కరువుపై మీనమేషాలెందుకు?
► కేంద్రప్రభుత్వ నిధులుఖర్చుపెట్టండి
► ఉపాధి నిధులను ఇతర పథకాలకు వాడొద్దు
► రైతులకు ఉచితంగా పశుగ్రాసం పంపిణీచేయాలి
► బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి
మహబూబ్‌నగర్ న్యూటౌన్/ నారాయణపేట : రాష్ట్రంలో కరువు కాటేస్తున్నా.. ఏటేటా సాగువిస్తీర్ణం తగ్గుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన జిల్లాకేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నారాయణపేటలో జరిగిన జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కరువుతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 40 లక్షల మంది వలస లు పోయారని, 14 లక్షల ఎకారాల్లో పంటలు ఎండిపోయాయని తెలిపారు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో ఉచితంగా పశుగ్రాసం వంటి కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
కరువు నివారణకు కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు విడుదల చేసినా ఖర్చుపెట్టకుండా మీనమేషాలు లెక్కిస్తుండటం సరైంది కాదన్నారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రెండు నెలల కూలీ పెండిం గులో పెట్టి నిధులను ఇతర కార్యక్రమాలకు వాడుకుంటుందని, గ్రామ పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తే అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఆదాయాన్ని పెంచుకునేం దుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు ఆత్మహత్యలు, వడదెబ్బ మృతులసంఖ్య రోజురోజుకు పెరుగుతున్నా ముఖ్యమంత్రి వాటికోసం సమయం ఇవ్వడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, రాష్ట్ర నాయకులు రతంగ్‌పాండురెడ్డి, నాగూరావు నామాజీ, ఆచారి, పద్మజారెడ్డి, రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సిద్ధాంతాలే ముఖ్యం
ప్రతి కార్యకర్త పదవుల కోసం కాకుండా దేశ అభ్యున్నతి, నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ కేంద్రపభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేటలో నియోజకవర్గ పార్టీ కార్యాలయ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక జీపీ శెట్టి ఫక్షన్‌హాల్‌లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు.
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్, ఉపాధిహామీ, అటల్‌ఫెన్షన్, బేటి బచావో... పడావో, జన్‌ధన్‌యోజన వంటి పథకాలను తీసుకొచ్చిందని, వాటిని ప్రజలు సద్వినియోగించుకునేలా చూడాలని కోరారు. పంచాయితీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రధాని ఈనెల 14 నుంచి 24 వరకు వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని, అంబేద్కర్ జయంతి జరుపుకోవాలని కోరారు.