మాదాపూర్‌లో కారు బోల్తా  | Car roll over in Madhapur | Sakshi
Sakshi News home page

మాదాపూర్‌లో కారు బోల్తా 

Published Mon, Jul 29 2019 2:47 AM | Last Updated on Mon, Jul 29 2019 2:47 AM

Car roll over in Madhapur - Sakshi

ప్రమాదంలో నుజ్జునుజ్జయిన కారు. (ఇన్‌సెట్‌లో) సాయి విహిత

హైదరాబాద్‌: సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని మాదాపూర్‌లో ఆదివారం ఉదయం›4.30 ప్రాంతంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో అదే కారులో ప్రయాణిస్తున్న బీటెక్‌ విద్యార్థిని చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. కారును డ్రైవ్‌ చేసిన యువకుడు మద్యం సేవించి ఉండటమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీలోని గుంటూరులోని బ్రాడీపేటకు చెందిన సాయి విహిత (20) కూకట్‌పల్లిలోని హాస్టల్‌లో ఉంటోంది.

గీతం యూనివర్సిటీలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతోంది. అదే కాలేజీ నుంచి బీటెక్‌ పూర్తి చేసిన కూకట్‌పల్లి వాసి సుచిత్‌బాబు (28) ఈమెకు స్నేహితుడు. ప్రాజెక్టు వర్క్‌ పని ఉందంటూ విహి త వారం రోజులుగా కాలేజీకి వెళ్లట్లేదు. శనివారం రాత్రి ప్రాజెక్ట్‌ వర్క్‌ నిమిత్తం సుచిత్‌తో కలసి అతడి కారులో (ఏపీ37 ఎస్‌ 0444) హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లింది. ఆదివారం ఈ వాహనం మాదాపూర్‌లోని వంద అడుగుల రోడ్డులో ప్రయాణిస్తోంది.

పర్వత్‌నగర్‌ చౌరస్తా, కల్లు కాంపౌండ్‌ చౌరస్తా మధ్య ఉన్న రెస్ట్రో హోటల్‌ వద్ద మితిమీరిన వేగం కారణంగా కారు అదుపు తప్పింది. అక్కడ ఉన్న ఓ ఆటోను వెనుక నుంచి ఢీకొంది. అప్పటికీ అదుపులోకి రాని కారు ఫుట్‌పాత్‌ ఎక్కి బోల్తా కొట్టింది. ఈ ప్రమా దంలో కారు నుంచి బయటకు పడిపోయిన విహిత తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఆటోడ్రైవర్‌ చందర్‌కు కుడికాలు, మెడ వద్ద గాయాలయ్యా యి. ప్రమాదంపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి, విహిత మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

ఆమె కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కారును వదిలి పారిపోయిన సుచిత్‌బాబు సెల్‌ఫోన్‌ అందులోనే పడిపోయింది. దీన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కాల్‌ రికార్డుల్ని పరిశీలించారు. శనివారం తర్వాత అతడికి వచ్చిన ఫోన్‌కాల్స్‌లోని సంభాషణలు, కారులో లభించిన మద్యం సీసాల ఆధారంగా ఇది డ్రంక్‌ అండ్‌ డ్రైవింగ్‌గా అనుమానిస్తున్నారు. సుచిత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తేనే వీరి ద్దరూ ఎక్కడకు వెళ్లారు? ఏ సమయంలో వెళ్లారు? తదితర వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement