
'సాగర్ జలాల వివాదానికి కేంద్ర ప్రభుత్వమే కారణం'
హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య నాగార్జున సాగర్ జలాల వివాదం తీవ్రమవుతున్నా కేంద్రం చోద్యం చూస్తోందే కానీ సమస్య పరిష్కారానికి ఏమాత్రం కృషి చేయడంలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. నాగార్జునసాగర్ జలాలు వివాదం కావడానికి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే కారణమని ఆయన వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటితుడుపు చర్యలు కాకుండా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు. సాగర్ జలాల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు కేసీఆర్ సర్కార్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఆయన కోరారు. లేకపోతే టీఆర్ ఎస్ ప్రభుత్వ తీరును ఎండగడతామని జానారెడ్డి హెచ్చరించారు. విభజన చట్టం ప్రకారం విద్యుత్ వాటా దక్కేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. నదీ జలాల విషయాన్ని రెండు రాష్ట్రాలూ కలిసి పరిష్కరించుకోవాలనడం కేంద్రం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పొన్నాల ఆరోపించారు.