PINAPAKA constituency
-
కానరాని ఎన్నికల జోరు
బూర్గంపాడు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెండురోజులే గడువుంది. పినపాక నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ పెద్దగా ఎన్నికల హడావుడి కనిపించటం లేదు. ఏదో నామమాత్రంగా సభలు, సమావేశాలతోనే ఎన్నికల ప్రచారాన్ని మమ అనిపిస్తున్నారు. గ్రామాలలో ఇంటింటి ప్రచారాలు లేవు. మైకులతో ప్రచార హోరు అసలు కనిపించటం లేదు. పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాల్లో ఎన్నికల ప్రచారం నామమాత్రమే. మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో మాత్రం సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ఎన్నికల ప్రచారం మొక్కుబడిగా నడుస్తోంది. మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత కేవలం నాలుగైదుసార్లు మాత్రమే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరామ్‌నాయక్, బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్‌నాయక్, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వర్లు కూడా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదారు పర్యాయాలే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ తరుపున రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు సత్యావతి రాథోడ్, బాలసాని లక్ష్మీనారాయణ ప్రచారసభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరుపున మాత్రం ఇప్పటి వరకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరూ ఎన్నికల ప్రచారానికి రాలేదు. కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరామ్‌నాయక్ మాత్రమే అన్ని తానై ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి తరపున కూడా ఇప్పటి వరకు స్టార్ క్యాంపెయినర్ ఎవరూ ఎన్నికల ప్రచారానికి రాలేదు. బీజేపీ అభ్యర్థి హుస్సేన్‌నాయక్ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వామపక్షాల తరుపున బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వర్లు తరుపున సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఎండవేడిమి కూడా ప్రతిబంధకంగా మారింది. దీనికి తోడు ఎన్నికల ప్రచారానికి డబ్బు విపరీతంగా ఖర్చవుతుండటంతో అభ్యర్థులు ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికలలో విచ్చలవిడిగా ప్రచారాలకు ఖర్చు చేసిన నాయకులు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ఖర్చులకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలపై ఓటర్లు కూడా పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు. -
అభ్యర్థుల ప్రచార హోరు..
సాక్షి, కొత్తగూడెం: నామినేషన్ల సమర్పణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నాలుగు ఎస్టీ రిజర్వ్డ్ కాగా, కొత్తగూడెం మాత్రమే జనరల్ స్థానం. అన్ని చోట్లా ప్రధాన పోటీదారులుగా నాలుగు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. టీఆర్ఎస్, మహాకూటమి అభ్యర్థులు ప్రధానంగా రేసులో ఉన్నారు. జిల్లాలో వామపక్ష పార్టీల ప్రాబల్యం ఉన్న నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలోని బీఎల్ఎఫ్ సైతం బరిలోకి దిగింది. బీజేపీ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్ జాబితా రెండున్నర నెలల క్రితమే ఖరారు కావడంతో ఆయా అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూటమిలో పినపాక మినహా ఇతర నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఎవరికి వారు ఢిల్లీ, హైదరాబాద్ స్థాయిల్లో ప్రయత్నాలు చేసుకోవాల్సి వచ్చింది. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా టికెట్ల కోసం ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది. తాటికి నిరసన సెగ.. అశ్వారావుపేట టీఆర్ఎస్ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు రెండు నెలలుగా ప్రచారానికి వెళ్లిన సమయంలో పలుసార్లు వివిధ గ్రామాల ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఈ నిరసనల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ములకలపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో అనేక గ్రామాల్లో ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు వ్యతిరేకత ఎదురైంది. తాజాగా శుక్రవారం చంద్రుగొండ మండలంలో మరింత సెగ తగిలింది. మండలంలోని పోకలగూడెం గ్రామంలో స్థానికులు తాటిపై చెప్పులు, రాళ్లు విసిరేశారు. తమ గ్రామానికి ఏమి చేశావని నిలదీశారు. దీంతో గత్యంతరం లేక వెనుదిరిగి వెళ్లారు. ఇక పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేగా కాంతారావు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య సోషల్ మీడియా పోరు సైతం పోటాపోటీగానే ఉంది. ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతమేరకు అధిగమిస్తూ వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా హరిప్రియ బరిలోకి దిగడంతో ప్రచార పర్వం హోరెత్తింది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కనకయ్యకు, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లో హరిప్రియకు పట్టు ఉంది. మరోవైపు గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిజాయితీపరుడిగా పేరున్న సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ అభ్యర్థి గుమ్మడి నర్సయ్య సైతం బరిలో ఉన్నారు. ఆయనకు సీపీఎం ఆధ్వర్యంలోని బీఎల్ఎఫ్ మద్దతు ప్రకటించింది. బీజేపీ నుంచి మోకాళ్ల నాగస్రవంతి పోటీలో ఉన్నారు. బీజేపీకి ఇల్లెందు పట్టణంలో కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో ఇక్కడ బహుముఖ పోటీ నెలకొంది. భద్రాచలం నియోజకవర్గం సీపీఎం సిట్టింగ్ స్థానం. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి మిడియం బాబూరావు గట్టి పోటీదారుగా ఉన్నారు. అధికార టీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు గత రెండున్నర నెలలుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పట్టు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ కూడా బహుముఖ పోటీ నెలకొంది. -
గ్రూపుల లొల్లి !
సాక్షి, కొత్తగూడెం : సాధారణ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే పినపాక నియోజకవర్గంలో ఇవి మరింతగా ముదురుతున్నాయి. టీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడా భారీ వలసలతో పార్టీ కిక్కిరిసిపోయింది. 2014లో ఈ నియోజకవర్గంలో నామమాత్రంగా ఉన్న పార్టీ బలం ప్రస్తుతం గణనీయంగా పెరిగింది. పార్టీలోకి వలసల పరంపర ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీని వీడి టీఆర్ఎస్లోకి వచ్చాక చేరికలు ఇబ్బడిముబ్బడిగా జరగడంతో ప్రస్తుతం కిటకిటలాడిపోతోంది. ఈ క్రమంలో దాదాపు అన్ని పార్టీల గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు గులాబీ కండువా కప్పుకున్నారు. దీంతో గ్రూపుల సంఖ్య కూడా అదేస్థాయిలో పెరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీని మించి టీఆర్ఎస్లో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని రాజకీయ వర్గాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సహ జంగానే గ్రూపుల లొల్లి నడుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో ఈ గ్రూపు రాజకీయాలు మరింత క్రియాశీలకం అవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుత గ్రూపులు అసమ్మతి రాజకీయాలుగా రూపాంతరం చెందాయి. ఇవి చివరకు దాడులకు దారితీస్తున్నాయి. మణుగూరు మండలంలో ప్రారంభమైన అసమ్మతి గళాలు ఇతర మండలాలకూ విస్తరించాయి. అసమ్మతి ప్రభా వంతో గుండాల మండలంలో దాడి సైతం చోటుచేసుకుంది. పాయం అండతో పదవులు పొంది చివరకు అసమ్మతి రాగాలు.. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వైఎస్సార్సీపీ నుంచి టీఆర్ఎస్లో చేరినప్పుడు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎమ్మెల్యే పాయం తన అనుచరులతో పాటు, వివిధ పార్టీల నుంచి వచ్చిన వారిలో పలువురికి పార్టీ, నామినేటెడ్ పదవులు అప్పగించారు. అయితే వివిధ అభివృద్ధి పనుల కేటాయింపుల్లో మాత్రం ఎమ్మెల్యే పక్షపాతం చూపిస్తూ కొంతమందినే ప్రోత్సహిస్తున్నారంటూ కొందరు అసమ్మతి రాగం అందుకున్నారు. మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు మండలాల జెడ్పీటీసీలు, ఇతర నాయకులు కొందరు మొదట మణుగూరులో అసమ్మతి శిబిరం ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సైతం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మణుగూరుకు చెందిన కొందరు అసమ్మతివాదులు గత 26న గుండాలలో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ద్వారా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు సదరు అసమ్మతి నాయకులు చెప్పినట్లు సమాచారం. మండల కార్యదర్శిపై అధ్యక్షుడి దాడి.. కాగా, టీఆర్ఎస్ గుండాల మండల కార్యదర్శి కదిర్ 27న విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కొందరు పార్టీలో ఉంటూ చీలికకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దీంతో 28న పార్టీ గుండాల మండలాధ్యక్షుడు భాస్కర్.. తనకు సమాచారం లేకుండా ప్రెస్‌మీట్ ఎలా పెట్టావంటూ కదిర్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స అనంతరం కదిర్ భాస్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా ఉండేందుకు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రంగంలోకి దిగాల్సి వచ్చింది. -
సీతారామా.. ఇదేమి ఖర్మ
పినపాక నియోజకవర్గానికి మొండిచేయి భూములు పాయె.. సాగు నీరు రాకపాయె... మూడు మండలాల్లో పూర్తయిన కాలువ సర్వే పనులు నష్టపరిహారం ఊసెత్తని అధికారులు ఆందోళనలో భూ నిర్వాసితులు పినపాక : వేల కోట్ల రూపాయల పెట్టుబడితో నాలుగు నియోజకవర్గాల పరిధిలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించ తలపెట్టిన సీతారామ ప్రాజెక్టు ద్వారా రైతులకు అవసరమయ్యే సాగునీరు అందుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్టపై ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం మూడు ప్యాకేజీలుగా రూ.7,926 కోట్లు మంజూరు చేసింది. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ మండలం కోయగుట్ట, ములకలపల్లి మండలం కమలాపురం, ఇల్లెందు మండలం చీమలపాడు, రోళ్లపాడు చెరువు, బయ్యారం పెద్ద చెరువు ద్వారా పాలేరు రిజర్వాయర్‌కు నీరు తరలించేందుకు సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. నాలుగు పంప్‌హౌస్‌ల నిర్మాణం.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో భీడు భూములకు సాగునీరు అందించేందుకు నాలుగు పంపు సెట్లు నిర్మించేలా డిజైన్ తయారు చేశారు. బీ.జీ కొత్తూరు, కోయగుట్ట, కమలాపురం, చీమలపాడు గ్రామాల వద్ద పంపు హౌస్‌లు నిర్మిస్తున్నారు. ప్రతి పంప్ హౌస్ వద్ద ప్రత్యేకంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు ఇప్పటికే భూమిని కూడా సేకరించారు. పినపాక భూములకు నీరందదా..? అశ్వాపురం మండలం దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేక కాలువ ద్వారా సాగునీరు సరఫరా చేస్తున్నారు. కానీ పినపాక నియోజకర్గం పరిధిలో గల బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పినపాక, గుండాల, కరకగూడెం, ఆళ్లపల్లి మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేదు. అధికారులు రూపొందించిన డిజైన్‌లో పినపాక నియోజకవర్గంలో ఒక్క ఎకరాకు నీరు అందించే ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. అశ్వాపురం నుంచి పాలేరుకు గోదావరి నీరు తరలిపోతున్నా పినపాక నియోజకవర్గ రైతులకు మాత్రం సాగునీరు అందే అవకాశాలు లేవు. కుమ్మరిగూడెం నుంచి పాల్వంచ, ఇల్లెందు మీదుగా జాతీయ రహదారికి కుడివైపున సుమారు 65 మీటర్ల వెడల్పుతో సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మిస్తారు. కానీ అశ్వాపురం, మణుగూరు, పినపాక, కరకగూడెం, ఆళ్లపల్లి, గుండాల మండలాలకు ప్రాజెక్టు నిర్మాణంలో స్థానం లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో గల సాగునీటి వనరులు ఇతర ప్రాంతాలకు తరలిపోతుండగా ఇక్కడి రైతులకు మొండిచెయ్యి చూపడం పట్ల పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తయిన కాలువ సర్వే పనులు.. సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణానికి ఏ గ్రేడ్‌లో ముందుగా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో 156 ఎకరాలు, అమ్మగారిపల్లిలో 84 ఎకరాలు, అమెర్ధలో 382 ఎకరాలు, చింతిర్యాలలో 40 ఎకరాలు, అశ్వాపురంలో 282 ఎకరాలు, పంప్‌హౌస్ నిర్మాణానికి అశ్వాపురంలో 22 ఎకరాలు, నెల్లిపాక బంజరలో 152 ఎకరాలు సేకరించారు. బీ గ్రేడ్‌లో కాలువ నిర్మాణం కోసం నెల్లిపాక బంజరలో 167 ఎకరాలు, బూర్గంపాడులో 198 ఎకరాలు, మోరంపల్లి బంజరలో 114 ఎకరాలు, పాల్వంచలో 117 ఎకరాలు, నారాయణరావుపేటలో 33 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందుకోసం 11 బృందాలుగా ఏర్పడి 1760 ఎకరాల్లో ప్రాథమికంగా సర్వే పనులు పూర్తి చేశారు. భూసేకరణ కోసం ఆయా గ్రామాల్లో సభల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆందోళనలో భూ నిర్వాసితులు.. సీతారామ ప్రాజెక్టు నిర్మాణంతో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. నష్టపరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయకుండానే సర్వే పనులు పూర్తి చేయడం గమనార్హం. ఎలాంటి హామీ, భరోసా లేకుండా, గ్రామసభలు నిర్వహించకుండా ప్రభుత్వం తనకు నచ్చినట్లు ప్రాజెక్టు, కాలువ సర్వే పనులు చేయడంపై ఆయా గ్రామాల్లో భూ నిర్వాసితులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. సీతారామ పాజెక్టు కుమ్మరిగూడెం,అశ్వాపురం మండలం, నిర్మాణ ప్రాంతం దుమ్ముగూడెం ఆనకట్ట ప్రాజెక్టు నిర్మాణ విలువ రూ. 7,926 కోట్లు సాగునీరు అందించే లక్ష్యం 4 లక్షల ఎకరాలు ప్రాజెక్టు నిర్మాణం 3 సంవత్సరాలు పూర్తయ్యే కాల వ్యవధి సాగు నీరందేది కొత్తగూడెం, ఇల్లెందు, పాలేరు, అశ్వారావుపేట నియోజకవర్గాలు -
నిర్వాసితులకు అండగా ఉంటాం
మణుగూరు : పినపాక నియోజకవర్గంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన పినపాక, మణుగూరు మండలాల్లోని నిర్వాసిత గ్రామాలైన పోతురెడ్డిపాడు, సీతారాంపురం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెంలో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలన్నారు. నిర్వాసితులకు రూ.5.50 లక్షల పరిహారం, లేదా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, లేదంటే నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు. ఎంత పొలం ఉన్నా ఒకే ర కమైన ప్యాకేజీ ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఓ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఒకే యూనిట్‌గా నిర్ధారించడం సరైంది కాదన్నారు. ఆడపిల్లలకు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చిన పొలానికి ప్యాకేజీ ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. అడ్రెస్ ప్రూఫ్‌లతో సంబంధం లేకుండా అమ్మాయిలు ఏ గ్రామంలో ఉన్నా ఇక్కడ భూమి ఉంటే పరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే అన్ని భూములకు ఒకే విధంగా కాకుండా భూమిని బట్టి పరిహారం ఇవ్వాలన్నారు. నిర్వాసితులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సైతం భవిష్యత్‌లో కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని, కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిర్వాసితులకు ఏమాత్రం అన్యాయం జరిగినా, వారి పక్షాన నిలబడి పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తహశీల్దార్ శ్రీనివాసులుకు సూచించారు. అనంతరం పవర్ ప్రాజెక్టు స్థల మ్యాప్‌ను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా నిర్వాసితుల సమస్యలు తెలియజేస్తామన్నారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్ఆర్సీసీ శాసనసభా పక్షనేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, కొదమసింహం పాండురంగాచార్యులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, బిజ్జ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్లు బీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండీ ఖదీర్, మాజీ జడ్పీటీసీ పాయం ప్రమీల, జడ్పీటీసీ బట్టా విజయ్గాందీ, సొసైటీ అద్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు కైపు రోషిరెడ్డి, ఈ సాల ఏడుకొండలు, మండల నాయకులు గాండ్ల సురేష్, రంజిత్, హరగోపాల్, ఆదిరెడ్డి, రాంబా బు, ఆదిలక్ష్మి, బర్లసురేష్, భద్రమ్మ, జ్యోతి, శ్రీనివాస్, అనిల్, తిరుమలేష్ పాల్గొన్నారు. -
పాయంకు ఘన స్వాగతం
బూర్గంపాడు : పినపాక నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. మండల పరిధిలోని పినపాకపట్టీనగర్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే పాయంను పూలదండలు వేసి ఘనంగా ఆహ్వానించారు. పినపాకపట్టీనగర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ఎమ్మెల్యే పాయం పూజలు చేశారు. అనంతరం భారీర్యాలీగా మోరంపల్లిబంజరకు చేరుకున్నారు. ఎంపీ బంజర, లక్ష్మీపురం గ్రామాలలోని వైఎస్ఆర్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలవరం, ముసలిమడుగు, క్రాస్రోడ్లలో మహిళలు పెద్దసంఖ్యలో పాయంకు స్వాగతం పలికారు. ప్రజలను ఎమ్మెల్యే అప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. పాయంకు స్వాగతం పలికిన వారిలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటి సభ్యులు బిజ్జం శ్రీనివాసరెడ్డి, భూపెల్లి నర్సింహారావు, మండల కన్వీనర్ వీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ బట్టా విజయగాంధీ, సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లానాయకులు కైపు సుబ్బరామిరెడ్డి, సోమురోశిరెడ్డి, మారం శ్రీనివాసరెడ్డి, బాలి శ్రీహరి, సర్వా శ్రీహరి, పొలగాని వెంకట్రావు, కైపు వెంకట్రామిరెడ్డి, పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కామిరెడ్డి రామకొండారెడ్డి, గాదె నర్సిరెడ్డి, పాండవుల దర్గయ్య, గనికల లక్ష్మయ్య, ప్రసన్నకుమార్, వర్సా చెటాక్, ఎంపీటీసీలు కైపు రోశిరెడ్డి, జక్కం సర్వేశ్వరరావు, వెలిశెట్టి శ్రీనివాసరావు, పాటి భిక్షపతి, తుమ్మల పున్నమ్మ, సర్పంచ్‌లు బొర్రా శ్రీను, బి భిక్షం తదితరులు పాల్గొన్నారు.