సీతారామ ప్రాజెక్ట్ నిర్మించే దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాంతం ఇదే.. (ఫైల్)
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీటి పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతుల పరంగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అటవీ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాలనా పరమైన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు కేంద్ర అటవీశాఖకు అనుమతులకు సంబంధించి రూ.276 కోట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసింది. ఆ ప్రాంతాల్లో పనులను జరుపుకోవడానికి కేంద్ర అటవీశాఖ సమ్మతించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జరుగుతున్న సీతారామ ప్రాజెక్ట్ పనులకుతోడు అటవీభూముల్లో నిర్మించాల్సిన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది.
కేంద్రప్రభుత్వం మంజూరు చేయాల్సిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అనుమతులు ఒక్కొక్కటిగా మంజూరు కావడంతో ఇక క్షేత్రస్థాయిలో వేగం పుంజుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. మంత్రి తుమ్మల చొరవతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సైతం ఈ అనుమతులకు సంబంధించి పలుసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను వివరించడం, దీంతో దశలవారీగా లభించేలా చూడటంతోపాటు వాటికి సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ ఊపందుకునేలా మంత్రి తుమ్మల దృష్టి సారించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు ఇక ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నాయి.
జనవరి 19న ప్రక్రియ..
ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటవీ భూములకు కేంద్ర అటవీశాఖ ప్రక్రియ షురూ అయింది. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధిలో సేకరించిన అటవీ భూములకు మొత్తాన్ని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖకు చెల్లించింది. మొత్తం 1531.0548 హెక్టార్లకు అటవీశాఖ పనులు నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర నీటివనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) నిధుల నుంచి చెల్లించింది.
ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అటవీ అనుమతులను మంజూరు చేసే సమయంలో అటవీ భూములను ప్రాజెక్టుకు కేటాయించేందుకు గాను నష్ట పరిహారంగా అనుమతుల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.276 కోట్లను చెల్లించాలని కేంద్ర అటవీశాఖ సూచించింది. ప్రభుత్వ పరంగా ఈ చెల్లింపులు కొంత ఆలస్యం అవుతుండటంతో మంత్రి తుమ్మల దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తిచేయాలంటే అటవీ శాఖ అనుమతులకు సంబంధించిన నిధులను వారి ఖాతాలో జమ చేసి అనుమతులను సంపూర్ణం చేసుకోవాలని వివరించారు. అటవీశాఖకు చెల్లించాల్సిన నగదును ప్రభుత్వమే సోమవారం అటవీశాఖకు జమ చేసింది. దీంతో సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు అన్ని అనుమతులు లభించినట్లయింది.
ఒక్కొక్క అనుమతి ఇలా..
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్ ఎంపవర్ కమిటీ ఈ ఏడాది జనవరి 19న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చెన్నైలో పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వాల్సిందిగా సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్‌హౌజ్‌ల నిర్మాణం వంటి వివరాలను చీఫ్ ఇంజనీర్ పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటిదశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీభూములు అవసరమని పేర్కొన్నారు. ఈ వివరాలతో పూర్తిస్థాయి సంతృప్తి చెందిన రీజనల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ అనుమతులు ఇవ్వడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్(ఎంవోఈఎఫ్) వారికి సిఫారసు చేసింది.
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ప్రాజెక్టు నిర్మాణం..
పినపాక నియోజవర్గం..అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం గ్రామంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు నిర్వహించడానికి 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తిచేసింది. ఇందులో ఐదు ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ.కొత్తూరు, ములకలపల్లి మండలంలో పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్‌హౌజ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం కొనసాగుతోంది.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు..
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ అనుమతులకు సంబంధించి చేసిన కృషి అభినందనీయం. ఇందుకు అన్నీ తానై వ్యవహరించి కోట్లాది రూపాయలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెల్లించి, సంపూర్ణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన రైతుల పక్షపాతి అని ఈ అంశంతో మరోసారి రుజువైంది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతాం. కెనాల్, టన్నెల్, విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని ఇక తక్షణం ప్రారంభిస్తాం. – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment