా వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో సిద్ధమైంది.
ఆందోళనలో గిరిజనులు, దళితులు..
ఏడాది క్రితం రద్దు చేసిన బకాయిలను జూన్ నెల బిల్లులో కలిపి ఇవ్వడం, తప్పనిసరిగా అవి చెల్లించాల్సిందేనని విద్యుత్ శాఖ సిబ్బంది చెప్పడంతో జిల్లాలోని సుమారు 70 వేల మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఎస్‌ఈ తిరుమలరావును వివరణ కోరగా సంబంధిత శాఖలు బకాయి సొమ్ము చెల్లించకపోవడంతో లబ్ధిదారుల నుంచి వసూలు చేసేందుకు ఈ నెల బిల్లులో వాటిని చేర్చామని తెలిపారు. అయితే వాటిని చెల్లించాలని తమ సిబ్బంది ఎవరినీ బలవంత పెట్టడం లేదని చెప్పడం గమనార్హం.
ఒకేసారి బిల్లు వస్తే చెల్లించేదెలా
నేను నెలకు 50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్నాను. ఏడాది నుంచి ఇప్పటి వరకు బిల్లు మాత్రం రాలేదు. ఈ నెలలో కరెంట్ వాళ్లు వచ్చి బిల్లు ఇచ్చారు. అందులో ఈ నెలకు చెందిన రూ.167తో పాటు బకాయికి సంబంధించి రూ.692 కలిపి ఇచ్చారు. మాఫీ అయిపోయాయని అనుకున్న బిల్లులు ఇప్పుడు చెల్లించమంటే ఎలా.. దీనిపై అధికారులు మరోసారి ఆలోచించి రద్దైన బకాయిలను వదిలివేయాలి.