బూర్గంపాడు: పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి రెండురోజులే గడువుంది. పినపాక నియోజకవర్గంలో మాత్రం ఎక్కడ పెద్దగా ఎన్నికల హడావుడి కనిపించటం లేదు. ఏదో నామమాత్రంగా సభలు, సమావేశాలతోనే ఎన్నికల ప్రచారాన్ని మమ అనిపిస్తున్నారు. గ్రామాలలో ఇంటింటి ప్రచారాలు లేవు. మైకులతో ప్రచార హోరు అసలు కనిపించటం లేదు. పినపాక నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం మండలాల్లో ఎన్నికల ప్రచారం నామమాత్రమే. మణుగూరు, బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో మాత్రం సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో ఎన్నికల ప్రచారం మొక్కుబడిగా నడుస్తోంది.
మహబూబాబాద్ పార్లమెంట్ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత కేవలం నాలుగైదుసార్లు మాత్రమే నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వచ్చింది. అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరామ్‌నాయక్, బీజేపీ అభ్యర్థి జాటోత్ హుస్సేన్‌నాయక్, సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వర్లు కూడా నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఐదారు పర్యాయాలే ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. టీఆర్‌ఎస్ తరుపున రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీలు సత్యావతి రాథోడ్, బాలసాని లక్ష్మీనారాయణ ప్రచారసభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరుపున మాత్రం ఇప్పటి వరకు స్టార్ క్యాంపెయినర్‌లు ఎవరూ ఎన్నికల ప్రచారానికి రాలేదు.
కాంగ్రెస్ అభ్యర్థి పొరిక బలరామ్‌నాయక్ మాత్రమే అన్ని తానై ప్రచారం చేసుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి తరపున కూడా ఇప్పటి వరకు స్టార్ క్యాంపెయినర్ ఎవరూ ఎన్నికల ప్రచారానికి రాలేదు. బీజేపీ అభ్యర్థి హుస్సేన్‌నాయక్ స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వామపక్షాల తరుపున బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి కల్లూరి వెంకటేశ్వర్లు తరుపున సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ప్రచారం సాగిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ఎండవేడిమి కూడా ప్రతిబంధకంగా మారింది.
దీనికి తోడు ఎన్నికల ప్రచారానికి డబ్బు విపరీతంగా ఖర్చవుతుండటంతో అభ్యర్థులు ప్రచారానికి వెనకడుగు వేస్తున్నారు. అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికలలో విచ్చలవిడిగా ప్రచారాలకు ఖర్చు చేసిన నాయకులు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే సరికి ఖర్చులకు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలపై ఓటర్లు కూడా పెద్దగా ఆసక్తి కనబరచటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment