సాక్షి, హైదరాబాద్: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి అడ్డంగా దొరికిపోయిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగిపై సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ఇస్నాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఫీల్డ్ అధికారిగా పనిచేస్తున్న పెద్దశెట్టి దుర్గాప్రసాద్ బ్యాంకులో ఇప్పటికే రుణగ్రహీతలుగా ఉన్న వారి పేర్ల మీద ఇంటి లోన్లు తీశాడు. ఈ విషయం ఖాతాదారులకు తెలియకుండా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.11.11కోట్ల రుణాలు తీసుకున్నాడు.
ఈ డబ్బును రుణగ్రహీతల అకౌంట్ల నుంచి నేరుగా ప్రసాద్ తన వ్యక్తిగత అకౌంట్లతోపాటు పలువురు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి మళ్లించినట్టు, 2016 నుంచి 2017 వరకు ఈ తతంగం నడిచినట్టు ఆధారాలతో సీబీఐ గుర్తించింది. అయితే ఈ డబ్బును వివిధ కంపెనీల మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడని, అదేవిధంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వాధికారిగా ఉంటూ మోసానికి పాల్పడ్డ దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ హైదరాబాద్ రేంజ్ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment