
ముంపు రైతులకు న్యాయం చేయాలి
గోపాల్‌పేట : వర్షాభావ పరిస్థితుల కారణంగా పంట పెట్టుబడికి పెట్టిన అప్పులు తీర్చే మార్గంలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే అభయమివ్వాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఈ నేపథ్యంలో ముంపు భూములతో రైతులను మరింత ఆందోళనకు గురిచేయవద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఈర్ల నర్సింహ అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తమ పార్టీ వ్యతిరేక కాదన్నారు. కానీ ముంపు రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. శుక్రవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి బండరావిపాకులలో దీక్షలు చేస్తున్న ముంపు భూముల రైతులకు సంఘీభావం తెలిపారు.
అనంతరం ఏదుల, కొంకలపల్లి గ్రామాలను సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. అనంతరం గోపాల్‌పేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూములు తీసుకునే ముందు రైతుల ఆంగీకారం కచ్చితంగా తీసుకోవాలని భూసేకరణ చట్టం చెబుతుందన్నారు. ఇప్పుడున్న మార్కెట్ రేటుకు నాలుగు రెట్లు జోడించి బాధిత రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. భూమి కోల్పోయిన రైతుకు మరోచోట భూమి చూపించడం, లేదా పరిహారాన్ని పెంచి ఇవ్వడం, ఇండ్లు కోల్పోతున్న వారికి అనువైన చోట పున రావాసం కల్పించడం, 98 జీవో ప్రకారం కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు ప్రభుత్వం వెయ్యి కోట్లు ఖర్చు చేసి పూర్తి చేయగలిగితే 8లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. కలెక్టర్, అధికారులు భూములు ఇవ్వకుంటే లాక్కుంటామని రైతులను బెదిరించడం మంచిపద్ధతి కాదన్నారు. ఆదివారం సీపీఐ రాష్ట్ర బృందం బండరావిపాకులను సందర్శించి ముంపు రైతులతో మాట్లాడుతారని తెలిపారు. సమావేశంలో డి.చంద్రయ్య, జె. చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.