సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో అడుగు పెట్టారు. టీడీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించగా, వారి ఆహా్వనం మేరకు తుమ్మల టీడీపీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు జై తుమ్మల అంటూ నినదిస్తూ కాంగ్రెస్ కండువా కప్పుకుని ఉన్న ఆయనకు టీడీపీ కండువా వేశారు.
టీడీపీ పార్టీ జెండాలతో కార్యాలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం తుమ్మల కార్యాలయంలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానాన్ని ఈ స్థాయికి తెచ్చిన భవనం ఇదని చెప్పారు. భవిష్యత్‌లోనూ ఎన్‌టీఆర్ క్రమశిక్షణ, నిబద్ధతను కొనసాగిస్తానని తెలిపారు. చంద్రబాబు తాత్కాలిక బెయిల్‌పై బయటకు వచ్చిన సందర్భంగా సంతోషంలో భాగస్వామ్యం కావాలని ఇక్కడికి వచ్చానన్నారు.
ఇదే కేరింతలతో 30 రోజుల పాటు తన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని టీడీపీ శ్రేణులను కోరారు. ఏ పార్టీలోకి వెళ్లినా టీడీపీని బతికించాలని తపన పడిన నేతలు తన గెలుపునకు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. తుమ్మల వెంట మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ కార్పొరేటర్ రావూరి కరుణ, కాంగ్రెస్ నేతలు రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, మిక్కిలినేని నరేంద్ర ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment