నిర్వాసితులకు అండగా ఉంటాం
మణుగూరు : పినపాక నియోజకవర్గంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలుస్తామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఆయన పినపాక, మణుగూరు మండలాల్లోని నిర్వాసిత గ్రామాలైన పోతురెడ్డిపాడు, సీతారాంపురం, చిక్కుడుగుంట, దమ్మక్కపేట, సాంబాయిగూడెంలో పర్యటించి రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు తాము వ్యతిరేకం కాదని, అయితే నిర్వాసితులకు అన్యాయం జరిగితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలన్నారు.
నిర్వాసితులకు రూ.5.50 లక్షల పరిహారం, లేదా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, లేదంటే నెలకు రూ.2వేల పింఛన్ ఇస్తామని ప్రకటించడం సరైంది కాదన్నారు. ఎంత పొలం ఉన్నా ఒకే ర కమైన ప్యాకేజీ ఇస్తామంటే ఎలా అని ప్రశ్నించారు. ఓ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉంటే వారిని ఒకే యూనిట్‌గా నిర్ధారించడం సరైంది కాదన్నారు. ఆడపిల్లలకు పసుపు కుంకుమ పేరుతో ఇచ్చిన పొలానికి ప్యాకేజీ ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. అడ్రెస్ ప్రూఫ్‌లతో సంబంధం లేకుండా అమ్మాయిలు ఏ గ్రామంలో ఉన్నా ఇక్కడ భూమి ఉంటే పరిహారం ఇవ్వాలని కోరారు. అలాగే అన్ని భూములకు ఒకే విధంగా కాకుండా భూమిని బట్టి పరిహారం ఇవ్వాలన్నారు.
నిర్వాసితులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు సైతం భవిష్యత్‌లో కాలుష్య కోరల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని, కాలుష్య నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. నిర్వాసితులకు ఏమాత్రం అన్యాయం జరిగినా, వారి పక్షాన నిలబడి పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తహశీల్దార్ శ్రీనివాసులుకు సూచించారు. అనంతరం పవర్ ప్రాజెక్టు స్థల మ్యాప్‌ను పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి కూడా నిర్వాసితుల సమస్యలు తెలియజేస్తామన్నారు.
ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్‌ఆర్‌సీసీ శాసనసభా పక్షనేత, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, కొదమసింహం పాండురంగాచార్యులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర శ్రీనివాసరెడ్డి, వట్టం రాంబాబు, ఉడుముల లక్ష్మారెడ్డి, బిజ్జ శ్రీనివాసరెడ్డి, మండల కన్వీనర్‌లు బీరంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎండీ ఖదీర్, మాజీ జడ్పీటీసీ పాయం ప్రమీల, జడ్పీటీసీ బట్టా విజయ్‌గాందీ, సొసైటీ అద్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు కైపు రోషిరెడ్డి, ఈ సాల ఏడుకొండలు, మండల నాయకులు గాండ్ల సురేష్, రంజిత్, హరగోపాల్, ఆదిరెడ్డి, రాంబా బు, ఆదిలక్ష్మి, బర్లసురేష్, భద్రమ్మ, జ్యోతి, శ్రీనివాస్, అనిల్, తిరుమలేష్ పాల్గొన్నారు.