seetharam project
-
ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్ట్ ప్రారంభం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీన అంటే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ సీతారామ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పషం చేశారు.కాగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15వ తేదీన సీతారామ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముందు వైరాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇక చకచకా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీటి పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతుల పరంగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అటవీ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాలనా పరమైన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు కేంద్ర అటవీశాఖకు అనుమతులకు సంబంధించి రూ.276 కోట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసింది. ఆ ప్రాంతాల్లో పనులను జరుపుకోవడానికి కేంద్ర అటవీశాఖ సమ్మతించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జరుగుతున్న సీతారామ ప్రాజెక్ట్ పనులకుతోడు అటవీభూముల్లో నిర్మించాల్సిన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది. కేంద్రప్రభుత్వం మంజూరు చేయాల్సిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అనుమతులు ఒక్కొక్కటిగా మంజూరు కావడంతో ఇక క్షేత్రస్థాయిలో వేగం పుంజుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. మంత్రి తుమ్మల చొరవతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సైతం ఈ అనుమతులకు సంబంధించి పలుసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను వివరించడం, దీంతో దశలవారీగా లభించేలా చూడటంతోపాటు వాటికి సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ ఊపందుకునేలా మంత్రి తుమ్మల దృష్టి సారించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు ఇక ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నాయి. జనవరి 19న ప్రక్రియ.. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటవీ భూములకు కేంద్ర అటవీశాఖ ప్రక్రియ షురూ అయింది. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధిలో సేకరించిన అటవీ భూములకు మొత్తాన్ని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖకు చెల్లించింది. మొత్తం 1531.0548 హెక్టార్లకు అటవీశాఖ పనులు నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర నీటివనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) నిధుల నుంచి చెల్లించింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అటవీ అనుమతులను మంజూరు చేసే సమయంలో అటవీ భూములను ప్రాజెక్టుకు కేటాయించేందుకు గాను నష్ట పరిహారంగా అనుమతుల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.276 కోట్లను చెల్లించాలని కేంద్ర అటవీశాఖ సూచించింది. ప్రభుత్వ పరంగా ఈ చెల్లింపులు కొంత ఆలస్యం అవుతుండటంతో మంత్రి తుమ్మల దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తిచేయాలంటే అటవీ శాఖ అనుమతులకు సంబంధించిన నిధులను వారి ఖాతాలో జమ చేసి అనుమతులను సంపూర్ణం చేసుకోవాలని వివరించారు. అటవీశాఖకు చెల్లించాల్సిన నగదును ప్రభుత్వమే సోమవారం అటవీశాఖకు జమ చేసింది. దీంతో సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు అన్ని అనుమతులు లభించినట్లయింది. ఒక్కొక్క అనుమతి ఇలా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్ ఎంపవర్ కమిటీ ఈ ఏడాది జనవరి 19న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చెన్నైలో పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వాల్సిందిగా సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్‌హౌజ్‌ల నిర్మాణం వంటి వివరాలను చీఫ్ ఇంజనీర్ పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటిదశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీభూములు అవసరమని పేర్కొన్నారు. ఈ వివరాలతో పూర్తిస్థాయి సంతృప్తి చెందిన రీజనల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ అనుమతులు ఇవ్వడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్(ఎంవోఈఎఫ్) వారికి సిఫారసు చేసింది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ప్రాజెక్టు నిర్మాణం.. పినపాక నియోజవర్గం..అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం గ్రామంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు నిర్వహించడానికి 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తిచేసింది. ఇందులో ఐదు ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ.కొత్తూరు, ములకలపల్లి మండలంలో పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్‌హౌజ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం కొనసాగుతోంది. కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ అనుమతులకు సంబంధించి చేసిన కృషి అభినందనీయం. ఇందుకు అన్నీ తానై వ్యవహరించి కోట్లాది రూపాయలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెల్లించి, సంపూర్ణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన రైతుల పక్షపాతి అని ఈ అంశంతో మరోసారి రుజువైంది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతాం. కెనాల్, టన్నెల్, విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని ఇక తక్షణం ప్రారంభిస్తాం. – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
సీతారామా.. ఇదేమి ఖర్మ
పినపాక నియోజకవర్గానికి మొండిచేయి భూములు పాయె.. సాగు నీరు రాకపాయె... మూడు మండలాల్లో పూర్తయిన కాలువ సర్వే పనులు నష్టపరిహారం ఊసెత్తని అధికారులు ఆందోళనలో భూ నిర్వాసితులు పినపాక : వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు అవసరమయ్యే సాగునీరు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా రూ.7,926 కోట్లు మంజూరు చేసింది. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ మండలం కోయగుట్ట, ములకలపల్లి మండలం కమలాపురం, ఇల్లెందు మండలం చీమలపాడు, రోళ్లపాడు చెరువు, బయ్యారం పెద్ద చెరువు ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు నీరు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. నాలుగు పంప్‌హౌస్‌ల నిర్మాణం.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో భీడు భూములకు సాగునీరు అందించేందుకు నాలుగు పంపు సెట్లు నిర్మించేలా డిజైన్ తయారు చేశారు. బీ.జీ కొత్తూరు, కోయగుట్ట, కమలాపురం, చీమలపాడు గ్రామాల వద్ద పంపు హౌస్‌లు నిర్మిస్తున్నారు. ప్రతి పంప్ హౌస్ వద్ద ప్రత్యేకంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే భూమిని కూడా సేకరించారు. పినపాక భూములకు నీరందదా..? అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక కాలువ ద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ పినపాక నియోజకర్గం పరిధిలో గల బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేదు. అధికారులు రూపొందించిన డిజైన్‌లో పినపాక నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు నీరు అందించే ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. అశ్వాపురం నుంచి పాలేరుకు గోదావరి నీరు తరలిపోతున్నా పినపాక నియోజకవర్గ రైతులకు మాత్రం సాగునీరు అందే అవకాశాలు లేవు. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ, ఇల్లెందు మీదుగా జాతీయ రహదారికి కుడివైపున సుమారు 65 మీటర్ల వెడల్పుతో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మిస్తారు. కానీ అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలాలకు ప్రాజెక్టు నిర్మాణంలో స్థానం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల సాగునీటి వనరులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండగా ఇక్కడి రైతులకు మొండిచెయ్యి చూపడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తయిన కాలువ సర్వే పనులు.. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి ఏ గ్రేడ్‌లో ముందుగా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో 156 ఎకరాలు, అమ్మగారిపల్లిలో 84 ఎకరాలు, అమెర్ధలో 382 ఎకరాలు, చింతిర్యాలలో 40 ఎకరాలు, అశ్వాపురంలో 282 ఎకరాలు, పంప్‌హౌస్ నిర్మాణానికి అశ్వాపురంలో 22 ఎకరాలు, నెల్లిపాక బంజరలో 152 ఎకరాలు సేకరించారు. బీ గ్రేడ్‌లో కాలువ నిర్మాణం కోసం నెల్లిపాక బంజరలో 167 ఎకరాలు, బూర్గంపాడులో 198 ఎకరాలు, మోరంపల్లి బంజరలో 114 ఎకరాలు, పాల్వంచలో 117 ఎకరాలు, నారాయణరావుపేటలో 33 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందుకోసం 11 బృందాలుగా ఏర్పడి 1760 ఎకరాల్లో ప్రాథమికంగా సర్వే పనులు పూర్తి చేశారు. భూసేకరణ కోసం ఆయా గ్రామాల్లో సభల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనలో భూ నిర్వాసితులు.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయకుండానే సర్వే పనులు పూర్తి చేయడం గమనార్హం. ఎలాంటి హామీ, భరోసా లేకుండా, గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రాజెక్టు, కాలువ సర్వే పనులు చేయడంపై ఆయా గ్రామాల్లో భూ నిర్వాసితులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సీతారామ పాజెక్టు కుమ్మరిగూడెం,అశ్వాపురం మండలం, నిర్మాణ ప్రాంతం దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాజెక్టు నిర్మాణ విలువ రూ. 7,926 కోట్లు సాగునీరు అందించే లక్ష్యం 4 లక్షల ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణం 3 సంవత్సరాలు పూర్తయ్యే కాల వ్యవధి సాగు నీరందేది కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, అశ్వారావుపేట నియోజకవర్గాలు