APGVB bank
-
రైతుబంధుకు బ్యాంకర్ల మోకాలడ్డు.. బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వానాకాలానికి సంబంధించి రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఐదెకరాల లోపు ఉన్న వారంతా చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందుకోకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. పంట రుణం బకాయిలున్నాయంటూ ఈ రైతుబంధు డబ్బులను డ్రా చేసుకోనివ్వడం లేదు. ఆయా రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారు. ఈ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క శాఖలోనే 500 ఖాతాలు హోల్డ్ ఏపీజీవీబీ బ్యాంకుకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 53 శాఖలు ఉన్నాయి. ఒక్క వట్పల్లి బ్రాంచ్‌లోనే సుమా రు 500 మంది రైతుల ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టారు. వీరి ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు, ధాన్యం డబ్బులను విత్‌డ్రా చేసుకోనివ్వడం లేదు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లగా.. ఫీల్డ్ ఆఫీసర్ లేడని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. సాగు ఖర్చుల కోసం.. ప్రస్తుతం వానాకాలం పంట సీజను ప్రారంభమైంది. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ కిరాయి ఇలా సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు అవసరం ఉంటుంది. వచ్చిన రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఖర్చుల కోసం తాము ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. అధిక వడ్డీకైనా అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గత రబీ సీజనులో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం డబ్బులను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేసింది. పంట రుణం రెన్యువల్ చేసుకోలేదంటూ ఈ డబ్బులను కూడా డ్రా చేసుకోనివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. రెన్యువల్ చేసుకుంది 20 శాతం లోపే.. రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాలను ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేస్తోంది. మాఫీ కాని చాలామంది రైతులు తమ పంట రుణా లను రెన్యువల్ చేసుకోలేదు. కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం ఎలాగైనా మాఫీ చేస్తుందని రెన్యు వల్ చేసుకోలేదు. రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతు లు 20 శాతంలోపే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో మిగిలిన 80 శాతం మంది రైతుల్లో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని అంచనా. బదిలీపై వచ్చిన మేనేజర్లకు తెలియక కొన్ని బ్రాంచ్‌లకు మేనేజర్లు ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వస్తుంటారు. రైతుబంధు డబ్బులు ఆపొద్దని తెలియక వారు ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రైతుబంధు డబ్బులు ఆపొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. రుణమాఫీ అవుతుందనే కారణంగా చాలామంది పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడం లేదు. – గోపాల్‌రెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్, సంగారెడ్డి ఈ రైతు పేరు నరేందర్‌గౌడ్. సంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామం. తన 2.62 ఎకరాలకు సంబంధించి రైతుబంధు కింద రూ.13,100 బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఖరీఫ్ పంట సాగు ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు వట్‌పల్లిలోని ఏపీజీవీబీ బ్యాంకుకెళ్లాడు. అయితే, బ్యాంకు అధికారులు రూ.1.60 లక్షల పంట రుణ బకాయి ఉందని, ఈ రుణాన్ని రెన్యువల్ చేసుకోనందున ఖాతాను హోల్డ్‌లో పెట్టామని చెప్పారు. దీంతో రైతుబంధు డబ్బులు డ్రా చేసుకోలేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలపూర్ డీకే గ్రామానికి చెందిన అంబయ్యకు మూడెకరాల భూమి ఉంది. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రూ.80 వేల వరకు పంట రుణం ఉంది. ఇటీవల రైతుబంధు కింద ఖాతాలో జమ అయిన డబ్బులను పంట పెట్టుబడికి డ్రా చేసుకుందామంటే బ్యాంకర్లు అనుమతించడం లేదని అంబయ్య వాపోయాడు. -
ఏపీ గ్రామీణ బ్యాంకుకు కుచ్చుటోపీ
సాక్షి, హైదరాబాద్: పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసి అడ్డంగా దొరికిపోయిన ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఉద్యోగిపై సీబీఐ హైదరాబాద్ రేంజ్ అధికారులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇస్నాపూర్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులో ఫీల్డ్ అధికారిగా పనిచేస్తున్న పెద్దశెట్టి దుర్గాప్రసాద్ బ్యాంకులో ఇప్పటికే రుణగ్రహీతలుగా ఉన్న వారి పేర్ల మీద ఇంటి లోన్లు తీశాడు. ఈ విషయం ఖాతాదారులకు తెలియకుండా నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో రూ.11.11కోట్ల రుణాలు తీసుకున్నాడు. ఈ డబ్బును రుణగ్రహీతల అకౌంట్ల నుంచి నేరుగా ప్రసాద్ తన వ్యక్తిగత అకౌంట్లతోపాటు పలువురు ప్రైవేట్ వ్యక్తుల అకౌంట్లలోకి మళ్లించినట్టు, 2016 నుంచి 2017 వరకు ఈ తతంగం నడిచినట్టు ఆధారాలతో సీబీఐ గుర్తించింది. అయితే ఈ డబ్బును వివిధ కంపెనీల మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేశాడని, అదేవిధంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టినట్టు సీబీఐ ఎఫ్ఐఆర్లో స్పష్టంగా పేర్కొంది. ప్రభుత్వాధికారిగా ఉంటూ మోసానికి పాల్పడ్డ దుర్గాప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్టు సీబీఐ హైదరాబాద్ రేంజ్ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. -
'ఆసరా' కోసం వచ్చిన వృద్ధుడి మృతి
చింతకాని: ఆసరా పింఛన్ కోసం వచ్చిన వృద్ధుడు బ్యాంకు ఆవరణలో మృతిచెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. సీతంపేట గ్రామానికి చెందిన నారపోగు పుల్లయ్య(80) పింఛన్ కోసం నాగులవంచ ఏపీజీవీబీ బ్యాంకుకు వచ్చాడు. అయితే క్యూలో చాలాసేపు నిలబడ్డ ఆ వృద్ధుడు తన వంతు ఆలస్యం కావడంతో ఓపిక నశించిపోయి కుప్పకూలిపోయాడు. లైన్లో ఉన్న వారు పుల్లయ్యను కదిలించి చూడగా, చలనం లేదని గుర్తించారు. దీంతో ఆసరా కోసం వచ్చిన ఆ వృద్ధుడు శవమైపోయాడని అక్కడి వారు చెబుతున్నారు. -
బ్యాంకు దోపిడీ ఛేదించిన పోలీసులు
* అటెండర్ పనే.. * నిందితుడు రమేష్ భార్య అరెస్ట్ * 34 కిలోల బంగారం.. రూ.2 లక్షలు స్వాధీనం వరంగల్ క్రైం/భూపాలపల్లి : భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీబీ శాఖల్లో దోపిడీ ఇంటి దొంగల పనేనని తేలింది. భూపాలపల్లి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రమేష్ సూత్రధారి, పాత్రధారి అని బహిర్గతమైంది. నిందితుడికి సహకరించింది ఆయన భార్య రమాదేవి అని తేటతెల్లమైంది. ఆమెను పోలీసులు శుక్రవారం రాత్రి హసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో పట్టుకోగా... దోపిడీ ఘట్టం బట్టబయలైంది. ఈ మేరకు హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లిలోని రెడ్డికాలనీలో వెలుమ రాజేంద్రప్రసాద్ అలియాస్ రమేష్‌తోపాటు ఆయన భార్య రమాదేవి నివసిస్తున్నారు. రమేష్ ఏపీజీవీ బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల సమయంలో భూపాలపల్లి, ఆజంనగర్ బ్యాంకు శాఖల్లోని డబ్బు, నగదును దోచుకున్నాడు. ఇంటికి వచ్చి భార్యతో బయటకు వెళ్లాలని చెప్పాడు. రమేష్‌కు పరిచయం ఉన్న తవేరా డ్రైవర్ అంకుశవాలితో శ్రీశైలం, బాసరకు కిరాయి మాట్లాడుకున్నాడు. 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో రమేష్, అతని భార్య రమాదేవి, కుమారుడు, కూతురు కలిసి భూపాలపల్లి నుంచి హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వెళ్లారు. 16న దైవదర్శనం చేసుకుని తిరిగి అదేరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఓ లాడ్జిలో బసచేసి 17వ తేదీన బాసరకు చేరుకున్నారు. షిరిడికి వెళ్దామంటే డ్రైవర్ సహకరించకపోవడంతో రూ.20 వేలు ఇచ్చి అతడిని అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత నిజామాబాద్ బస్టాండ్‌కు చేరుకుని, ఆ రోజు అక్కడే గడిపారు. 18న బస్సులో మహారాష్ర్ట లో బళ్లార్షాకు వెళ్లారు. గద్చిరౌలి జిల్లా సిరొంచ గ్రామంలోని బంధువుల ఇంట్లో ఆ రాత్రి గడిపారు. 19న రమేష్.. తన భార్య, కూతురుతో కలిసి మహారాష్ట్రలోని వడడం నుంచి పడవలో గోదావరి దాటి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చేరుకున్నాడు, అక్కడ తనకు పరిచయం ఉన్న లావణ్య ఇంటికి వచ్చాడు. కొంత సేపటి తర్వాత తాను తీసుకువచ్చిన బ్యాగుల్లో బట్టలు ఉన్నాయని, ఇవి ఇక్కడే పెడుతున్నామని... హన్మకొండలోని బంధువుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వారు బయటపడ్డారు. మహదేవపూర్ బస్టాండుకు వచ్చి రమాదేవి, కూతురును బస్సు ఎక్కించి... తాను త్వరలోనే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నిందితుల కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యేక పోలీసులు బృందాలు పక్కా సమాచారం మేరకు రమేష్ భార్య రమాదేవినిహసన్పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన ప్రకారం... అంబటిపల్లిలోని లావణ్య ఇంటిలో సోదా చేయగా... 1154 బ్యాగుల్లో ఉన్న రూ.9.50 కోట్ల విలువైన 34 కిలోల బంగారు నగలు, దొంగిలించిన రూ.21 లక్షల్లో రూ. 2 లక్షలు దొరికారుు. పోలీస్ సిబ్బందికి డీఐజీ అభినందనలు రాష్ట్రంలోనే సంచలనం రేపిన భూపాలపల్లి ఘట నను జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టారు. వారం రోజుల్లోనే నిందితులను గుర్తించడంతోపాటు బ్యాంకుల్లో దోపిడీలకు గురైన బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ఝాలు ఈ కేసు పరిష్కరించడం కోసం ప్రత్యేక దృష్టి సారించారు. రూరల్ క్రైం అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ పర్యవేక్షణలో పరకాల, ములుగు, మహబూబాబాద్ డీఎస్పీలు సంజీవ్‌రావు, శోభన్‌కుమార్, మురళీధర్‌తోపాటు భూపాలపల్లి,పరకాల,చిట్యాల, ములు గు, కేయూసీ ఇన్స్పెక్టర్లు రఘునందన్‌రావు, వెంకటేశ్వర్లు, రవీందర్, శ్రీధర్‌రావు, దేవేందర్‌రెడ్డి నిందితు ల ఆచూకీ కోసం శ్రమించారు. శుక్రవారం రాత్రి క్రైం అదనపు ఎస్పీకి అందిన పక్కా సమాచారం ప్రకారం డీఎస్పీ సంజీవ్‌రావు ఆధ్వర్యంలో రమాదేవిని హసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను గుర్తించడంతోపాటు దోపిడీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లతో పాటు రూరల్ సీసీఎస్ ఎస్సైలు కిషన్, గౌస్, హెడ్ కానిస్టేబుళ్లు సంజీవరెడ్డి, ప్రసాద్, కానిస్టేబుల్ సీహెచ్.వేణుగోపాల్‌ను డీఐజీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఐజీ మల్లారెడ్డితోపాటు వరంగల్, కరీంనగర్ ఎస్పీలు అంబర్ కిషోర్ ఝా, శివకుమార్, అదనపు ఎస్పీ (క్రైం విభాగం) జాన్‌వెస్లీ పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో అటెండర్ రమేష్ కుటుంబం ?
భూపాలపల్లి : ఏపీజీవీబీ బ్యాంకుల దోపిడీ కేసులో అనుమానితుడు రమేష్ అలియాస్ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రమేష్‌ను కూడా శుక్రవారం పట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ శాఖల్లో రూ.9,44,83,100 విలువైన నగదు, బంగారం ఈ నెల 15న రాత్రి చోరీకి గురైన విషయం తెలిసిందే. దోపిడీ జరిగిన నాటి నుంచి బ్యాంకు అటెండర్ రమే ష్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అతడినే నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితుడు రమేష్ పరారైన వాహనాన్ని నడిపిన డ్రైవర్ బుధవారం పోలీసులకు చిక్కినట్లు సమాచారం. చోరీ విషయం తనకు తెలియదని, కిరాయి చెల్లిస్తానంటే రమేష్‌తో సహా కుటుంబాన్ని శ్రీశైలం తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు విచారణలో అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. డ్రైవర్ దొరకడంతో రమేష్ ఆచూకీ లభిస్తుందని ఆశించిన పోలీసులకు చుక్కెదురైంది. ఈ క్రమంలోనే రమేష్‌కు చెందిన రెండు మొబైల్ నంబర్లలో ఒక నంబర్‌ను గురువారం మధ్యాహ్నం 10 నిమిషాల పాటు వినియోగించినట్లు పోలీసు లు గుర్తించారు. హన్మకొండ పట్టణంలోని టవర్ నుంచి ఆ నంబర్‌కు ఫోన్‌కాల్ వెళ్లినట్లు తెలిసింది. ఈ ఆధారంతో గాలింపు చేపట్టి రమేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. విచారణలో రమేష్ నిజామాబాద్ సమీపంలోని గ్రామంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్కడికి 10 పోలీసు బృందాలు గురువారం రాత్రి వెళ్లినట్లు సమాచారం. రమేష్ కుటుంబ సభ్యులు స్వయంగా వచ్చి పోలీసులకు లొం గిపోయారనే వాదన కూడా వినిపిస్తోంది.