నాగార్జునసాగర్ ఆయకట్టు.. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో పచ్చని పైర్లకు నెలవు. కృష్ణమ్మ పరవళ్లు తొక్కితే ఆయకట్టులో పంటలు కళకళలాడుతాయి. ఈ ఆయకట్టులో ఏ ఎన్నికలు పరిశీలించినా ఆసక్తికర ఫలితాలే వస్తున్నాయి. మొత్తం ఈ ఆయకట్టులో తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, వైరా, మధిర, సత్తుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి.
2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లోని ఏడింట కాంగ్రెస్ గెలిచింది. వైరాలో వైఎస్సార్‌సీపీ, సత్తుపల్లిలో టీడీపీ పాగా వేశాయి. గత 2018 ఎన్నికల్లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, కోదాడ, ఖమ్మం స్థానాల్లో బీఆర్‌ఎస్, హుజూర్‌నగర్, పాలేరు, మధిర స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సత్తుపల్లి టీడీపీ ఖాతాలో చేరితే.. వైరా ఇండిపెండెంట్ ఖాతాలో పడింది. గత రెండు ఎన్నికల ఫలితాలు విలక్షణంగా వచ్చిన నేపథ్యాన ప్రస్తుత ఎన్నికలు అటు బీఆర్‌ఎస్, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి.
6.45 లక్షల ఎకరాలు.. 3.10 లక్షల రైతులు
నాగార్జునసాగర్ కింద మొదటి జోన్‌లోని నల్లగొండ, రెండో జోన్‌లోని ఖమ్మం జిల్లా కలిపి మొత్తం 6.45 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో 3.10 లక్షల మంది రైతులు ఉన్నారు. సాగర్ నీరు విడుదలైతే రెండు పంటలు వరితోపాటు పత్తి, మిర్చి, కంది సాగవుతాయి. ఈ తొమ్మిది నియోజకవర్గాలకు సాగర్ జలాలే ఆధారం. ఈ నియోజకవర్గాల్లో రాజకీయ చైతన్యం కూడా ఎక్కువే. ప్రధాన పార్టీలకు ఇక్కడ ఓటర్లు ఇచ్చే తీర్పు కీలకమవుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో ఆయకట్టు రైతులు విలక్షణంగా తీర్పు ఇస్తే...ఈసారి వారి అంతరంగం ఎలా ఉండబోతుందోనన్న రాజకీయ విశ్లేషణ సాగుతోంది.
ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ హవా
2014 ఎన్నికల్లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి వెంకట్‌రెడ్డి గెలుపొందగా.. ఆ తర్వాత ఆయన అనారోగ్యంతో మృతిచెందారు. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన బీఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు.
ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నల్లగొండ నుంచి గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలిచారు. అలాగే 2018లో నాగార్జునసాగర్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన నోముల నరసింహయ్య అనారోగ్యంతో మృతి చెందగా, ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు నోముల భగత్.. కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జానారెడ్డిపై గెలుపొందారు.
ఈసారి పోటీలో ఉద్ధండులు
ఈ ఎన్నికల్లో సాగర్ ఆయకట్టులోని తొమ్మిది నియోజకవర్గాల్లో హేమాహేమీలు, ముఖ్య నేతల వారసులు పోటీ పడుతున్నారు. నాగార్జునసాగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి కె.జానారెడ్డి కుమారుడు జయవీర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య తనయుడు భగత్ పోటీలో ఉన్నారు. హుజూర్‌నగర్ నుంచి ఎంపీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య పద్మావతి బరిలో నిలిచారు.
పాలేరు నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ కో–చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీ పడుతున్నారు. ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్‌రెడ్డిని ఆ పార్టీ పోటీకి దింపింది. ఖమ్మం నుంచి మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల సమరంలో నిలిచారు. మధిర నుంచి సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క కాంగ్రెస్ అభ్యర్థిగా, సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య పోటీ పడుతున్నారు.
ప్రజల తీర్పు ఎలా ఉంటుందో...
రెండు జిల్లాల్లోని తొమ్మిది నియోజకవర్గాల్లో ఏ పార్టీ కి ఎన్ని స్థానాలు వస్తాయి.. ఏ నియోజకవర్గంలో ఎవరికి ప్రజలు పట్టం కడతారనే ఉత్కంఠ నెలకొంది. గత రెండు ఎన్నికల్లో భిన్నమైన తీర్పు రావడం, ఈసారి ప్రధాన పార్టీల ముఖ్యమైన నేతలు బరిలో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు ఈ తొమ్మిది స్థానాల్లో పోటీలో ఉండగా.. సీపీఎం కూడా ఈ తొమ్మిది నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో ఎవరి ఓట్లు చీలుతాయి, ప్రజలు ఎవరిని విజయతీరాలకు చేరుస్తున్నారన్నది డిసెంబర్ 3న తేలనుంది.
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు ఇలా
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం : 6.45 లక్షల ఎకరాలు
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులు: 3.10 లక్షలు
మొత్తం నియోజకవర్గాలు: తొమ్మిది
ప్రధాన పార్టీలు: బీఆర్‌ఎస్, కాంగ్రెస్
-బొల్లం శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment