గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను కరీంనగర్ జిల్లా గోదావరిఖని పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. వారి నుంచి రూ.11.50 లక్షల విలువైన 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాలివీ...
రామగుండం మండలం కొత్తపల్లికి చెందిన మేరుగు సదయ్య, నేరేళ్ల సదయ్య పాత నేరస్తులు. వీరు కొత్తపల్లి గ్రామానికే చెందిన గంధం రవి, గొట్టెపర్తి ధర్మేందర్, పుట్నూర్‌కు చెందిన మేకల రవీందర్, హనుమంతునిపేట వాసి త్రిదండపాణి నరేశ్‌కుమార్, సుల్తానాబాద్ మండలం ఐతురాజుపల్లికి చెందిన చీకట్ల మధు కలిసి నాలుగు రోజుల క్రితం ఆంధ్రా ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి మంగళవారం గోదావరిఖనికి చేరుకున్నారు.
గోదావరిఖనితోపాటు సమీపంలోని పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాల్లో విక్రయించాలనే ఉద్దేశంతో వెళ్లేందుకు సరుకుతో బస్టాండ్‌లో వేచి చూస్తుండగా, పక్కా సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు. నేరెళ్ల సదయ్య పోలీసులను చూసి తన గంజాయిని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. మిగతా ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సంచుల్లో ఉన్న 230 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
భద్రాచలం టు మహారాష్ట్ర..
భద్రాచలం సమీపంలోని సీలేరు, చింతూరు, మెతుకుగూడెం, విశాఖపట్టణం సమీపంలోని రంపచోడవరం, ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని మల్కనగిరి అటవీ ప్రాంతాల్లో పండించే గంజాయిని ప్రత్యేక ప్యాకింగ్‌తో స్మగ్లర్లు ఇక్కడికి తీసుకువచ్చి... తిరిగి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు రవాణా చేస్తుంటారు. ఒక కిలో గంజాయిని ఆయా ప్రాంతాల్లో రూ.1500కు కొనుగోలు చేసి దాన్ని రూ.5 వేల చొప్పున ఈ ముఠా విక్రయించి సొమ్ము చేసుకుంటోంది. మేరుగు సదయ్య, నేరెళ్ల సదయ్య గతంలో గంజాయి అమ్మి పోలీసులకు చిక్కారు. అయినా తీరు మార్చుకోని వారు ఇదే దందాలోకి మరికొందరిని లాగి జైలు పాలయ్యారు.