భూపాలపల్లి : ఏపీజీవీబీ బ్యాంకుల దోపిడీ కేసులో అనుమానితుడు రమేష్ అలియాస్ రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను పోలీ సులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రమేష్‌ను కూడా శుక్రవారం పట్టుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఏపీజీవీబీ భూపాలపల్లి, ఆజంనగర్ శాఖల్లో రూ.9,44,83,100 విలువైన నగదు, బంగారం ఈ నెల 15న రాత్రి చోరీకి గురైన విషయం తెలిసిందే.
దోపిడీ జరిగిన నాటి నుంచి బ్యాంకు అటెండర్ రమే ష్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అతడినే నిందితుడిగా అనుమానిస్తున్నారు. అతడి కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. అనుమానితుడు రమేష్ పరారైన వాహనాన్ని నడిపిన డ్రైవర్ బుధవారం పోలీసులకు చిక్కినట్లు సమాచారం. చోరీ విషయం తనకు తెలియదని, కిరాయి చెల్లిస్తానంటే రమేష్‌తో సహా కుటుంబాన్ని శ్రీశైలం తీసుకెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చినట్లు విచారణలో అతడు పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. డ్రైవర్ దొరకడంతో రమేష్ ఆచూకీ లభిస్తుందని ఆశించిన పోలీసులకు చుక్కెదురైంది.
ఈ క్రమంలోనే రమేష్‌కు చెందిన రెండు మొబైల్ నంబర్లలో ఒక నంబర్‌ను గురువారం మధ్యాహ్నం 10 నిమిషాల పాటు వినియోగించినట్లు పోలీసు లు గుర్తించారు. హన్మకొండ పట్టణంలోని టవర్ నుంచి ఆ నంబర్‌కు ఫోన్‌కాల్ వెళ్లినట్లు తెలిసింది. ఈ ఆధారంతో గాలింపు చేపట్టి రమేష్ కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. విచారణలో రమేష్ నిజామాబాద్ సమీపంలోని గ్రామంలో ఉన్నట్లు తెలిసింది. దీంతో అక్కడికి 10 పోలీసు బృందాలు గురువారం రాత్రి వెళ్లినట్లు సమాచారం. రమేష్ కుటుంబ సభ్యులు స్వయంగా వచ్చి పోలీసులకు లొం గిపోయారనే వాదన కూడా వినిపిస్తోంది.
పోలీసుల అదుపులో అటెండర్ రమేష్ కుటుంబం ?
Published Fri, Nov 21 2014 2:59 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement