పినపాక నియోజకవర్గానికి మొండిచేయి
భూములు పాయె.. సాగు నీరు రాకపాయె...
మూడు మండలాల్లో పూర్తయిన కాలువ సర్వే పనులు
నష్టపరిహారం ఊసెత్తని అధికారులు
ఆందోళనలో భూ నిర్వాసితులు
పినపాక : వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు అవసరమయ్యే సాగునీరు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా రూ.7,926 కోట్లు మంజూరు చేసింది. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ మండలం కోయగుట్ట, ములకలపల్లి మండలం కమలాపురం, ఇల్లెందు మండలం చీమలపాడు, రోళ్లపాడు చెరువు, బయ్యారం పెద్ద చెరువు ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు నీరు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు.
నాలుగు పంప్‌హౌస్‌ల నిర్మాణం..
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో భీడు భూములకు సాగునీరు అందించేందుకు నాలుగు పంపు సెట్లు నిర్మించేలా డిజైన్ తయారు చేశారు. బీ.జీ కొత్తూరు, కోయగుట్ట, కమలాపురం, చీమలపాడు గ్రామాల వద్ద పంపు హౌస్‌లు నిర్మిస్తున్నారు. ప్రతి పంప్ హౌస్ వద్ద ప్రత్యేకంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే భూమిని కూడా సేకరించారు.
పినపాక భూములకు నీరందదా..?
అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక కాలువ ద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ పినపాక నియోజకర్గం పరిధిలో గల బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేదు. అధికారులు రూపొందించిన డిజైన్లో పినపాక నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు నీరు అందించే ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. అశ్వాపురం నుంచి పాలేరుకు గోదావరి నీరు తరలిపోతున్నా పినపాక నియోజకవర్గ రైతులకు మాత్రం సాగునీరు అందే అవకాశాలు లేవు. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ, ఇల్లెందు మీదుగా జాతీయ రహదారికి కుడివైపున సుమారు 65 మీటర్ల వెడల్పుతో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మిస్తారు. కానీ అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలాలకు ప్రాజెక్టు నిర్మాణంలో స్థానం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల సాగునీటి వనరులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండగా ఇక్కడి రైతులకు మొండిచెయ్యి చూపడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తయిన కాలువ సర్వే పనులు..
సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి ఏ గ్రేడ్‌లో ముందుగా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో 156 ఎకరాలు, అమ్మగారిపల్లిలో 84 ఎకరాలు, అమెర్ధలో 382 ఎకరాలు, చింతిర్యాలలో 40 ఎకరాలు, అశ్వాపురంలో 282 ఎకరాలు, పంప్‌హౌస్ నిర్మాణానికి అశ్వాపురంలో 22 ఎకరాలు, నెల్లిపాక బంజరలో 152 ఎకరాలు సేకరించారు. బీ గ్రేడ్‌లో కాలువ నిర్మాణం కోసం నెల్లిపాక బంజరలో 167 ఎకరాలు, బూర్గంపాడులో 198 ఎకరాలు, మోరంపల్లి బంజరలో 114 ఎకరాలు, పాల్వంచలో 117 ఎకరాలు, నారాయణరావుపేటలో 33 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందుకోసం 11 బృందాలుగా ఏర్పడి 1760 ఎకరాల్లో ప్రాథమికంగా సర్వే పనులు పూర్తి చేశారు. భూసేకరణ కోసం ఆయా గ్రామాల్లో సభల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆందోళనలో భూ నిర్వాసితులు..
సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయకుండానే సర్వే పనులు పూర్తి చేయడం గమనార్హం. ఎలాంటి హామీ, భరోసా లేకుండా, గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రాజెక్టు, కాలువ సర్వే పనులు చేయడంపై ఆయా గ్రామాల్లో భూ నిర్వాసితులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
సీతారామ పాజెక్టు కుమ్మరిగూడెం,అశ్వాపురం మండలం,
నిర్మాణ ప్రాంతం దుమ్ముగూడెం ఆనకట్ట
ప్రాజెక్టు నిర్మాణ విలువ రూ. 7,926 కోట్లు
సాగునీరు అందించే లక్ష్యం 4 లక్షల ఎకరాలు
ప్రాజెక్టు నిర్మాణం 3 సంవత్సరాలు
పూర్తయ్యే కాల వ్యవధి
సాగు నీరందేది కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు,
అశ్వారావుపేట నియోజకవర్గాలు