‘ఉద్యమ’ కేసుల ఎత్తివేత
ఆస్పత్రిలోనే ఫైలుమీద సంతకం చేసిన హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన 698 కేసులను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ఫైలుపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి బుధవారం సంతకం చేశారు. వైరల్ జ్వరంతో బాధపడుతూ సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాయిని ఈ ఫైలును ఆస్పత్రికే తెప్పించుకుని సంతకం చేశారు. ఉద్యమం సందర్భంగా అనేకమంది విద్యార్థులు, పార్టీల నేతలు, ఉద్యోగ సంఘాల నాయకులపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను ఎత్తివేస్తామని గతంలోనే హామీఇచ్చినా, అమలుకాలేదు. ఈ నేపథ్యంలో ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తామంటూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హామీ ఇచ్చింది. దీనికి న్యాయపరమైన చిక్కులతో జాప్యం జరిగిందని, వాటిని పరిష్కరించుకుంటూ ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలనే నిర్ణయాన్ని అమలుచేస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.