కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం | car, bike burning at a knight in kamareddy | Sakshi
Sakshi News home page

కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం

Published Thu, Aug 7 2014 2:29 AM | Last Updated on Thu, Sep 13 2018 3:15 PM

కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం - Sakshi

కామారెడ్డిలో అర్ధరాత్రి కలకలం

- కారు, బైకులకు నిప్పుపెట్టిన అగంతకులు
- మరో బైకును రైలు పట్టాలపై పడేశారు
- ప్రైవేటు బస్సుల్లో నుంచి వస్తువుల చోరీ

కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని అశోక్‌నగర్ కాలనీలో వాసవీస్కూల్‌కు సమీపంలోని ఓ వీధిలో మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు పలు వాహనాలను పెట్రోల్ చల్లి నిప్పంటించారు. ఈ ఘటనలో ఓ కారు, బైకు దహనం కాగా, మరో బైకును రైలు పట్టాలపై పడేయడంతో రైలు ఢీకొని తుక్కుతుక్కయ్యింది. ఇంకో బైకును దహనం చేయడానికి ప్రయత్నించారు. అదే వీధిలో రెండు ప్రైవేటు బస్సుల్లో నుంచి డీవీడీ ప్లేయర్లు, ఇతర సామగ్రిని ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం... 5-8-407/బీ నంబరు గల ఇంటిలో నెల క్రితమే అద్దెకు చేరిన కృష్ణా జిల్లాకు చెందిన ఉప్పు రాజగోపాల్ అనే కాంట్రాక్టర్ రోజులాగే రాత్రి ఇంటి ముందర తన నిస్సాన్ మిక్రా కారు (ఏపీ 16జీ 14 నంబరు)ను నిలిపి ఉంచారు.

అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కారు నిప్పంటుకుంది. వీధిలోని వారందరూ లేచి చూసేసరికి కారు కాలుతూ ఉంది. పక్కనే ఉన్న 5-8-407 నంబరు గల ఇంటి గేటుకు తాళం లేకపోవడంతో దుండగులు అందులోకి ప్రవేశించి ఇంట్లో అద్దెకు ఉంటున్న సూరేటి రాజిరెడ్డికి చెందిన (ఏపీ 25ఏపీ 4380) నంబరు గల ప్యాషన్ ప్రో బైకును దహనం చేశారు. రాజిరెడ్డి వారం క్రితమే ఆ ఇంట్లోకి అద్దెకు వచ్చాడు. అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న బి.జగన్ అనే వ్యక్తికి చెందిన (ఏపీ 25 సీ 9147)నంబరు గల స్ల్పెండర్ బైకును సమీపంలోని రైలు పట్టాలపైకి తీసుకెళ్లి పడేశారు.

రాత్రిపూట వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టడంతో బైకు తుక్కుతుక్కయ్యింది. జగన్ 20 రోజుల క్రితం ఇంట్లో అద్దెకు దిగాడు. సమీపంలోని ప్రధాన రోడ్డుపై నిలిపి ఉంచిన ప్రైవేటు బస్సుల్లో నుంచి డెక్కులు, ఇతర సామగ్రిని కూడా దుండగులు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఎవరూ దొరకలేదు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ సురేందర్‌రెడ్డి, పట్టణ సీఐ కృష్ణ, ఎస్సై మధు పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 
మిస్టరీగా మారిన వాహనాల దహనం...

దొంగలైతే వాహనాలను ఎత్తుకెళతారు. ఇక్కడ కారు, బైకును దహనం చేయడం, మరో బైకును పట్టాలపై వదలడం, ఇంకో వాహనాన్ని దహనం చేయడానికి ప్రయత్నించడం వంటి సంఘటనలు మిస్టరీగా మారాయి. వాహనాల యజమానులకు ఎవరితోనైనా వ్యక్తిగత కక్షలతో జరిగాయా అంటే, ఆ ముగ్గురూ ఇతర ప్రాంతాలకు చెందిన వారు కావడం, వారు ఈ మధ్యనే ఆ ఇళ్లలో అద్దెకు దిగడం వల్ల వ్యక్తిగత కక్షలతో జరిగి ఉండకపోవచ ్చంటున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తామని డీఎస్పీ సురేందర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement