* అటెండర్ పనే..
* నిందితుడు రమేష్ భార్య అరెస్ట్
* 34 కిలోల బంగారం.. రూ.2 లక్షలు స్వాధీనం
వరంగల్ క్రైం/భూపాలపల్లి : భూపాలపల్లిలోని రెండు ఏపీజీవీబీ శాఖల్లో దోపిడీ ఇంటి దొంగల పనేనని తేలింది. భూపాలపల్లి శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న రమేష్ సూత్రధారి, పాత్రధారి అని బహిర్గతమైంది. నిందితుడికి సహకరించింది ఆయన భార్య రమాదేవి అని తేటతెల్లమైంది. ఆమెను పోలీసులు శుక్రవారం రాత్రి హసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో పట్టుకోగా... దోపిడీ ఘట్టం బట్టబయలైంది.
ఈ మేరకు హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి వివరాలు వెల్లడించారు. భూపాలపల్లిలోని రెడ్డికాలనీలో వెలుమ రాజేంద్రప్రసాద్ అలియాస్ రమేష్‌తోపాటు ఆయన భార్య రమాదేవి నివసిస్తున్నారు. రమేష్ ఏపీజీవీ బ్యాంకులో తాత్కాలిక మెసెంజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈనెల 15వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల సమయంలో భూపాలపల్లి, ఆజంనగర్ బ్యాంకు శాఖల్లోని డబ్బు, నగదును దోచుకున్నాడు. ఇంటికి వచ్చి భార్యతో బయటకు వెళ్లాలని చెప్పాడు.
రమేష్‌కు పరిచయం ఉన్న తవేరా డ్రైవర్ అంకుశవాలితో శ్రీశైలం, బాసరకు కిరాయి మాట్లాడుకున్నాడు. 15వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో రమేష్, అతని భార్య రమాదేవి, కుమారుడు, కూతురు కలిసి భూపాలపల్లి నుంచి హైదరాబాద్ మీదుగా శ్రీశైలం వెళ్లారు. 16న దైవదర్శనం చేసుకుని తిరిగి అదేరోజు హైదరాబాద్ చేరుకున్నారు. ఓ లాడ్జిలో బసచేసి 17వ తేదీన బాసరకు చేరుకున్నారు. షిరిడికి వెళ్దామంటే డ్రైవర్ సహకరించకపోవడంతో రూ.20 వేలు ఇచ్చి అతడిని అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత నిజామాబాద్ బస్టాండ్‌కు చేరుకుని, ఆ రోజు అక్కడే గడిపారు. 18న బస్సులో మహారాష్ర్ట లో బళ్లార్షాకు వెళ్లారు.
గద్చిరౌలి జిల్లా సిరొంచ గ్రామంలోని బంధువుల ఇంట్లో ఆ రాత్రి గడిపారు. 19న రమేష్.. తన భార్య, కూతురుతో కలిసి మహారాష్ట్రలోని వడడం నుంచి పడవలో గోదావరి దాటి కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామానికి చేరుకున్నాడు, అక్కడ తనకు పరిచయం ఉన్న లావణ్య ఇంటికి వచ్చాడు. కొంత సేపటి తర్వాత తాను తీసుకువచ్చిన బ్యాగుల్లో బట్టలు ఉన్నాయని, ఇవి ఇక్కడే పెడుతున్నామని... హన్మకొండలోని బంధువుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వారు బయటపడ్డారు.
మహదేవపూర్ బస్టాండుకు వచ్చి రమాదేవి, కూతురును బస్సు ఎక్కించి... తాను త్వరలోనే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో నిందితుల కదలికలపై నిఘా పెట్టిన ప్రత్యేక పోలీసులు బృందాలు పక్కా సమాచారం మేరకు రమేష్ భార్య రమాదేవినిహసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె చెప్పిన ప్రకారం... అంబటిపల్లిలోని లావణ్య ఇంటిలో సోదా చేయగా... 1154 బ్యాగుల్లో ఉన్న రూ.9.50 కోట్ల విలువైన 34 కిలోల బంగారు నగలు, దొంగిలించిన రూ.21 లక్షల్లో రూ. 2 లక్షలు దొరికారుు.
పోలీస్ సిబ్బందికి డీఐజీ అభినందనలు
రాష్ట్రంలోనే సంచలనం రేపిన భూపాలపల్లి ఘట నను జిల్లా పోలీస్ యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టారు. వారం రోజుల్లోనే నిందితులను గుర్తించడంతోపాటు బ్యాంకుల్లో దోపిడీలకు గురైన బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో వరంగల్ రేంజ్ డీఐజీ బి.మల్లారెడ్డి, ఎస్పీ అంబర్ కిషోర్‌ఝాలు ఈ కేసు పరిష్కరించడం కోసం ప్రత్యేక దృష్టి సారించారు.
రూరల్ క్రైం అదనపు ఎస్పీ జాన్‌వెస్లీ పర్యవేక్షణలో పరకాల, ములుగు, మహబూబాబాద్ డీఎస్పీలు సంజీవ్‌రావు, శోభన్‌కుమార్, మురళీధర్‌తోపాటు భూపాలపల్లి,పరకాల,చిట్యాల, ములు గు, కేయూసీ ఇన్‌స్పెక్టర్లు రఘునందన్‌రావు, వెంకటేశ్వర్లు, రవీందర్, శ్రీధర్‌రావు, దేవేందర్‌రెడ్డి నిందితు ల ఆచూకీ కోసం శ్రమించారు. శుక్రవారం రాత్రి క్రైం అదనపు ఎస్పీకి అందిన పక్కా సమాచారం ప్రకారం డీఎస్పీ సంజీవ్‌రావు ఆధ్వర్యంలో రమాదేవిని హసన్‌పర్తి బస్టాండ్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను గుర్తించడంతోపాటు దోపిడీకి గురైన ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన క్రైం అదనపు ఎస్పీ, డీఎస్పీలు, ఇన్‌స్పెక్టర్లతో పాటు రూరల్ సీసీఎస్ ఎస్సైలు కిషన్, గౌస్, హెడ్ కానిస్టేబుళ్లు సంజీవరెడ్డి, ప్రసాద్, కానిస్టేబుల్ సీహెచ్.వేణుగోపాల్‌ను డీఐజీ ప్రత్యేకంగా అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఐజీ మల్లారెడ్డితోపాటు వరంగల్, కరీంనగర్ ఎస్పీలు అంబర్ కిషోర్ ఝా, శివకుమార్, అదనపు ఎస్పీ (క్రైం విభాగం) జాన్‌వెస్లీ పాల్గొన్నారు.
బ్యాంకు దోపిడీ ఛేదించిన పోలీసులు
Published Sun, Nov 23 2014 2:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement