ఆదిలాబాద్‌రూరల్: ఆదిలాబాద్ మున్సిపా లిటీ పరిధిలోని పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా అక్రమంగా నిర్మించిన భవనాల కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. టీచర్స్ కాలనీ నుంచి తిర్పెల్లి సీసీఐ క్రాస్ రోడ్డు వరకు సుమారు 3.5 కిలోమీటర్ల ఆర్ అండ్ బీ స్థలంలో నిర్మించుకున్న భవనాలు తొలగించనున్నారు. జాతీయ రహదారి మధ్యలో నుంచి ఇరువైపులా 75 ఫీట్ల స్థలం ఉండాలి. కానీ ప్రస్తుతం అందులో సగం స్థలం కూడా లేదు. రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నందున అధికారులు సోమవారం కొలతలు చేశారు. సుమారు 65 ఇళ్ల వరకు ఆర్ అండ్ బీ రోడ్డు స్థలంలో అక్రమంగా భవనాలు నిర్మించుకున్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు స్థలంలో టీన్ షెడ్లు అధికంగా వేసుకు న్నారు. వారిని తొలగించుకోవాలని సూచించినట్లు తెలిపారు.
సుందరీకరణకు చర్యలు..
పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా ఆదిలాబాద్ మున్సిపాలిటీ రూపురేఖలు త్వరలో మారనున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టణ సుందరీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. రోజు రోజుకు పట్టణ జనాభా పెరుగుతుండడంతో ట్రాఫిక్ సైతం పెరుగుతోంది. మావల సమీపంలోని జాతీయ రహదారి 44 నుంచి చాందా(టి) శివారు ప్రాంతాంలో గల గాయత్రి గార్డెన్ వరకు పనులు చేపట్టనున్నారు. టీచర్స్ కాలనీ నుంచి తిర్పెల్లి సీసీఐ క్రాస్ రోడ్డు వరకు ప్రస్తుత పాత జాతీయ రహదారి 7 వెడల్పు ఇరువైపులా 25 ఫీట్లు మాత్రమే ఉంది. దీంతో పట్టణ ప్రజలకు ప్రతీ రోజు ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 25 ఫీట్ల రోడ్డును ఇరువైపులా రోడ్డు మధ్యలో నుంచి 75 ఫీట్లకు రోడ్డు విస్తరణ చేపట్టనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని టీచర్స్ కాలనీ సమీపం నుంచి తిర్పెల్లి సీసీ క్రాస్ రోడ్డు వరకు 3.5 కిలోమీటర్ల వరకు ఈ రోడ్డు వెడల్పు పనులను చేపట్టేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దీంతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు రోడ్డు అందంగా మారనుంది.
తొలగిపోనున్న ఆక్రమణలు
గత కొన్నేళ్ల కిందట పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా ఆర్ అండ్ బీ రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకుని సుందరమైన భవనాలను నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఆ స్థలాల్లో వివిధ రకాల షాపులను ఏర్పాటు చేసుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రోడ్డు వెడల్పు కోసం నిధులు విడుదల చేయడంతో కొన్నేళ్ల కిందట నిర్మించుకున్న భవనాలు కూల్చి వేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగానే సోమవారం అక్రమంగా నిర్మించుకున్న భవనాల వారి వద్దకు వెళ్లి ఏవైనా వస్తువులు ఉంటే తొలగించాలని సూచించారు. ఆర్ అండ్ బీ స్థలం నిర్మించుకున్న భవనాలను మంగళవారం రోజున కూల్చివేస్తామని ఆర్ అండ్ బీ ఈఈ వెంటకట్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రంగినేని మనీషా, కమిషనర్ మారుతిప్రసాద్‌తోపాటు ఇతర అధికారులు షాపుల వద్దకు వెళ్లి చెప్పారు.
రూ.44 కోట్లు వ్యయం
పట్టణ సుందరీకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ పనులతోపాటు రోడ్డుకు మధ్యలో 2 ఫీట్ల వెడల్పులో సెంట్రల్ లైటింగ్(స్ట్రీట్ లైట్లు) ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 9.6 కిలోమీటర్ల పొడవున ఈ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీలను నిర్మించనున్నారు. జాతీయ రహదారి పక్కన వాహనాల ను పార్కింగ్, మొక్కలను నాటేందుకు 28 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు విస్తీర్ణం పెరగడంతో ట్రాఫిక్ సమస్య సైతం తీరనుంది. రూ.26 కోట్ల వ్యయంతో రోడ్డు, డ్రైనేజీ, కల్వర్టులు, రూ.3.25 కోట్ల వ్యయంతో సెంట్రల్ లైటిం గ్, మరో రూ.5.50 కోట్ల వ్యయంతో సిఫ్టింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీతోపాటు తదితర పనులను చేపట్టనున్నారు. మరిన్ని పనులకు ఆర్ అండ్ బీ శాఖ రూ.44.30 కోట్లు మంజూరు చేసింది.
మొదలైన గుబులు..
గత కొన్నేళ్ల కిందట ఆర్ అండ్ బీ రోడ్డుకు సంబంధించిన స్థలంలో మాలీగీలు నిర్మించుకొని దర్జగా వ్యాపారం కొనసాగిస్తున్న వారికి భవనాలను కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేయడంతో వారిలో గుబులు మొదలైంది. వందలాది ఇళ్లు కూలనున్నాయి. రోడ్డు పనులు ఇంతవరకు వస్తాయా అనే ధీమాతో లక్షలాది రూపాయలు వెచ్చించుకొని వారి.. వారి ఇంటి ఎదుట ఉన్న స్థలాల్లో మంచి.. మంచి భవనాలను నిర్మించుకొని అద్దెకు ఇస్తున్నారు. వాటిని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేయడంతో తాము ఎవరిని సంప్రదిస్తే కూల్చివేతలు నిలిచిపోతాయని ఆలోచనల్లో పడ్డట్లు తెలుస్తోంది. ఏదేమైనా హైదరాబాద్ నగరంలో అటువంటిది రోడ్డు స్థలాల్లో నిర్మించుకున్న భవనాలను ప్రభుత్వం కూల్చి వేసింది. ఇక్కడ కూడా ఎట్టిపరిస్థితిల్లో వాటిని ఉంచే ప్రసక్తే లేదని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు పనులు ప్రారంభం కానుండడంతో పట్టణ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెనుకబడ్డ ఆదిలాబాద్ జిల్లా కేంద్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆక్రమణలు తొలగించిన వెంటనే పనులు
పాత జాతీయ రహదారి 7 రోడ్డు విస్తరణ పనుల కోసం నిధులు మంజూరయ్యాయి. 3.5 కిలోమీటర్ల మేర ఈ పనులను చేపట్టనున్నాం. అలాగే 9.6 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్స్ ఏర్పాటు చేయడంతోపాటు డ్రైనేజీ, కల్వర్టులు, తదితర వాటిని నిర్మించునున్నాం. మున్సిపాలిటీ అధికారులు ఆక్రమణలు తొలగించిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. – వెంకట్‌రెడ్డి, ఈఈ, ఆర్ అండ్ బీ, ఆదిలాబాద్
రెండు, మూడు రోజుల్లో తొలగిస్తాం
పట్టణ అభివృద్ధిలో భాగంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని పాత జాతీయ రహదారి 7కు ఇరువైపులా అక్రమంగా నిర్మించుకున్న భవనాలను తొలగించనున్నాం. రెండు మూడు రోజుల్లో వాటిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశాం. అందులో భాగంగానే ఆర్ అండ్ బీ స్థలంలో భవనాలు నిర్మించుకున్న వారికి ముందుగా చెప్పడం జరిగింది. – మారుతి ప్రసాద్, మున్సిపల్ కమిషనర్, ఆదిలాబాద్
Comments
Please login to add a commentAdd a comment