సాక్షి, హైదరాబాద్: ఏదైనా భూమిని ప్రభుత్వానిదిగా పేర్కొంటూ ఆ భూమికి సంబంధించిన సేల్ డీడ్‌ను రద్దు చేయాలని కోరే అధికారం తహసీల్దార్‌కు, అలా కోరినప్పుడు సేల్ డీడ్‌ను రద్దు చేసే అధికారం సబ్ రిజిస్ట్రార్లకు ఉందంటూ ఇటీవల సింగిల్ జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు ఇచ్చిన తీర్పును ద్విసభ్య ధర్మాసనం రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి తీర్పునివ్వాలంటూ తమ ముందున్న వ్యాజ్యాలను సింగిల్ జడ్జి వద్దకే పంపింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా కంది తహసీల్దార్ అభ్యర్థన మేరకు సబ్ రిజిస్ట్రార్ ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే తమ భూమికి చెందిన సేల్ డీడ్‌ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ లక్ష్మీప్రసన్న, శ్రీనివాసరావు, రంగారావు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఆ అధికారం ఉందన్న జస్టిస్ నవీన్‌రావు
ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన జస్టిస్ నవీన్‌రావు ఫలానా భూమి ప్రభుత్వానిదని, దానిని ప్రైవేటు వ్యక్తులు రిజిస్టర్ చేయించుకున్నారని, అందువల్ల ఆ సేల్ డీడ్‌ను రద్దు చేయాలని తహసీల్దార్/ఎమ్మార్వో కోరినప్పుడు ఆ డీడ్‌ను రద్దు చేసే అధికారం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఉందని సెప్టెంబర్ 21న తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ లక్ష్మీప్రసన్న తదితరులు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ ప్రారంభించింది. కాగా, కంది మండలం, కంది చిమ్నాపూర్ గ్రామంలో స్థానిక తహసీల్దార్ అభ్యర్థన మేరకు సబ్ రిజిస్ట్రార్ తమ రెండు సేల్ డీడ్లను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సతీష్‌యాదవ్ తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సింగిల్ జడ్జి జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ జరిపారు. ఇలా సేల్ డీడ్లను రద్దు చేసే విషయంలో తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్లకు అధికారం ఉందంటూ అంతకు ముందు జస్టిస్ నవీన్‌రావు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించడం లేదని జస్టిస్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ఓ భూమిపై యాజమాన్య హక్కులు ఎవరివో తేల్చాల్సింది కోర్టులే తప్ప, తహసీల్దార్/ఎమ్మార్వోలు ఎంత మాత్రం కాదని వ్యాఖ్యానించారు. యాజమాన్య హక్కులు తేల్చడంతో పాటు సేల్‌డీడ్ల రద్దు కోరే అధికారం వారికి ఇస్తే పలు అనర్థాలు తలెత్తుతాయని అభిప్రాయపడిన విషయం తెలిసిందే.
లోతుగా విచారణ జరపాలి..
బుధవారం తమ ముందున్న అప్పీళ్లపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఏళ్ల తరబడి తమ స్వాధీనంలో ఉన్న భూముల విషయంలో అధికారుల జోక్యం తగదని, ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండా సేల్ డీడ్లు రద్దు చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు చెబుతున్న భూములు ప్రభుత్వ భూములని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సేల్ డీడ్ల రద్దు విషయంలో తహసీల్దార్ చర్యలు చట్టవిరుద్ధమని ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఆ భూములు ప్రభుత్వానివని ఏజీ చెబుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందువల్ల ఈ వ్యాజ్యాలపై మళ్లీ సింగిల్ జడ్జే విచారణ జరిపి, అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని తీర్పునివ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న అప్పీళ్లను సింగిల్ జడ్జికి పంపింది. ఇప్పుడున్న రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యాలపై జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు విచారణ జరపనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment