స్తంభాద్రి గడ్డపై.. సై అంటే సై | Sakshi ground report from khammam | Sakshi
Sakshi News home page

స్తంభాద్రి గడ్డపై.. సై అంటే సై

Published Sun, Nov 26 2023 5:00 AM | Last Updated on Sun, Nov 26 2023 8:01 AM

Sakshi  ground report from khammam

భద్రాద్రి రాముడు, స్తంభాద్రి లక్ష్మీనరసింహుడు కొలువైన నేల.. తెలంగాణ నల్లబంగారం  సింగరేణి ప్రాంతం, నిత్యం ఆటుపోట్లు ఎదుర్కొంటూ అడవి జీవనం సాగించే ఆదివాసీలకు అడ్డా, రాష్ట్రంలోనే అత్యధిక రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి ఆసక్తికర ఎన్నికలు సాగుతున్నాయి. గత రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ పక్షానే నిలబడిన ఖమ్మం జిల్లా ప్రజలు ఈసారి ఏం చేస్తారోననే ఉత్కంఠ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయవర్గాల్లో నెలకొంది.

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుల చేరికతో కాంగ్రెస్‌ పార్టీకి మళ్లీ పాత ఫలితాలు పునరావృతమవుతాయా? లేక కేసీఆర్‌ నాయకత్వంలో పదేళ్ల సంక్షేమ పాలన ఈసారి ఖమ్మం జిల్లాలో బీఆర్‌ఎస్‌ పట్టును చూపెడుతుందా? అన్నది చర్చనీయాంశమవుతోంది. ఇక్కడ ఉభయ కమ్యూనిస్టు పార్టీల్లో సీపీఐ కాంగ్రెస్‌ కూటమిలో చేరగా, సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తోంది.

మార్క్సిస్టులకు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వస్తాయి? ఎవరి గెలుపు అవకాశాలనైనా ఈ ఓటు బ్యాంకు ప్రభావితం చేస్తుంది? బీజేపీకి ఎన్ని చోట్ల డిపాజిట్‌ దక్కుతుంది? స్వతంత్రులెవరైనా  గట్టెక్కుతారా అనే చర్చ జరుగుతోంది. రెండు ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్,  బీఆర్‌ఎస్‌లు పోటాపోటీగా ప్రచార పర్వాన్ని సాగిస్తున్న ఖమ్మం జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందన్న దానిపై  ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌ ఇది... ! 

పాలేరు   ప్రత్యేకం...? 
ఖమ్మం జిల్లాకు సరిహద్దులో ఉండే పాలేరు నియోజకవర్గంలో పోటీ ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. ఇక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి సౌమ్యుడిగా, ఆపదలో ఆదుకునే వ్యక్తిగా పేరుంది కానీ పార్టీ మార్పు వ్యవహారం ఈసారి ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.కాంగ్రెస్‌ నుంచి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బరిలోకి దిగడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది.

ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు కూడా ఈసారి పొంగులేటి వైపు మొగ్గుచూపుతున్నట్టు కనిపిస్తోంది. బలమైన నాయకుడు కావడం,  మంచి వ్యక్తి అనే పేరుండడం పొంగులేటికి కలిసివచ్చే అంశాలు. సాంప్రదాయ ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు ఎలాగూ ఉంది. ఇక, సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ చేస్తుండడంతో ఈసారి మార్క్సిస్టులకు పాలేరులో ఎన్ని ఓట్లు వస్తాయి..? ఆ ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందన్నది చర్చతోపాటు రాష్ట్రంలో సీపీఎం భవిష్యత్‌ను అంచనా వేసేందుకు కీలకం కానుంది.  

కొత్తగూడెం   కొంగొత్త రాజకీయం 
కాంగ్రెస్‌తో రాష్ట్ర వ్యాప్త పొత్తు కుదుర్చుకున్న సీపీఐ అధికారికంగా పోటీ చేస్తోంది కొత్తగూడెంలోనే. ఈ పొత్తు కారణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడా లేని విధంగా కొత్తగూడెంలో త్రిముఖ పోటీ కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ మద్దతుతో సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ బరిలో లేకపోవడంతో ఇక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పక్షాన పోటీ చేస్తున్నారు.

పార్టీ మార్పు, కుమారుడి వ్యవహారశైలి వనమాకు కొంత ప్రతికూలంగా ఉన్నా నియోజకవర్గానికి సుపరిచితుడు, అందుబాటులో ఉండే వ్యక్తి కావడం, తోడల్లుడు ఎడవెల్లి కృష్ణతో ఉన్న గొడవలు పరిష్కారం కావడం, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మద్దతు కలిసిరానున్నాయి. జలగం వెంకట్రావు పూర్తిగా తన సొంత బలంపై వెళుతుండగా, కూనంనేనికి కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు బదిలీ ఆశాదీపంగా కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాల్సిందే! 

సత్తుపల్లి   సత్తా చాటేదెవరో? 
ఎస్సీ రిజర్వ్‌డు అయిన సత్తుపల్లిలో ఈసారి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ల మధ్య భీకరంగా రాజకీయ యుద్ధం జరుగుతోంది. పోటీ చేసే అభ్యర్థులతో సమానంగా ఇక్కడ ఇరుపార్టీల ముఖ్య నేతలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులకు మంచి పట్టు ఉన్న ఈ స్థానం నుంచి ఆ పార్టీ పక్షాన పాతకాపు మట్టా దయానంద్‌ సతీమణి రాగమయి బరిలో ఉన్నారు.

బీఆర్‌ఎస్‌ నుంచి బలమైన నాయకుడిగా గుర్తింపు పొందిన సండ్ర వెంకటవీరయ్య పోటీ చేస్తున్నారు. ఇరువురు గట్టి అభ్యర్థులు కావడం, ఇద్దరికీ కీలక నేతల మద్దతు ఉండడం, ప్రధాన భూమిక పోషించే సామాజిక వర్గాలు ఇద్దరినీ అక్కున చేర్చుకుంటుండడం, మండలాల వారీగా భిన్న పరిస్థితులు కనిపిస్తుండడం సత్తుపల్లిలో ఈసారి ఫలితం ఎలా ఉంటుందోననే ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.  

భద్రాచలం   ఎవరి పరం? 
కాంగ్రెస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీఆర్‌ఎస్‌ నుంచి తెల్లం వెంకట్రావులు ఇక్కడ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా ఇక్కడి నుంచి పోటీ చేసిన వీరయ్య వైఖరి పట్ల నియోజకవర్గ ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదు. అయితే, ప్రతిపక్ష పార్టీలో ఉండడం వల్ల పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే భావన కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ కావడం, ఆయన గత రెండుసార్లు పోటీ చేసిన ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో, మూడోసారైనా గట్టెక్కుతారేమోననే సానుభూతి వ్యక్తమవుతోంది.

కొన్ని రోజుల వరకు పూర్తిగా కాంగ్రెస్‌ పక్షానే కనిపించిన ఈస్థానంలో పరిస్థితిలో కొంతమార్పు కనిపిస్తోంది. సీపీఐతో పాటు కాంగ్రెస్‌ నుంచి కొందరు బీఆర్‌ఎస్‌లో చేరడంతో భద్రాచలం టౌన్‌లో హోరాహోరీ పోరు సాగుతోంది. సీపీఎం నుంచి పోటీ చేస్తున్న కారం పుల్లయ్యకు ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తంమీద భద్రాచలం ప్రజల్లో కొంత కాంగ్రెస్‌కు సానుకూల అభిప్రాయం కనిపిస్తోంది.  

వైరా    గరంగరం 
ఈ దఫా ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో నియోజకవర్గం వైరా. ఇక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ వైపు కేసీఆర్‌ మొగ్గుచూపడంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగారు. కాంగ్రెస్‌ పార్టీలో దశాబ్దాలుగా పనిచేస్తోన్న రాందాస్‌ నాయక్‌ భట్టి ఆశీస్సులతో టికెట్‌ తెచ్చుకున్నారు. వీరిద్దరి నడుమ పోరు రసవత్తరంగా సాగుతోంది. రాములునాయక్‌ బీఆర్‌ఎస్‌తో కలిసే ఉన్నా ఆయన వర్గం ఏ మేరకు సహకరిస్తుందన్నది చర్చనీయాంశమే.

ఇక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గం మద్దతు కోసం రాందాస్‌ నాయక్‌ ఆశతో ఉన్నారు. స్థానిక నాయకత్వంతో ఆయనకు ఇంకా సయోధ్య కుదరనట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్‌ సాంప్రదాయ ఓటుబ్యాంకు, మార్పు కోరుతున్న నియోజకవర్గ ప్రజల ఆశీస్సులపై రాందాస్‌ ఆధారపడగా, కారుగుర్తు, కేసీఆర్‌ నాయకత్వం, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గ ప్రజలతో తనకున్న సన్నిహిత సంబంధాలపై మదన్‌లాల్‌ ముందుకెళుతున్నారు. మిగిలిన పార్టీలు బరిలో ఉన్నా పోటీ నామమాత్రమే.  

ఇల్లెందు  ఇంట ఇబ్బందిగానే..
ఇల్లెందులో ఈసారి ఆసక్తికర పోరు జరుగుతోంది. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కోరం కనకయ్య ఈసారి కాంగ్రెస్‌ నుంచి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియానాయక్‌ బీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యా తీవ్ర పోటీ కనిపిస్తోంది. లంబాడీ, కోయ, గిరిజనేతరుల కోణంలో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయని అంచనా. పార్టీ మారిన అంశం హరిప్రియకు ప్రతికూలంగానే మారింది.

గతంలో పోటీ చేసినప్పుడు ఆమె చేసిన ప్రమాణాలపై కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మద్దతు ఉన్న కోరం కనకయ్య కాంగ్రెస్‌ పార్టీ ఓట్‌బ్యాంక్‌తో పాటు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతపై ఆధారపడి ముందుకెళుతున్నారు. తన హయాంలో జరిగిన అభివృద్ధి, కేసీఆర్‌ నాయకత్వం, సంక్షేమ పథకాలపై హరిప్రియ ఆశలు పెట్టుకున్నారు.  

పేట పట్టం ఎవరికో? 
ఎస్టీ రిజర్వ్‌డ్‌ అయిన అశ్వారావుపేట నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులతో సమానంగా మరో ఇద్దరు నేతల మధ్య పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్‌ బలమైన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎంపీ బండి పార్థసారథిరెడ్డిల ప్రభావం ఈనియోజకవర్గంలో స్పష్టంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి జారె ఆదినారాయణకు టికెట్‌ వచ్చినప్పటికీ టికెట్‌ ఆశించిన మిగిలిన ముగ్గురు నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు.

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుతో తెలుగుదేశం నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు పెద్దగా అభివృద్ధి చేయలేకపోయారనే అభిప్రాయం కనిపించింది. చాలాకాలం పాటు అటూ ఇటూ ఊగిసలాడిన మెచ్చా చివరకు బీఆర్‌ఎస్‌లో చేరినా ఫలితం దక్కలేదని అక్కడి ప్రజలంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు, టీడీపీ నుంచి లభిస్తున్న పరోక్ష సహకారం ఓవైపు, అధికార పార్టీ అవిశ్రాంత ప్రయత్నాలు మరోవైపు హోరాహోరీ తలపడుతున్నాయి. ఫలితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే...! 

ఖమ్మం   గుమ్మంలో విజేత ఎవరో? 
ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నది ఖమ్మం అసెంబ్లీ ఫలితం కోసమే. ఇక్కడ ఇద్దరు బడా నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్‌ బీఆర్‌ఎస్‌ నుంచి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ నుంచి అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో జరిగిన అభివృద్ధిని చూపించి తుమ్మల బృందం, ఇప్పుడు కళ్ల ముందు కనపడుతున్న అభివృద్ధిని చూడండంటూ పువ్వాడ టీం ఊరూవాడా కలియతిరుగుతున్నాయి.

సీపీఎం నుంచి ఎర్రా శ్రీకాంత్‌ పోటీ చేస్తున్నా పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి కనిపించడం లేదు. ఇక్కడ సీపీఐ మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందా లేక మంత్రి పువ్వాడ వైపు నిలబడుతుందా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరు నేతలకు ఆ సామాజికవర్గం మద్దతుతో పాటు ఖమ్మం సిటీ ప్రజల మద్దతు తోడైతేనే ఇక్కడ ఎవరు గెలిచేది తేలనుంది. 

పినపాక పాతకాపుల పోరు  
ఎస్టీ రిజర్వుడు అయిన పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి హోరాహోరీ పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు ఈసారి బీఆర్‌ఎస్‌ నుంచి, బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌కు బలమైన ఓటు బ్యాంకు ఉన్న పినపాకలో ఆ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు పాత కాంగ్రెస్‌ మనిషి కాంతారావు ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి ప్రయత్నిస్తున్నారు.

రేగా కాంతారావు రూ.300 కోట్లతో ఇక్కడ ఎంతోకొంత అభివృద్ధి చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే ఎమ్మెల్యే పార్టీ మారిన అంశంపై పినపాకలో పెద్దగా చర్చ జరగడం లేదు. కాంగ్రెస్‌కు సీపీఐ తోడయింది.  పాయం వెంకటేశ్వర్లుకు పొంగులేటి మద్దతు, సీపీఐ చేయూత, గతంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కలిసి వచ్చే అవకాశాలున్నాయి. 

మధిర ముచ్చట తీరేనా? 
సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క ఇక్కడి నుంచి మరోమారు కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా పాతకాపు లింగాల కమల్‌రాజ్‌ (బీఆర్‌ఎస్‌) బరిలో ఉన్నారు. సీపీఎం నుంచి వెంకులు పోటీ చేస్తున్నారు. పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యనే కనిపిస్తోంది. దళితబంధు పథకాన్ని పైలట్‌ కింద ఈ నియోజకవర్గంలో అమలు చేసింది. బీఆర్‌ఎస్‌కు సానుకూలమైనా ఇతర వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైఎస్సార్‌టీపీ మద్దతు, ఆరు గ్యారంటీలు, గెలిస్తే భట్టి ముఖ్యమంత్రి అవుతారని జరుగుతున్న చర్చ భట్టికి కలసి వస్తున్నాయి. కమల్‌రాజ్‌ బీఆర్‌ఎస్‌ బలంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఎజెండాతోనే వెళుతున్నారు.  

అందరికీ అవకాశమివ్వాలి  
‘తెలంగాణ ఏర్పాటయ్యాక రెండుసార్లు బీఆర్‌ఎస్‌ గెలిచింది. ఎప్పుడూ ఒక్కరే గెలవొద్దు. అప్పుడప్పుడు పరిపాలించే పార్టీలు మారుతుండాలి. అందరినీ ప్రేమించి, అందరికీ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఏం చేశారు, ఏం చేయలేదన్న దానిపై చర్చ అవసరం లేదు. తెలంగాణకు మరింత మంచి జరగాలంటే ఈసారి మార్పు కావాలి.’  –  షేక్‌ కొండయ్య, వికలాంగుడు, ఖమ్మం 

నన్ను కాపాడింది ఆరోగ్యశ్రీనే  
‘చనిపోయానని అనుకున్న నేను బతికానంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ పెట్టిన ఆరోగ్యశ్రీనే కారణం. ఆరోగ్యశ్రీకి మొదటి లబ్దిదారు నేనే. 2006లో నా కిడ్నీలు పాడయ్యాయి. హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆరోగ్యశ్రీ కింద చేరి్పంచి చికిత్స అందించారు. 17 ఏళ్లుగా నా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదు. అప్పటినుంచి మేం ఆయన చూపించిన దారిలోనే నడుస్తున్నాం. ఈసారి కూడా అంతే.’      – భీంశెట్టి రంగనాయకమ్మ, పాలేరు   

మంచిని అందరూ మెచ్చుకోవాలి   
‘నాకు పదెకరాల భూమి ఉంది. రైతుబంధు వస్తుంది. కరెంటు బాగుంది. ధాన్యం కూడా కొంటున్నారు. ఇలాంటి ప్రభుత్వానికి అందరూ మద్దతివ్వాలి. రైతువారీగా ఎలాంటి ఇబ్బంది లేదు. మంచిని మెచ్చుకోవాలి. అందరూ ప్రోత్సహించాలి.’ 

-ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి  మేకల కళ్యాణ్‌ చక్రవర్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement