బలమైన ప్రాంతీయ పార్టీలకే బీజేపీని అడ్డుకొనే శక్తి ఉంది
కేంద్రాన్ని శాసించేది బీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, డీఎంకే వంటి పార్టీలే
బీజేపీ అరాచకాలకు ప్రజాశక్తితోనే అడ్డుకట్ట వేస్తాం
ముఖ్యమంత్రి పదవికి రేవంత్ ఏమాత్రం తగడు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సొంత పార్టీ నేతలే కూల్చేస్తారు
10–12 ఎంపీ సీట్లు గెలిస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ తిరిగి శాసిస్తారు
మోసపోయిన ప్రజలకు సాంత్వన చేకూర్చేందుకే బస్సు యాత్ర
సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
(కల్వల మల్లికార్జున్‌రెడ్డి) ‘లోక్‌సభ ఎన్నికల పోరు ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ నడుమ కాకుండా ప్రాంతీయ శక్తులతోనే జరుగుతోంది. ప్రాంతీయ శక్తులే ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా ఉంటాయి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది ప్రాంతీయ పార్టీలే. బీజేపీ పదేళ్లుగా అధికారంలో ఉన్నా అడ్డుకొనే శక్తి జాతీయ పార్టీగా చెప్పుకొనే కాంగ్రెస్ పార్టీకి లేదు. బీజేపీకి అడ్డుకట్ట వేసేది ప్రాంతీయ శక్తులే’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు స్పష్టం చేశారు.
దేశంలో పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలే తప్ప 28 రాష్ట్రాల్లో బలంగా వేళ్లూనుకున్న జాతీయ పార్టీలే లేవన్నారు. బీఆర్‌ఎస్, టీఎంసీ, ఆప్, వైఎస్సార్‌సీపీ, డీఎంకే వంటి బలమైన ప్రాంతీయ పార్టీల వల్ల ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి స్థానం లేకుండా పోయిందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రభుత్వాల కూల్చివేతకు బీజేపీ చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడిందని గుర్తుచేశారు.
కానీ కాంగ్రెస్ పాలించిన కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో బీజేపీ కుట్రలను ఆ పార్టీ అడ్డుకోలేక పోయిందని విశ్లేషించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ పలు అంశాలపై స్పందించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
హైదరాబాద్‌ను యూటీ చేసే కుట్ర
‘హైదరాబాద్‌పై పట్టు చేజిక్కించుకోవడంతోపాటు బీఆర్‌ఎస్‌కు చెక్ పెట్టేందుకు హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ పన్నాగం పన్నుతోంది. నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను తమిళనాడు, కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నిస్తోంది. లోక్‌సభలో మూడింట రెండొంతుల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేయడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్ల రద్దుకు కుట్రలు చేస్తోంది.
వీటిని అడ్డుకొనేందుకు బీఆర్‌ఎస్ వంటి సమాఖ్య స్ఫూర్తిగల ప్రాంతీయ పార్టీల అవసరం ఉంది. బీఆర్‌ఎస్‌కు ఎక్కువ సీట్లు వస్తేనే వాటికి అడ్డుకట్ట వేయగలుగుతుంది. కేసీఆర్, వైఎస్ జగన్, స్టాలిన్, పినరయి విజయన్ వంటి ప్రాంతీయ శక్తులు గట్టిగా గొంతు విప్పితే కేంద్రాన్ని శాసించడంతోపాటు దక్షిణాదిని రక్షించుకోవచ్చు.
రూ. వేల కోట్ల స్కాంలు చేసినా బీజేపీలో చేరగానే క్లీన్‌చిట్
కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ ఎవరు అధికారంలో ఉన్నా ‘ఉంటే జేబులో ఉండు.. లేదంటే జైల్లో ఉండు’అనేలా వ్యవహరిస్తున్నాయి. జగన్‌పై కేసులు, జైల్లో పెట్టినా ప్రజల వద్దకు వెళ్లి తీర్పు కోరారు. ప్రజల్లో బలంగా ఉండే నాయకుడిని ముట్టుకొనేందుకు ఏ ఏజెన్సీ అయినా భయపడాల్సిందే.
వివిధ అభియోగాలు ఎదుర్కొంటున్న 25 మంది నేతలు బీజేపీలో చేరగానే క్లీన్‌చిట్ వచ్చింది. సుజనా చౌదరి, సీఎం రమేశ్, అజిత్ పవార్ రూ. వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడినా మోదీతో చేతులు కలిపిన వెంటనే వారికి క్లీన్‌చిట్ లభించింది.
3 వేల మందికిపైగా మహిళలను లైంగికంగా వేధించిన జేడీఎస్ ఎంపీ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ బీజేపీ సహకారం లేకుండా దేశం దాటాడా? రూ. 100 కోట్ల కుంభకోణం అంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కవితను జైల్లో పెట్టారు. ఇదే ఆరోపణలపై అరెస్టు అయిన మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్‌గా మారి టీడీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. బీజేపీలో చేరితే కడిగిన ముత్యాలు అవుతారా? ఈ అరాచకాలను ప్రజాశక్తితోనే ఎదుర్కొంటాం.
షర్మిలను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే
మోదీ 2014లో, రేవంత్‌రెడ్డి 2023లో ప్రజలకు రంగుల కల చూపి అధికారంలోకి వచ్చారు. ప్రజలను ఊహల పల్లకిలో కూర్చోబెట్టడంతోపాటు కేసీఆర్‌ను దుర్మార్గుడిగా చిత్రీకరించేందుకు అనేక శక్తులను వాడారు. వై.ఎస్. షర్మిలను తెలంగాణలో ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీయే.
తెలంగాణలో కేసీఆర్‌ను బదనాం చేయడం, వై.ఎస్. రాజశేఖరరెడ్డి అభిమానులను బీఆర్‌ఎస్‌కు దూరం చేసేందుకు షర్మిలను ఉపయోగించుకున్నారు. షర్మిలతో పార్టీ పెట్టించి తిట్టించింది కాంగ్రెస్ పార్టీయే. ఇక్కడ పని కాగానే షర్మిలను ఆంధ్రాలో ప్రయోగిస్తున్నారు. షర్మిలతో అక్కడా అదే ప్రయోగం చేయడం కాంగ్రెస్ స్ట్రాటజీలో భాగం.
కాంగ్రెస్ నేతలే కూల్చుతారు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చాల్సిన అసవరం లేదు. రేవంత్ చుట్టూ కాంగ్రెస్‌కు చెందిన ఖమ్మం, నల్లగొండ బాంబులు ఉన్నాయి. ప్రజలు 10–12 ఎంపీ సీట్లు మాకు ఇస్తే ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను తిరిగి కేసీఆర్ శాసించే పరిస్థితి ఉంటుంది.
ఎమ్మెల్యేలు పార్టీ మారిన స్టేషన్ ఘనపూర్, ఖైరతాబాద్, భద్రాచలంలో ఉప ఎన్నిక ఖాయం. కాంగ్రెస్ ప్రతిష్ట క్షేత్రస్థాయిలో దిగజా రుతోంది. ‘ఆర్ ట్యాక్స్ కడితేనే భవన నిర్మాణ అనుమతులు వస్తున్నాయి. ఢిల్లీకి డబ్బు సంచులు పంపేందుకు బిల్డర్లు, రైస్‌మిల్లర్లను బెదిరిస్తున్నారు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారు.
సోషల్ మీడియాలో వికృత ధోరణి
రేవంత్‌రెడ్డి సీఎం పదవికి తగని చిల్లరగాడు. ఆయనవి చిల్లర మాటలు, ఉద్దెర పనులు. రేవంత్ ప్రసంగాలను కుటుంబంతో కూర్చుని చూడలేని పరిస్థితి. ప్రజలను చిరకాలం ప్రజలను భ్రమల్లో పెట్టవచ్చని అనుకుంటున్నాడు.
మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగిన మూడు పిల్లర్లను ఉద్దేశపూర్వకంగా మరమ్మతులు చేయట్లేదు. కేసీఆర్‌ను ఉద్దేశపూర్వకంగా బదనాం చేసేందుకే పంటల ను ఎండబెట్టారు. డిసెంబర్ 3న కేసీఆర్ తిరిగి సీఎం అయ్యుంటే మేడిగడ్డకు మరమ్మతులు చేసి పంటలను కాపాడేవారు.
కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసింది
ఇతర పార్టీల నుంచి చేరిన కొందరిని పూర్తిగా చదవకుండానే పదవులు ఇచ్చాం. కుండ పగిలినా కుక్క బుద్ధి తెలిసింది. పార్టీని వీడిన కడియం, రంజిత్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్ వంటి వారిపై బీఆర్‌ఎస్ కేడర్ కసితో ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ద్రోహులను దగ్గరకు తీయకుండా గుణపాఠం నేర్పుతాం. లోక్‌సభ ఎన్నికల్లో సామాజిక సమతూకం పాటించి రిజర్వుడ్ స్థానాల్లోనూ ఉద్దండులను బరిలోకి దించాం. కనీసం 10–12 స్థానాల్లో గెలుస్తామనే నమ్మకం ఉంది.
రెఫరెండం ప్రకటనకు కట్టుబడి ఉండాలి
మాట ఇచ్చి తప్పడం రేవంత్‌కు అలవాటు. కొడంగల్‌లో రాజకీయ సన్యాసమని మల్కాజిగిరిలో పోటీ చేశాడు. లోక్‌సభ ఎన్నికలు రెఫరెండం అంటున్న రేవంత్ కాంగ్రెస్‌కు మెజారిటీ సీట్లు రాకుంటే పదవి నుంచి తప్పుకుంటారా? జిల్లాల సంఖ్య తగ్గిస్తామని రేవంత్ అనడం తుగ్లక్ పని. 33 జిల్లాల్లో ఒక్కటి టచ్ చేసినా తెలంగాణ తిరగబడుతుంది.
జగన్ మళ్లీ గెలుస్తారు
గుంటూరులో ఇంటర్ చదివా. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వారితో మాట్లాడుతున్న దానిని బట్టి ఏపీలో వై.ఎస్. జగన్ మళ్లీ గెలిచి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. జగన్ మళ్లీ గెలిచి వస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే బీఆర్‌ఎస్, వైసీపీ, జేడీఎస్ వంటి 13 పార్టీలు కూటముల రూపురేఖలను మార్చేస్తాయి.
కాంగ్రెస్‌ను వెంటాడతాం
కేసీఆర్ సీఎంగా లేరనే విషయాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. హామీలు నెరవేర్చకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌ను వెంటాడుతాం. ఏడు పదుల వయసులో మేజర్ సర్జరీ జరిగినా.. కర్ర సాయంతో నడుస్తూ, కూతురు జైల్లో ఉన్నా, ఎర్రటి ఎండలున్నా, నమ్ముకున్న నాయకులు పార్టీని వీడుతున్నా, రేవంత్ పరుషంగా మాట్లాడుతున్నా కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలకు సాంత్వన చేకూరేలా కేసీఆర్ చేస్తున్న బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment