భార్యలకు బ్యాంకు ఖాతాలు తెరుస్తూ... | CBI Case Filed on Grill Scam 1000 cr | Sakshi
Sakshi News home page

‘గ్రిల్‌’ స్కామ్ః రూ.వెయ్యి కోట్లు!

Published Thu, Sep 27 2018 9:26 AM | Last Updated on Thu, Sep 27 2018 1:27 PM

CBI Case Filed on Grill Scam 1000 cr - Sakshi

పోలీసుల అదుపులో నిందితుడు షహీరుద్దీన్‌ (సర్కిల్‌లో)

సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు ఒడిశా నుంచి తీసుకువ్చన మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ (ఎంఎల్‌ఎం) కేసు నిందితుడు మీర్‌ షహీరుద్దీన్‌ గ్రీన్‌ రే ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ (గ్రిల్‌) ముసుగులో దేశ వ్యాప్తంగా పాల్పడిన స్కామ్‌ రూ.1000 కోట్లు ఉంటుందని సీబీఐ నిర్థారించింది.  గతేడాది భువనేశ్వర్‌కు చెందిన సీబీఐ యూనిట్‌ అతడిని అరెస్టు చేసిన విషయం విదితమే. 2015లో కాలాపత్తర్‌లో నమోదై, తమకు బదిలీ అయిన కేసు దర్యాప్తులో భాగంగానే సీసీఎస్‌ పోలీసులు మీర్‌ షహీరుద్దీన్‌తో పాటు సంస్థ డైరెక్టర్‌ అయూబ్‌లను నగరానికి తీసుకువచ్చారు. ఎంఎల్‌ఎం దందాతో పాటు చిట్‌ఫండ్‌ వ్యాపారంతో లక్షల మందికి టోకరా వేయడంతో వీరిపై దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. షహీరుద్దీన్‌ ఇలా సంపాదించిన సొమ్మును హవాలా రూపంలో దుబాయ్, నైజీరియాలకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇతడికి అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతోనూ సంబంధాలు ఉన్నట్లు గతేడాది అరెస్టు సమయంలో ఆరోపించింది.

ఏడాదిలో కేసుల నమోదు...
ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లా, జలేశ్వర్‌కు చెందిన మీర్‌ షాహిరుద్దీన్‌ బాలాసోర్‌ కేంద్రంగా 2012లో గ్రిల్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కైలాష్‌ సాహ, అయూబ్‌ సాహ, మీర్‌ తహీరుద్దీన్‌ డైరెక్టర్లుగా ఉన్నారు. నగరంలోని కాలాపత్తర్‌తో పాటు దేశ వ్యాప్తంగా 108 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసిన ‘గ్రిల్‌’ తక్కువ ధరకు బంగారం పేరుతో ఎంఎల్‌ఎం, చిట్‌ఫండ్స్‌ వ్యాపారం నిర్వహించారు. వీటితో పాటు భారీగానూ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థ ఆ మొత్తాలను తిరిగి చెల్లించడంతో విఫలమైంది. దీంతో 2013 నుంచి గ్రిల్‌పై కేసులు నమోదు కావడం ప్రారంభమైంది. కాలాపత్తర్‌లో 2015లో కేసు రిజిస్టరై సీసీఎస్‌కు బదిలీ అయింది. పోలీసుల వేట ప్రారంభం కాగానే షాహిరుద్దీన్‌ తన ముగ్గురు భార్యలతో కలిసి నైజీరియాకు పారిపోయాడు. ఈ కేసులకు ఉన్న తీవ్రత దృష్ట్యా 2014 మేలో ఒడిశాలో నమోదైన కేసుల దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. నైజీరియా నుంచి షాహిరుద్దీన్, అతడి భార్యలు దుబాయ్, సౌదీ అరేబియాలకు తిరుగుతూ అరెస్టు నుంచి తప్పించుకోగా, ముగ్గురు డైరెక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. షాహిరుద్దీన్‌పై లుక్‌ ఔట్‌ సర్క్యులర్స్‌ (ఎల్‌ఓసీ) జారీ చేసింది. 

మారుపేరుతో బంగ్లాదేశ్‌ పాస్‌పోర్ట్‌...
గ్రిల్‌ ద్వారా సంపాదించిన సొమ్ముతో షాహిరుద్దీన్‌ నైజీరియాలో ఓ ఐరన్‌ ఓర్‌ మైన్‌ను లీజుకు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. చాలా ఏళ్లుగా విదేశాల్లో ఉన్న అతడిని హవాలా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాడనే అభియోగంపై నైజీరియాకు చెందిన అధికారిక సంస్థ స్టేట్‌ సెక్యూరిటీ సర్వీస్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌) 2015 జూలై 15న అరెస్టు చేసింది. ఏడాదికి పైగా అక్కడి జైల్లో ఉన్న షాహిరుద్దీన్‌ బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ కేసు నేపథ్యంలో గత ఏడాది భారత్‌కు తిరిగి రావాలని భావించాడు. అయితే తనపై ఎల్‌ఓసీ జారీ అయి ఉండటంతో మరో దేశం నుంచి మా రు పాస్‌పోర్ట్‌ పొంది భారత్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నైజీరియా నుంచి దుబాయ్‌ మీదుగా బంగ్లాదేశ్‌కు చేరుకున్న షాహిరుద్దీన్, అతడి ముగ్గురు భార్యలు అక్కడ కొన్ని రోజులు బస చేశారు. అక్కడే ఓ దళారి ద్వారా షాహిరుద్దీన్‌ తన పేరును హమీద్‌ హుస్సేన్‌గా పేర్కొంటూ మ రో పాస్‌పోర్ట్‌ పొందాడు. దీని ఆధారంగా పశ్చిమ బెంగాల్‌ మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టాడు. 

భార్యలకు బ్యాంకు ఖాతాలు తెరుస్తూ...
ఈ విషయాన్ని గుర్తించిన సీబీఐ షాహిరుద్దీన్‌ను పట్టుకునేందుకు నిఘా ముమ్మరం చేసింది. కోల్‌కతాలో కొన్ని రోజుల పాటు షెల్డర్‌ తీసుకున్న అతను తన భార్యల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు గాను గత ఫిబ్రవరిలో రాజర్‌హత్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌కు వెళ్లాడు. దీనిపై సమాచారం అందడంతో సీబీఐ అధికారులు దాడి చేసి షాహిరుద్దీన్‌ను పట్టుకున్నారు. గ్రిల్‌ స్కామ్‌ నేపథ్యంలో ‘సెబీ’ గతేడాది సదరు సంస్థపై రూ.కోటి పెనాల్టీ విధించింది. ఎండీ, డైరెక్టర్లు సహా అంతా జైలులో ఉండటంతో ఈ మొత్తాన్ని ఎవరూ చెల్లించలేదు. సీబీఐ కంటే ముందే ఈ కేసును దర్యాప్తు చేసిన ఒడిశా పోలీసులు 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీగా నగదు, స్థిరచరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసులో బాధితులుగా ఉన్న వారికి న్యాయం చేయాలంటే సీబీఐతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement