వేల ఏళ్ల కిందే ఇక్కడికి వలసలు
► యూరప్ నుంచీ వచ్చిన మానవ సమూహాలు
►తిరుగు ప్రయాణమైన కొన్ని గుంపులు
►పురాతత్వ శాస్త్రవేత్తలు, సీసీఎంబీ పరిశోధనలో వెల్లడి
►పుల్లూరు, ఖమ్మం శిలాయుగపు సమాధుల అవశేషాలకు డీఎన్ఏ పరీక్ష
► అంతర్జాతీయసదస్సులో పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సిద్దిపేట.. వేల కిలోమీటర్ల దూరంలోని మధ్య ఆసి యా.. ఈ రెండు ప్రాంతాలకు ఏదైనా సంబంధముందా? అసలా అవకాశం ఉండదనే అనుకుంటాం. కానీ మధ్య ఆసియా ప్రాంతానికి చెందినవారు సిద్దిపేట పరిసరాలకు వలస వచ్చారని పురావస్తు పరిశోధకులు, సీసీఎంబీ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. వేల ఏళ్ల క్రితం ఈ వలసలు సాగాయని తేలింది.
డీఎన్ఏ పరీక్షలతో..
పురావస్తు శాఖ సిద్దిపేట సమీపంలోని పుల్లూరుబండలో 2015లో తవ్వకాలు జరిపి.. వేల ఏళ్లనాటి బృహత్ శిలాయుగపు సమాధులను గుర్తించింది. ఖమ్మం పరిధిలో గతంలో జరి పిన తవ్వకాల్లో వెలుగుచూసిన ఆనవాళ్లను భద్రపరిచి ఉంచారు. వాటన్నింటినీ ఇటీవలే సీసీఎంబీకి పంపి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. సమాధుల్లో లభించిన అవశేషాల్లోని డీఎన్ఏలు స్థానికుల డీఎన్ఏతో సరిపోలలేదు. కానీ మధ్య ఆసియాలోని ఇరాన్, ఇరాక్, పాలస్తీనాల్లో కొన్ని తెగల డీఎన్ఏలతో సరిపోలాయి. కొన్ని అవశేషాల డీఎన్ఏలు యూరప్ వాసుల డీఎన్ఏతో సరిపోలాయి. దీనిని బట్టి ఆయా ప్రాం తాల నుంచి అప్పట్లోనే ప్రజలు వలస వచ్చారని నిర్ధారించారు.
నివేదికలో వెల్లడి
సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో ప్రారంభమైన ‘రీడిస్కవరింగ్ తెలంగాణ’అంతర్జాతీయ సదస్సులో పురావస్తుశాఖ సంచాలకురాలు విశాలాచ్చి ఈ పరిశోధనకు సంబంధించిన నివేదికను వెల్లడించారు. ‘‘సమాధుల్లోని మానవ అవశేషాలకు డీఎన్ఏ పరీక్షలు చేయించగా.. వారు మధ్య ఆసియా నుంచి వలసవచ్చారని వెల్లడైంది. ఆ సమూహం మళ్లీ ఇక్కడి నుంచి తిరిగి మధ్య భారత్ మీదుగా మధ్య ఆసియాకు చేరినట్టు తెలుస్తోంది. అందువల్లే ఆ డీఎన్ఏ ఇప్పుడు సిద్దిపేటలో లేదు. కానీ మధ్యభారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు మధ్య ఆసియా దేశాల్లో దాని జాడలు కనిపిస్తున్నాయి.
ఆ ప్రజలు ఇక్కడికి వలస రావటానికి, తిరిగి వెళ్లటానికి కారణాలను అన్వేషించాల్సి ఉంది. ఆ ప్రయత్నం ప్రారంభిం చాం..’’అని ఆమె తెలిపారు. ఇక ఇదే ప్రాం తంలో మరో చోట లభించిన అవశేషాల డీఎన్ఏ యూరప్ వాసులతో సరిపోయిందని, అంటే యూరప్ నుంచి కూడా వలసలొచ్చాయని పేర్కొన్నారు. పూర్తి సమాచారం లభించాలంటే చాలా పరిశోధనలు చేయాల్సి ఉందని.. మరికొన్ని చోట్ల నమూనాలు సేకరించి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించబోతున్నామని తెలిపారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా పరిధిలోని పాల్మాకుల, నర్మెట్టల్లో తవ్వకాల కోసం దరఖాస్తు చేసుకోగా ఏఎస్‌ఐ ఇటీవలే అనుమతి మంజూరు చేసిందని చెప్పారు.
సముద్ర మార్గంలో రవాణా..
క్రీస్తుపూర్వం 600 నుంచి 500 సంవత్సరాల సమయంలో భారీగా వలసలు చోటుచేసుకున్నాయని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న సీసీఎంబీ ప్రతినిధి తెలిపారు. అప్పట్లోనే నౌకల ద్వారా సరుకురవాణా సాగిందని, ప్రజలు సముద్రమార్గాల్లోనే వెళ్లేవారని పేర్కొన్నారు. రష్యా, లాట్వియా, జార్జియా, బాల్టిన్ తదితర ప్రాంతాల నుంచి తెలంగాణ ప్రాంతాలకు వలసలు వచ్చినట్టు గుర్తించామన్నారు.