గొంతులో ఇరుక్కున్న ఎముక ముక్క ,వెలికితీసిన మాంసం ఎముక ముక్కలు
సాక్షి, సిటీబ్యూరో: భోజనం చేస్తుండగా గొంతులో ఇరికిన ఎముకను కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు. లేజర్ సహాయంతో ఎలాంటి సర్జరీ అవసరం లేకుండా మటన్‌బోన్‌ను తొలగించారు. ప్రస్తుతం బాధితుడు కోలుకోవడంతో బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. హైదరాబాద్‌కు చెందిన యువకుడు (30) ఇటీవల ఓ విందుకు హాజరయ్యాడు. విందులో మాంసాహారం భోజనం చేస్తుండగా మాంసం ఎముక గొంతు మధ్యలో ఇరుక్కుని అన్న వాహికకు అడ్డుపడింది. ఎముక ముక్క గొంతు లోపలి భాగంలో రెండు వైపులా గుచ్చుకోవడంతో గాయమైంది. అన్నవాహిక వాపుతో పాటు తీవ్రమైన నొప్పితో బాధ పడటమే కాకుండా ఇటు మింగలేక..
అటు కక్కలేని పరిస్థితుల్లో ఉన్న అతడిని బంధువులు చికిత్స కోసం ఈ నెల 12న బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఈఎన్‌టీ నిపుణుడు డాక్టర్ విష్ణుస్వరూప్‌రెడ్డి, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ భవానీరాజు, యూరాలజిస్ట్ వంశీకృష్ణల నేతృత్వంలోని వైద్య బృందం బాధితుడికి చికిత్స చేసింది. తొలుత ఎండోస్కోపీ సహాయంతో తొలగించాలని వైద్యులు భావించారు. అది కుదరక పోవడంతో లేజర్ సాంకేతిక పరిజ్ఞానంతో.. గొంతుకు అడ్డుగా ఉన్న ఎముకను రెండు ముక్కలుగా కట్ చేసి, ఆ తర్వాత వాటిని తొలగించారు. సాధారణంగా ఈ లేజర్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో ఉపయోగిస్తారు. గొంతులో ఇరికిన ఎముకను తొలగించడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేర్ వైద్యులు ఉపయోగించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment