tummula nageswara rao
-
అభివృద్ధిని యజ్ఞంలా భావించా..
సాక్షి, నేలకొండపల్లి: ఒక యజ్ఞంలా భావించి పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లి, మంగాపురంతండాలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రైతు తన కాళ్లమీద తాను నిలబడే వరకు పెట్టుబడి, రైతు బీమా కొనసాగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సొమ్ము రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌లో కలిపేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తే.. కేసీఆర్ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్ అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. దేశంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా చూసిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. మీరిచ్చిన అవకాశంతో రెండేళ్లలో వేల కోట్ల రూపాయలతో పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మిగిలిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పేద ప్రజలు బాగుపడే వరకు అభివృద్ధి పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా.. సదాశివపురంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాల్లో పాలేరు డివిజన్ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, ఎంపీపీ కవితారాణి, జెడ్పీటీసీ సభ్యురాలు అనిత, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ సైదులు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెన్నపూసల సీతారాములు, కోటి సైదారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైసా శంకర్, నాయకులు వున్నం బ్రహ్మయ్య, నెల్లూరి భద్రయ్య, నల్లాని మల్లికార్జున్‌రావు, కొడాలి గోవిందరావు, నంబూరి సత్యనారాయణ, అనగాని నరసింహారావు, మల్లెల శ్రీనివాసరావు, కడియాల శ్రీనివాసరావు, కాసాని నాగేశ్వరరావు, గండు సతీష్, నేరళ్ల నరసింహారావు, కడియాల నరేష్, భూక్యా సుధాకర్, చిర్రా ముక్కంటి పాల్గొన్నారు. -
అధికారం కోసమే కాంగ్రెస్ మాయమాటలు
ఖమ్మం అర్బన్: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయలేని పనులు చేస్తామంటూ, అనేక పార్టీలతో కూడబల్కోని మాయ మాటలు చెప్తున్నారని టీఆర్ఎస్ పాలేరు నియోజకవర్గ అభ్యర్థి ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. దసరా పర్వదినాన్ని పురష్కరించుకుని నగరంలోని 1వ డివిజన్ కైకొండాయిగూడెంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేసి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు రాబోయే ఐదు ఏళ్ల ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మేనిఫెస్టో రూపకల్పన చేశారన్నారు. ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉన్న పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సాగు, తాగు నీటి సౌకర్యాలు కల్పించి అభివృద్ధి దిశగా ఎనలేని కృషి చేశామన్నారు. విజయ దశమి రోజు ప్రచారం ప్రారంభిస్తే విజయం చేకూరుతుందని నియోజకవర్గానికి తూర్పున ఉన్న కైకొండాయిగూడెం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు. గత ఉప ఎన్నికల్లో కైకొండాయిగూడెం నుంచే ప్రచారం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో అభివృద్ధి కోసం గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాలేరు అభివృద్ధి కోసం తన వంతు కృషి చేసినట్లు తెలిపారు. కేసీఆర్ భక్తరామదాసు ప్రాజెక్టు పూర్తి చేసి కరువు ప్రాంతంగా ఉన్న తిరుమలాయపాలెం మండలంలో నీరు అందించి పచ్చని పల్లె వాతావరణ తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతులకు పంటపెట్టుబడిని గత ఏడాది అందించినట్లు ఎన్నికల తర్వాత నుంచి ఏడాదికి ఎకరానికి రూ 10 వేలు అందించబోతున్నట్లు తెలిపారు. దేశంలోనే ఎక్కడాలేని విధంగా రైతు బీమాను అమలు చేసినట్లు పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 1వ డివిజన్ కైకొండాయిగూడెంలో రూ.7 కోట్లతో నిధులతో ప్రతి డొంకను రహదారిగా మార్చినట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గత ఉప ఎన్నికల్లో 46 వేల మెజార్టీతో తుమ్మలను గెలిపించారని పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేసిన తుమ్మలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ మాట్లాడుతూ.. 60 సంవత్సరాల్లో జరగని అభివృద్ధి 4 ఏళ్లలో చేసినట్లు తెలిపారు. ఇంకా ఈ ప్రచార సభలో జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, ఐడీసీ చైర్మన్ బేగ్, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ డాక్టర్ పాపాలాల్, రైతు సమన్యయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ ధరావత్ రామ్మూర్తినాయక్, జిల్లా సభ్యుడు మందడపు సుధాకర్, కమర్తపు మురళీ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బెల్లం వేణు, స్థానిక నాయకుల గుర్రం వెంకటరామయ్య, తేజావత్ పంతులు సంపెట ఉపేందర్, గద్దల నాగేశ్వరరావు, తాళ్లూరి శ్రీను, తేజావత్ సంఘ, శ్రీను, ఆజ్మీరా ఆశోక్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా నృత్య ప్రదర్శనలు, కోలాట ప్రదర్శనలు, బతుకమ్మ ఊరేగింపులతో తుమ్మల నాగేశ్వరరావుకు స్వాగతం పలికారు. -
అసమ్మతి సెగలు
సాక్షి, కొత్తగూడెం(ఖమ్మం): టీఆర్ఎస్లో అభ్యర్థుల ప్రకటన తర్వాత నెమ్మదిగా బయటపడిన అసమ్మతి ప్రస్తుతం తారాస్థాయికి చేరుకుంది. సిట్టింగులకే టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వడంతో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఆశావహులు భగ్గుమన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేని సమయంలో పార్టీ నుంచి పోటీచేసిన వారు సైతం ఈసారి టికెట్లు ఆశించారు. అయితే సిట్టింగులకే టికెట్లు కేటాయించడంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ప్రకటించిన అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పటికీ అసమ్మతి సెగలు చల్లారలేదు. గత ఆదివారం కొత్తగూడెంలో జరిగిన సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అసమ్మతులు రెండు రోజుల్లో సర్దుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినా అసంతృప్తి ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఇల్లెందు, పినపాక నియోజకవర్గాల్లో మరింతగా రగులుకుంటోంది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య సోమవారం టీఆర్ఎస్కు రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తుమ్మల అనుచరుడిగా ఉన్న అబ్బయ్య రాజీనామా చేసిన తెల్లవారే (మంగళవారం) ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలంలో 30 మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు. వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు. వీరిలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు దళపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. గత ఎన్నికల్లో కోరం కనకయ్యకు శ్రీనివాస్ ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇల్లెందు నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాగా గతంలో సీపీఐ తరపున బూర్గంపాడు ఎమ్మెల్యేగా, ఇల్లెందు నుంచి ఒకసారి సీపీఐ తరపున, మరోసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వ్యవహరించిన ఊకె అబ్బయ్య టికెట్ అంశం ప్రస్తావనకు రాకుండా బేషరతుగా కాంగ్రెస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ∙పినపాక నియోజకవర్గంలో సైతం రాజకీయ సమీకరణలు మారే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడి నుంచి బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ వట్టం రాంబాబు, బూర్గంపాడు జెడ్పీటీసీ బుట్టా విజయ్‌గాంధీ టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుపై నియోజకవర్గ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఉందని, అభ్యర్థిని మార్చాలని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. టికెట్ల ప్రకటన తరువాత కూడా వారు అదే పంథాలో ఉన్నారు. అభ్యర్థిని మార్చి వేరెవరికి టికెట్ ఇచ్చినా సహకరిస్తామని, పాయంనే బరిలో ఉంచితే ఓడిస్తామని చెబుతున్నారు. వట్టం రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అసమ్మతి కార్యకర్తలు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవసరమైతే వట్టం రాంబాబును రెబల్ అభ్యర్థిగా బరిలో దించేందుకు సిద్ధమని ప్రకటించారు. దీంతో పినపాక నియోజకవర్గంలోనూ రాజకీయ పరిణామాలు మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరోవైపు టీఆర్ఎస్లో మొదటి నుంచి పనిచేస్తున్న ఉద్యమకారులు జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీతో పాటు అభ్యర్థులపై గుర్రుగా ఉన్నారు. ∙ఇక టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్ కూటమిలో పేర్లు ప్రకటించిన తర్వాత మరిన్ని రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ల రేసులో పోటీ తీవ్రంగా ఉంది. కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ మధ్య పోటీ తీవ్రంగా ఉండగా, సీపీఐ ఈ సీటును గట్టి గా కోరుతోంది. అశ్వారావుపేట నుంచి కారం శ్రీ రాములు, కోలా లక్ష్మీనారాయణ, ధన్‌జూనాయ క్, సున్నం నాగమణి, బాణోత్ పద్మావతి పోటీ పడుతున్నారు. ఇల్లెందు నుంచి చీమల వెంకటేశ్వ ర్లు, భూక్యా దళ్‌సింగ్‌నాయక్, బాణోత్ హరిప్రి య, డాక్టర్ రామచందర్‌నాయక్ పోటీలో ఉన్నా రు. అయితే కొత్తగూడెం, ఇల్లెందు నుంచి టికెట్లు రానివారు రెబల్‌గా అయినా సరే పోటీలో ఉండేందుకు రంగం సిద్ధం చేసుకుంటుండడంతో రాజకీయ వాతావరణం మరింతగా వేడెక్కుతోంది. -
దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి: తుమ్మల
మధిర (ఖమ్మం): రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు రావూరి శివనాగకుమారితో పాటు సీపీఎం, టీడీపీ పార్టీలకు చెందిన 350 కుటుంబాల వారు శనివారం టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మాటూరుపేటలో శనివారం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే మాటూరు, మాటూరుపేట గ్రామాలకు రహదారులు ఏర్పాటు చేశామని, తిరిగి అధికారంలోకి రాగానే అన్ని లింకు రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరుచేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్లోకి చేరుతున్నారని తెలిపారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లింగాల కమల్‌రాజ్ గతంలో రెండుసార్లు పోటీచేసి ఓడిపోయినప్పటికీ నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. కమల్‌రాజ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న మాటూరుపేట లిఫ్ట్ ఇరిగేషన్‌ను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లోగా మంజూరు చేయడంతో పాటు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. పార్టీలో చేరినవారిలో మాజీ సర్పంచ్ తోట కృష్ణయ్య, రావూరి రామారావు, మార్తమ్మ, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ బుడాన్‌బేగ్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బొమ్మెర రామ్మూర్తి, మధిర నియోజకవర్గ టీఆర్స్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్, దొండపాటి వెంకటేశ్వరరావు, దేవిశెట్టి రంగారావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చిత్తారు నాగేశ్వరరావు, అరిగె శ్రీనివాసరావు, బోగ్యం ఇందిర తదితరులు పాల్గొన్నారు. ఖిల్లాపై మళ్లీ టీఆర్ఎస్ జెండా ఎగరాలి ఖమ్మంమయూరిసెంటర్: టీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ ప్రచార వాహనాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ డివిజన్లలో ప్రచారం చేసేందుకు ఏర్పాటు చేసిన వాహనాలు, అభ్యర్థి తిరిగే ప్రచార రథాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఖమ్మం ఖిల్లాపై మళ్లీ టీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తంచేశారు. జిల్లాలో అన్ని స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని, ఖమ్మంతోనే గెలుపుబాట మొదలు కానున్నదని, ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ప్రజలు చెబుతారని పేర్కొన్నారు. అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ తనకు మళ్లీ అవకాశం కల్పించాలని ఖమ్మం ప్రజలను కోరారు. మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత ఎన్నికల్లో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిలుపుకున్నానని, దానిని కొనసాగించాలంటే మళ్లీ టీఆర్ఎస్కు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీఎస్ఐడీసీ చైర్మన్ బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, కార్పొరేటర్ కమర్తపు మురళి, పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ పొత్తు ప్రజలతోనే..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్కు ప్రజలతోనే పొత్తు తప్ప మరే పార్టీతోనూ పొత్తు లేదని, ప్రభుత్వం చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అధ్యక్షత వహించగా.. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాకు ప్రత్యేకత ఉందని, జిల్లాలో పార్టీ అంత బలంగా లేదన్న భావన అనేక మందిలో నెలకొని ఉందని, వచ్చే ఎన్నికల్లో పది ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్‌కు అప్పగించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తా ఏమిటో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో కార్యకర్తలు కలిసికట్టుగా ప్రత్యర్థి పార్టీపై రాజకీయ యుద్ధానికి సిద్ధం కావాలని.. పార్టీ పరంగా, అంతర్గతంగా ఏ సమస్యలున్నా కుటుంబ సభ్యులుగా మాట్లాడుకుని పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. టీఆర్ఎస్కు జిల్లాలో అనుకూల పవనాలున్నాయని, ఈ అంశం గత ఖమ్మం నగర కార్పొరేషన్ ఎన్నికల్లో రుజువైందని, సీఎం కేసీఆర్ ఒక్కసారి ఖమ్మం వచ్చి చేసిన అభివృద్ధి వివరిస్తే కారు గుర్తుపై 33 మంది కార్పొరేటర్లు గెలిచారని, జిల్లాలో టీఆర్ఎస్ ప్రభంజనానికి ఇదొక మచ్చుతునక అని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే పువ్వాడ అజయ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. వివిధ రాజకీయ పక్షాల నుంచి టీఆర్ఎస్లో చేరిన ప్రతి ఒక్కరూ అజయ్ విజయానికి కృషి చేస్తే ప్రత్యర్థి పార్టీకి ఓట్లే ఉండవని అన్నారు. త్వరలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించనున్నారని, హుస్నాబాద్ తరహాలో జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టాలని మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టీఆర్ఎస్కు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని కార్యకర్తలు ఒడిసిపట్టుకుని ఓట్ల రూపంలో మార్చుకోవాలని, పార్టీ గెలిస్తే కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి తుమ్మల అభివృద్ధి పనులకు నిర్వచనంలా ఉన్నారని, జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఓటరుకు వివరించాలని, ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్‌కుమార్ విజయం ఎప్పుడో ఖాయమైందని, అయితే కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు యుద్ధంలో పాల్గొనే సైనికుల్లా అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే ఈ విజయం తీరానికి చేరుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్ ప్రజల తలలో నాలుకలా మారారని, వారంలో ఐదు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రజల మనిషిగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని, పువ్వాడ అజయ్‌కు ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం దీనికి తోడు కావడంతో ఇక్కడ టీఆర్ఎస్ విజయం ఖాయమన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నుంచి ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండటంతో ఇక టీఆర్ఎస్ మెజార్టీ అదే స్థాయిలో పెరిగి తీరాలన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసే అవకాశం శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదటి సారే రావడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేశానన్న గుర్తింపు లభించడం తనకు ఎంతో సంతృప్తి ఇస్తోందన్నారు. గత ఎన్నికల్లో తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మాత్రమే అండగా ఉంటే.. ఈ ఎన్నికల్లో తన విజయానికి మరో నాగేశ్వరరావు తుమ్మల రూపంలో తనకు లభించడం ఆనందంగా ఉందని, పార్టీ కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండి.. పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సూచించినట్లుగా కార్యకర్తలతో అరమరికలు లేకుండా మాట్లాడుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తానన్నారు. సభలో కార్పొరేషన్ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, బేగ్, మేయర్ పాపాలాల్, ఆర్జేసీ కృష్ణ, పార్టీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, టీఆర్ఎస్ నగర కన్వీనర్ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
ఇక చకచకా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: సాగునీటి పరంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతుల పరంగా ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ప్రాజెక్టు నిర్మాణాన్ని శరవేగం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అటవీ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాలనా పరమైన ప్రక్రియను పూర్తిచేయడంతోపాటు కేంద్ర అటవీశాఖకు అనుమతులకు సంబంధించి రూ.276 కోట్లను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేసింది. ఆ ప్రాంతాల్లో పనులను జరుపుకోవడానికి కేంద్ర అటవీశాఖ సమ్మతించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే జరుగుతున్న సీతారామ ప్రాజెక్ట్ పనులకుతోడు అటవీభూముల్లో నిర్మించాల్సిన ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపయోగపడనుంది. కేంద్రప్రభుత్వం మంజూరు చేయాల్సిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి అనుమతులు ఒక్కొక్కటిగా మంజూరు కావడంతో ఇక క్షేత్రస్థాయిలో వేగం పుంజుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. మంత్రి తుమ్మల చొరవతో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సైతం ఈ అనుమతులకు సంబంధించి పలుసార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చించారు. ప్రాజెక్టు నిర్మాణ ఆవశ్యకతను వివరించడం, దీంతో దశలవారీగా లభించేలా చూడటంతోపాటు వాటికి సంబంధించిన పాలనాపరమైన ప్రక్రియ ఊపందుకునేలా మంత్రి తుమ్మల దృష్టి సారించడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అటవీ, పర్యావరణ, వన్యప్రాణి అనుమతులు ఇక ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయనున్నాయి. జనవరి 19న ప్రక్రియ.. ఈ సంవత్సరం జనవరి 19వ తేదీన ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అటవీ భూములకు కేంద్ర అటవీశాఖ ప్రక్రియ షురూ అయింది. ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, సత్తుపల్లి అటవీ డివిజన్ల పరిధిలో సేకరించిన అటవీ భూములకు మొత్తాన్ని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖకు చెల్లించింది. మొత్తం 1531.0548 హెక్టార్లకు అటవీశాఖ పనులు నిర్వహించుకోవడానికి అనుమతిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర నీటివనరుల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఐడీసీఎల్) నిధుల నుంచి చెల్లించింది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం అటవీ అనుమతులను మంజూరు చేసే సమయంలో అటవీ భూములను ప్రాజెక్టుకు కేటాయించేందుకు గాను నష్ట పరిహారంగా అనుమతుల మంజూరుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.276 కోట్లను చెల్లించాలని కేంద్ర అటవీశాఖ సూచించింది. ప్రభుత్వ పరంగా ఈ చెల్లింపులు కొంత ఆలస్యం అవుతుండటంతో మంత్రి తుమ్మల దీనిపై ప్రత్యేక దృష్టి సారించి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి సీతారామ ప్రాజెక్టు నిర్మాణం గడువులోపు పూర్తిచేయాలంటే అటవీ శాఖ అనుమతులకు సంబంధించిన నిధులను వారి ఖాతాలో జమ చేసి అనుమతులను సంపూర్ణం చేసుకోవాలని వివరించారు. అటవీశాఖకు చెల్లించాల్సిన నగదును ప్రభుత్వమే సోమవారం అటవీశాఖకు జమ చేసింది. దీంతో సీతారామ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు అన్ని అనుమతులు లభించినట్లయింది. ఒక్కొక్క అనుమతి ఇలా.. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చూపిన చొరవ ఫలితంగా సీతారామ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన అటవీ అనుమతులకు రీజినల్ ఎంపవర్ కమిటీ ఈ ఏడాది జనవరి 19న గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. చెన్నైలో పర్యావరణ, అటవీ అనుమతులపై రీజినల్ ఎంపవర్ కమిటీ సమావేశమైంది. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వల్ల 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని, ఈ బృహత్తర ప్రాజెక్టును పర్యావరణ, అటవీ అనుమతులు ఇవ్వాల్సిందిగా సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ పూర్తి వివరాలతో కమిటీ ఎదుట పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్న నిర్మాణాలు, కాల్వల తవ్వకం, పంప్‌హౌజ్‌ల నిర్మాణం వంటి వివరాలను చీఫ్ ఇంజనీర్ పూర్తిస్థాయిలో వివరించడంతోపాటు ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొదటిదశగా 1,531 హెక్టార్ల అటవీ భూమి అవసరమని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం, సత్తుపల్లి అటవీ భూముల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణానికి అటవీభూములు అవసరమని పేర్కొన్నారు. ఈ వివరాలతో పూర్తిస్థాయి సంతృప్తి చెందిన రీజనల్ ఎంపవర్ కమిటీ ప్రాజెక్టు నిర్మాణానికి అటవీ అనుమతులు ఇవ్వడానికి తమకు ఎటువంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసి.. అటవీ అనుమతులు ఇవ్వాలని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్(ఎంవోఈఎఫ్) వారికి సిఫారసు చేసింది. దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద ప్రాజెక్టు నిర్మాణం.. పినపాక నియోజవర్గం..అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం గ్రామంలో గల దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం రూ.8వేల కోట్లు మంజూరు చేసింది. 115 కిలోమీటర్ల పరిధిలో పనులు నిర్వహించడానికి 8 ప్యాకేజీలుగా విభజించి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను పూర్తిచేసింది. ఇందులో ఐదు ప్యాకేజీల్లో పనులు జరుగుతున్నాయి. అశ్వాపురం మండలం బీజీ.కొత్తూరు, ములకలపల్లి మండలంలో పూసుగూడెం, కమలాపురం మండలాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పంప్‌హౌజ్‌ల నిర్మాణం కొనసాగుతోంది. మరో రెండు ప్యాకేజీల్లో కాల్వల తవ్వకం కొనసాగుతోంది. కేసీఆర్‌కు కృతజ్ఞతలు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల కళ్లల్లో ఆనందం చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ అనుమతులకు సంబంధించి చేసిన కృషి అభినందనీయం. ఇందుకు అన్నీ తానై వ్యవహరించి కోట్లాది రూపాయలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెల్లించి, సంపూర్ణం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన రైతుల పక్షపాతి అని ఈ అంశంతో మరోసారి రుజువైంది. అనుకున్న సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చేసి తీరుతాం. కెనాల్, టన్నెల్, విద్యుత్ లైన్ల నిర్మాణాన్ని ఇక తక్షణం ప్రారంభిస్తాం. – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
కారులో కయ్యం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు కక్కుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసిన విషయంలో రగులుకున్న అసమ్మతిని చల్లార్చేందుకు పార్టీ నాయకులు ఒకవైపు రంగంలోకి దిగుతున్నా.. మరోవైపు అసమ్మతి నేతలు మెట్టు దిగకుండా తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తాము చేసిన సేవలకు గుర్తింపుగా టికెట్ ఆశించగా.. దీనిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో నాయకులు అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు. సత్తుపల్లి, వైరా, పినపాక, ఇల్లెందు నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతుండటంతో పార్టీ విజయం కోసం అధినేత ప్రకటించిన అభ్యర్థుల గెలుపునకు జిల్లా నేతలు ఏకతాటిపైకి వచ్చి పనిచేసేలా వ్యూహాన్ని రూపొందిస్తారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపు బాధ్యతను స్వీకరించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పలు నియోజకవర్గాల నేతలు ఆశలు పెట్టుకున్నారు. అసమ్మతి నేతలకు నచ్చజెప్పి.. దారిలోకి తెచ్చే బాధ్యతను తుమ్మలపై పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. పాలేరు అభ్యర్థిగా పార్టీ అధినేత కేసీఆర్ తుమ్మలను ఖరారు చేశాక ఈనెల 14న తొలిసారి పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పర్యటించిన తుమ్మల మళ్లీ వారంరోజుల విరామం తర్వాత జిల్లాలో పర్యటించి.. ఈసారి అసమ్మతి సెగలు కక్కుతున్న నియోజక వర్గాల్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పరోక్ష హెచ్చరికలు.. సదరు అభ్యర్థులకు మానసిక స్థైర్యం కల్పించడంతోపాటు అసమ్మతికి కాయకల్ప చికిత్స చేయాలని భావిస్తున్న ఆయన శుక్రవారం సత్తుపల్లిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన తీరు.. చేసిన పరోక్ష హెచ్చరికలు రాజకీయ కార్యకలాపాలను వేగవంతం చేయడంలో భాగమేనని పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. కేసీఆర్ ఎంపిక చేసిన సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించుకోలేకపోతే తాను వచ్చే మంత్రివర్గంలో ఉండటమే అనవసరమని వ్యాఖ్యానించడంతో పార్టీ కార్యకర్తలు.. నేతల్లోనూ ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగమేనని, తనకోసం పని చేయాలని నియోజకవర్గంలో అసమ్మతి నేతలకు సైతం పరోక్షంగా చెప్పినట్లయిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సత్తుపల్లిలో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించిన మట్టా దయానంద్ విజయ్‌కుమార్ తనకు టికెట్ రాకపోవడంతో భవిష్యత్ కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలను కలవడం, సభలు, సమావేశాలు, మోటారు సైకిల్ ర్యాలీలు చేపట్టడం ద్వారా తనకు ప్రజలతో ఉన్న సంబంధాలు, కార్యకర్తల అండ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే మంత్రి తుమ్మలకు రాజకీయ భవిష్యత్‌ను ప్రసాదించిన సత్తుపల్లి నియోజకవర్గంలో అధినేత బలపరిచిన అభ్యర్థి పిడమర్తి రవిని గెలిపించాలన్న పట్టుదలతో తుమ్మల ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం అక్కడ పార్టీలోని రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతోంది. మధిర, వైరాలో.. అదే రీతిన మధిర నియోజకవర్గంలోనూ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పర్యటించిన మంత్రి తుమ్మల.. మధిర అభ్యర్థిని గెలిపించుకోవడం చారిత్రక అవసరమని, ఇక్కడ మార్పు కోరుతున్న ప్రజలు టీఆర్ఎస్ వెంట ఉన్నారని వ్యాఖ్యానించడం అక్కడి కార్యకర్తల్లోనూ నూతనోత్తేజం కలగడానికి ఉపయోగపడినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక వైరా నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌పై అక్కడి నేతలు కొందరు రగిలించిన అసమ్మతి అగ్గి ఇప్పటికిప్పుడు సమసిపోయేలా కనిపించడం లేదు. రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన తుమ్మల తన నియోజకవర్గంతోపాటు మరో రెండు నియోజకవర్గాల్లో రాజకీయ పర్యటన చేసిన తుమ్మల.. రానున్న రోజుల్లో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ కార్యకలాపాలపై ఇదే తరహాలో దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రి గురు, శుక్రవారాల్లో చేసిన రాజకీయ పర్యటనలో రాజకీయ విమర్శలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం.. పార్టీ సంస్థాగత వ్యవహారాలపైనే దృష్టి సారించారన్న భావన క్షేత్రస్థాయిలో కలిగించడానికేనని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పరిస్థితుల ఆకళింపునకు ప్రయత్నం.. ఇక ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట, వైరా, ఖమ్మం, సత్తుపల్లి, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో దశలవారీగా పర్యటనలు చేయడం ద్వారా పార్టీ పరిస్థితులను ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్లో నెలకొన్న అంతర్గత విభేదా లు, కొన్నిచోట్ల వర్గ పోరును తుదముట్టించాలని, ఇందుకోసం తమ ప్రాంతాల్లో పర్యటించాలని వస్తున్న విజ్ఞప్తులపై తుమ్మల ఆచితూచి స్పందిస్తూ.. నేతలంతా ఐక్యంగా పనిచేయాలని భరోసా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు ఆయా నియో జకవర్గాల అభ్యర్థులతో ఎప్పటికప్పుడు సమాలోచనలు జరపడం ద్వారా రాజకీయ పరిస్థితులను తెలుసుకోవడంతోపాటు అందుకు అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకోవాలని పార్టీ యోచిస్తోంది. ఇక పార్టీ అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో కొంత అసంతృప్తి, అసమ్మతి వంటి పరిస్థితులున్నా.. ప్రచార పర్వాన్ని ప్రారంభించారు. ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆత్మీయ సమావేశాల పేరుతో నగరంలోని ప్రతి డివిజన్లో ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను కలిసి ప్రచార పర్వాన్ని వేడెక్కిస్తుండగా.. సత్తుపల్లిలో పిడమర్తి రవి, మధిరలో లింగాల కమల్‌రాజ్, వైరాలో బాణోతు మదన్‌లాల్, పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు క్షేత్రస్థాయి పర్యటనలకు శ్రీకారం చుట్టడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సత్తుపల్లి, పినపాక నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశావహులు మట్టా దయానంద్, వట్టం రాంబాబు నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో తమ రాజకీయ భవిష్యత్‌ను పరీక్షించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైరా నియోజకవర్గంలో అసమ్మతి కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ తాజా మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న బొర్రా రాజశేఖర్‌తోపాటు పలువురు నేతలు మండలాలవారీగా సమావేశాలు నిర్వహిస్తుండటంతో అసమ్మతి కార్యకలాపాలు వేడెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇల్లెందు నియోజకవర్గంలోనూ టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యకు సైతం అసమ్మతి సెగలు తప్పడం లేదు. అక్కడ టికెట్ ఆశించిన పార్టీ నాయకుడు దేవీలాల్ ఇప్పటికే పలు ప్రాంతాల్లో పర్యటించి కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. -
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి
కూసుమంచి (ఖమ్మం): పాలేరు నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశానని, గతంలో మాదిరిగానే ఇంకా ఎంతో చేస్తానని, రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని టీఆర్ఎస్ పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థిత్వం ప్రకటన తర్వాత శుక్రవారం ఆయన తొలిసారిగా జిల్లాకు రాగా పార్టీ శ్రేణులు సరిహద్దు నాయకన్‌గూడెం వద్ద ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా కూసుమంచిలో నిర్వహించిన బహిరంగ సభలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి, అభివృద్ధి చేస్తానని విశ్వసించి గత ఎన్నికల్లో పాలేరు స్థానం నుంచి ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. తాను ఇక్కడి ఎమ్మెల్యేగా రెండు సంవత్సరాల మూడు నెలల్లో ఊహించని విధంగా అభివృద్ధి చేసి చూపానని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లను తుడిచారని, ఆయన ఆశీస్సులతోనే పాలేరు జలాలతో ఇక్కడి ప్రజల కాళ్లు కడిగానని అన్నారు. ప్రజలు కోరినా, కోరకపోయినా అనేక పనులు చేసిచూపానన్నారు. రాష్ట్రంలో అందరికీ ప్రభుత్వం సంక్షేమ ఫలాలను అందించిందని 100 సీట్లతో తిరిగి అధికారంలోకి రాబోతున్నామని అన్నారు. అ అన్ని స్థానాలూ మావే..: ఎంపీ పొంగులేటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు అనగానే ప్రతిపక్ష పార్టీల నాయకులు బట్టలు సర్దుకుని నియోజకవర్గాలకు బయలుదేరారని ఎద్దేవా చేశారు. కానీ టీఆర్ఎస్ నాయకులు నిత్యం ప్రజలతో ఉంటూ కష్టసుఖాలను పట్టించుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగిన దమ్ము, సత్తా సీఎం కేసీఆర్‌కే ఉందని అన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలకు తెలుసునని, మళ్లీ ఆయనకే పట్టం కడతారని అన్నారు. పాలేరు సీటు ఏకగ్రీవం చేయాలి..: కొండబాల పాలేరును తుమ్మల నాగేశ్వరరావు అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని ఈ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీలు తమ అభ్యర్థులను నిలపకుండా ఏకగ్రీవం చేయాలని విపక్షాలకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఎంతోకాలంగా వెనుకబడిన పాలేరులో తుమ్మల నాగేశ్వరరావు సిరులు పండించేలా చేశారని, ఇక్కడ అభివృద్ధిని అడ్డుకోవద్దని కోరారు. ప్రజల బాగుకోరే వారు ఈ సీటును ఏకగ్రీవం చేయాలని అన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఐడీసీ చైర్మన్ ఎంబీ.బేగ్ అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సత్తుపల్లి, మధిర అభ్యర్థులు పిడమర్తి రవి, లింగాల కమల్‌రాజ్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, మేయర్ పాపాలాల్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీలు రామసహాయం వెంకటరెడ్డి, కొప్పుల అశోక్, నందిగాం కవితారాణి, జెడ్పీటీసీ సభ్యులు వడ్తి రాంచంద్రునాయక్, భారతి, ఏఎంసీ చైర్మన్ శాఖమూరి రమేష్, టీఆర్ఎస్ నాయకులు తాతా మధు, సాధు రమేష్‌రెడ్డి, రామసహాయం నరేష్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీనాయకులు పాల్గొన్నారు. -
కారు దిగిపోతారా?
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇటీవలే అధికార పార్టీ తరఫున శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన తరుణంలో..కొన్ని చోట్ల వీరి అభ్యర్థిత్వం పట్ల అసమ్మతి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సత్తుపల్లి, వైరా, మధిరకు చెందిన నేతలు పార్టీ టికెట్లో అన్యాయం జరిగిందంటూ అసమ్మతి గళాలను వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. తమ నియోజకవర్గ అభ్యర్థిని మార్చకపోతే తాడోపేడో తేల్చుకుంటామంటూ వైరా నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీలోని అసమ్మతి నేతలు మండల స్థాయిలో సమావేశం నిర్వహిస్తుండడంతో పార్టీలో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది. వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్ ఆశించిన ఆశావహులతో పాటు అభ్యర్థులుగా ఖరారు అయిన వారిపై గల వ్యతిరేకత అసమ్మతిసెగలు రాజుకోవడానికి దారితీస్తోంది. ఖమ్మం జిల్లాలోని ఐదు శాసనసభా స్థానాలకు ఈ నెల 6వ తేదీన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సహా ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, వైరా శాసనసభ్యులు మదన్లాల్లతో పాటు సత్తుపల్లికి పిడమర్తి రవి, మధిరకు లింగాల కమల్‌రాజ్‌లను కేసీఆర్ ప్రకటించారు. సుదీర్ఘకాలంగా పార్టీలో పని చేస్తూ, పార్టీ జెండా మోసిన తమకు సీటు ఇవ్వకపోవడం అన్యాయమని కార్యకర్తల మనోభిప్రాయాలకు అనుగుణంగా తాము నడుచుకుంటామని..టికెట్ ఆశించి భంగపడిన పలవురు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తూ, కార్యకర్తలను సమీకరిస్తూ తమకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థిత్వాలు ఖరారు అయినా.. పార్టీ మరోసారి పునరాలోచన చేసే అవకాశం ఉందని భావిస్తున్న నేతలు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలంటూ అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మధిర: బొమ్మెర రామ్మూర్తి ఇక మధిర నియోజకవర్గంలోనూ అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన బొమ్మెర రామ్మూర్తి మరోసారి అభ్యర్థిత్వాన్ని ఆశించారు. అయితే ఆయనకు కాకుండా టీఆర్ఎస్ నేత లింగాల కమల్‌రాజ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ సీటు కేటాయించడంతో బొమ్మెర రామ్మూర్తి వర్గీయులు ఆవేదనకు గురయ్యారు. తమకు పార్టీ ఏ విధంగా న్యాయం చేస్తుంది, తమ భవిష్యత్‌పై ఏరకమైన భరోసా ఇస్తుందో తేల్చుకునేందుకు రామ్మూర్తి సమాయత్తమవుతున్నారు. పార్టీ నుంచి వెలువడే సంకేతాల ఆధారంగా కార్యాచరణ రూపొందించుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఇక ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోని టీఆర్ఎస్ కార్యకర్తల్లో అంతర్గతంగా ఉన్న అసంతృప్తిపై పార్టీ నేతలు దృష్టి సారించారు. వారితో మాట్లాడేందుకు, అలాగే అవసరమైతే వారి ఇళ్లకు వెళ్లి బుజ్జగించేందుకు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమంలో పని చేసి పార్టీకి ఆది నుంచి అండగా ఉంటూ వస్తున్న నేతలను అక్కున చేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. సత్తుపల్లి: మట్టా దయానంద్ ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని ఆశించిన పార్టీ నేత డాక్టర్ మట్టా దయానంద్ టికెట్ రాకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర నిరాశ, నిస్పృ హలకు గురయ్యారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించడం కన్నా నియోజకవర్గంలో జరుగుతున్న పరిస్థితులను పార్టీకి వివరించడం ద్వారా ఒత్తిడి పెంచబోతున్నారు. వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ తనకు టికెట్ రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునే పనిలోపడ్డారు. ఈ నెల 11వ తేదీన సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి కార్యకర్తల అభిప్రాయం అనుగుణంగా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. వైరా: టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి ప్రకంపనలు పెరుగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్‌కు అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో ఆయనను వ్యతిరేకిస్తున్న బలమైన వర్గం నియోజకవర్గ స్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలంటూ పట్టుబడుతోంది. నియోజకవర్గంలో టీఆర్ఎస్కు అనుకూల వాతావరణం ఉందని, అందరినీ కలుపుకుపోయే అభ్యర్థికి టికెట్ ఇస్తే గెలుపు ఖాయం..అంటూ మదన్‌లాల్‌పై కార్యకర్తల అభిప్రాయాలు క్రోడీకరించి అధిష్టానానికి తెలియజేసేందుకు ఆ వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు శనివారం నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై చర్చించింది. ప్రతి మండలంలో సమావేశం నిర్వహించేందుకు అసమ్మతివర్గం సమాయత్తమవుతోంది. అధిష్టానం ఆలోచించాలి.. వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారుపై నియోజకవర్గంలో అసమ్మతి భగ్గుమంటుంది. పార్టీ నేతలందరినీ కలుపుకపోయే వ్యక్తికి టికెట్ లభిస్తే ఇక్కడ విజయం సాధించడం ఖాయం. పార్టీ విధానాలకన్నా వ్యక్తిగత ఎజెండాకు ప్రాధాన్యమిచ్చే వారిని భుజాన మోసేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా లేరని, పార్టీ పెద్దలకు, అధిష్టానానికి చెప్పేందుకు కార్యకర్తలు సన్నద్ధమవుతున్నారు. ప్రతి మండలంలో సమావేశం నిర్వహించడం ద్వారా అక్కడ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని వచ్చే వారంలో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. నియోజకవర్గంలోని ఇద్దరు జెడ్పీటీసీలు, పలువురు ప్రజాప్రతినిధులు, అనేక మంది టీఆర్ఎస్ అభ్యర్థి మదన్‌లాల్ అభ్యర్థిత్వాన్ని పునర్‌పరిశీలించాలని సీఎం కేసీఆర్‌ను కార్యకర్తలతో సహా కలిసేందుకు సిద్ధమవుతున్నాం. కార్యకర్తలకు పార్టీ భరోసా కల్పించి, ప్రతి కార్యకర్త పార్టీ విజయానికి కృషి చేసే విధంగా అభ్యర్థిని ఖరారు చేయాలని, నియోజకవర్గంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు అనేక మంది కోరుకుంటున్నారు. ఈ నెల 18, 19వ తేదీల్లో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. అధిష్టానానికి ఇక్కడ పరిస్థితులు కులంకుశంగా చెప్పేందుకు సిద్ధమవుతున్నాం. –బొర్రా రాజశేఖర్, వైరా నియోజకవర్గ టీఆర్ఎస్ అసమ్మతి నేత అధినేతను కలిశాకే కార్యాచరణ.. టీఆర్ఎస్ పార్టీలో తనకు అండ..దండగా ఉన్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను కలిశాకే కార్యాచరణను ప్రకటిస్తా. నియోజకవర్గంలో నాలుగున్నర సంవత్సరాల పాటు పార్టీ జెండాను భుజాన మోసిన తనకు ఏ రకంగా న్యాయం చేయాలో పార్టీ పరిశీలిస్తుందని విశ్వసిస్తున్నా. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తనను కలవాల్సిందిగా కబురు చేశారు. నియోజకవర్గ పరిస్థితి, పరిణామాలు, తన రాజకీయ భవిష్యత్‌పై ఆయనతో చర్చించి, సీఎం కేసీఆర్‌ను కలిసి నిర్ణయం తీసుకుంటా. –బొమ్మెర రామ్మూర్తి, మధిర అసమ్మతి నేత -
అభివృద్ధే నమ్మకం
ఖమ్మం వైరారోడ్: టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలకు తమపై నమ్మకాన్ని కల్పిస్తాయని రోడ్లు భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో మధిర నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి తుమ్మల వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తమ పార్టీవైపు ఆకర్షితులవుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం కష్టపడే వారి వెంటే ప్రజలు ఉంటారని గుర్తు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే లేకపోయినా మధిర నియోజకవర్గం అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించామన్నారు. వచ్చే ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అగస్టు 15 తర్వాత ప్రతి ఇంటికి నల్లా ద్వారా నీరందిస్తామన్నారు. చేతి వృత్తిదారుల కోసం రూ.1000 కోట్లు వెచ్చించామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం గొల్లకురుమలకు రూ.5000 కోట్లు వెచ్చించి గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. చేప పిల్లలు పంపిణీతో పాటు, రైతుల కష్టాలు తీర్చేందుకు నిరంతరం కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని అన్నారు. భవిష్యత్‌లో నాగార్జున సాగర్ నీటితో అవసరం లేకుండా సీతారామ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాలను ఉమ్మడి జిల్లాలో పారిస్తామన్నారు. సూర్యాపేట– ఖమ్మం రహదారి నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. అలాగే ఖమ్మం – రాజమండ్రి జాతీయ రహదారి కోసం అంచనాలు సిద్ధం చేస్తున్నామన్నారు. మెరుగైన వైద్యం అందించటంలో ఖమ్మం, భద్రాచలం ఆసుపత్రులు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. 2020 యేడాది కల్లా మిగులు రాష్ట్రంగా తెలంగాణ అవతరించబోతుందని గుర్తు చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు, కార్యదర్శి తాతా మదు, విత్తనాభివృద్ధి, పారిశ్రామికాభివృద్ధి సంస్ధ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, ఎస్.బి.బేగ్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, దయాకర్‌రెడ్డి, కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు. -
వారికి పుట్టగతులు ఉండవు
కూసుమంచి : దేశాన్నే ఆకర్షిస్తున్న రైతుబంధు పథకంపై విమర్శలు చేయడమంటే అది కోడిగుడ్డుపై ఈకలు పీకడం లాంటిదని, అలాంటి వారికి పుట్టగతులుండవని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పెరికసింగారం గ్రామంలో ఆయన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతమయ్యాయని, రైతుబంధు పథకం ప్రజలు, రైతుల గుండెల్లో నిలుస్తుందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ పథకంపై విమర్శలు చేస్తున్నారని, చేతనైతే రైతులకు సహాయం చేసేగుణం ఉంటే, ఈ పథకంలో పాలుపంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు ఎండి, సాగునీరు లేక ప్రాజెక్టుల్లో అవినితి జరిగి రైతులు ఎంతో నష్టపోయారని తెలిపారు. తెలంగాణా వచ్చాక అట్టి కష్టాలు తీర్చామని అన్నారు. భట్టి విక్రమాక్ర వట్టి మాటలు కాకుండా గట్టి మాటలు మాట్లాడాలని హితవు పలికారు. ఆయన చేసే సవాల్‌కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చర్చకు సిద్ధం అని ప్రకటించారు. గాంధీభవన్ పైరవీలకే పరిమితం అయిందని, కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి మయమేనని మంత్రి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆర్ఎస్ఎస్ మండల కన్వీనర్ జొన్నలగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
రైతుల వద్దకే ‘రైతుబంధు’
కొణిజర్ల : రైతులు మాకు ఇక పంట సాయం వద్దు అని చెప్పే వరకు ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని కొంత మంది రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. అంతకు మందు ఏర్పాటు చేసిన సభలో రైతుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతు పచ్చగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే రైతులకు కరెంట్ ఇబ్బందులు తొలగించారన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో రైతులకు వచ్చే విధంగా చేశామన్నారు. పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు 24 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన గోడౌన్ల నిర్మాణం చేపట్టామన్నారు. పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూతిరిగే పనిలేదు.. రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే పంట సాయం అందించాలని నిర్ణయించి రైతు బంధు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదని అన్నారు. కృష్ణా జలాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లించి వైరా ప్రాంతంలో కొణిజర్ల మండల రైతులు 3 పంటలు పండించేలా సాగు నీరు అందించబోతున్నామన్నారు. వైరా ఎమ్మెల్యే బాణొత్ మదన్‌లాల్, జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం ఆర్డీఓ తాళ్లూరి పూర్ణచంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్ దొడ్డపనేని రామారావు, జిల్లా సమితి సభ్యులు పాముల వెంకటేశ్వర్లు, డేరంగుల సునీత, గుత్తా వెంకటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ బోడపోతుల వెంకటేశ్వర్లు, వైరా ఏఎంసీ చైర్మన్ బాణోత్ నరసింహారావు, ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, తహసీల్దార్ ఎం.శైలజ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ అరుణజ్యోతి, ఆర్ఐలు కొండలరావు, వినీల, వీఆర్ఓ భూక్యా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సాయాన్ని వదులుకున్న వినయ్‌కుమార్ .. తనకు వచ్చిన పెట్టుబడి సాయాన్ని రైతు సమన్వయసమితి సంక్షేమ నిధికి ఇస్తున్నట్లు కొణిజర్లకు చెందిన రైతు దొడ్డా వినయ్‌కుమార్ తన మామ కొమ్మినేని సత్యం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ ఇచ్చారు. వినయ్ అమెరికాలో నివశిస్తున్నారు. ఆయనకున్న భూమికి గాను లభించిన రూ. 19,100 చెక్కును తిరిగి ఆయన తన మామ సత్యనారాయణ ద్వారా అధికారులకు అందజేశారు. దీంతో మంత్రి తుమ్మల ఆయనను అభినందించారు. జన్నారంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ కొణిజర్ల : రైతులు అప్పుల పాలు కాకూడదనే వారిని రుణబాధలు నుంచి విముక్తులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. మండలంలోని జన్నారంలో శుక్రవారం రైతు బం«ధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీడు భూములను సస్యశ్యామలం చేసి రైతు మోమున నవ్వు చూడాలన్నదే కేసీఆర్ ధ్యేయం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తతే రాష్ట్రం హరిత లెంలంగాణగా మారుతుందన్నారు. రూ 800 కోట్లు నీటి తీరువా రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారపోగు అరుణ, ఏఓ బాలాజీ, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వరరావు, మండల కోఆర్డినేటర్ యండ్రాతి మోహనరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సక్రునాయక్, ఎంపీటీసీ సభ్యులు మేడా ధర్మారావు, నాయకులు గిద్దగిరి సత్యనారాయణ, మేడ రమేష్, కొమ్మూరి వెంకటేశ్వరరావు, వీఆర్ఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
నగ్న చిత్రాలున్నాయ్.. బయటపెడతా..
సాక్షి, హైదరాబాద్: ఆయనో మాజీ ఎంపీ.. చాలా ఏళ్లపాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. కానీ సభ్య సమాజానికి చెప్పుకోలేని రీతిలో ఓ మహిళను వేధించారు.. మరో మహిళను వేధించిన అంశంపై నిలదీయడంతో దాడికి దిగారు.. అసభ్య పదజాలంతో దూషించారు.. నగ్న చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్మెయిల్ చేశారు.. గతంలో ఆయనపై కర్ణాటకకు చెందిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్సీ వేధింపుల మిగతా కేసు పెట్టడం.. ఇప్పుడా వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన మహిళ వెలుగులోకి తీసుకురావడంతో ఆ మాజీ ఎంపీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఆరోపణల్లోని ప్రజాప్రతినిధి ఖమ్మం టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన బాధితురాలు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిలదీయడంతో వేధింపులు తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వద్ద తన నగ్న చిత్రాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని, వాటిని బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ దాడికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మాజీ ఎమ్మెల్సీతో తాను మాట్లాడానని, నామా నాగేశ్వర్రావు పెళ్లి పేరుతో ఆమెతోపాటు చాలా మంది మహిళలను మోసం చేసినట్టుగా ఆమె చెప్పారని వెల్లడించారు. ఆమె నామాపై ఢిల్లీ కోర్టులో వేధింపుల కేసు కూడా పెట్టిందని వివరించారు. దీనిపై ప్రశ్నించడంతో తనను టార్గెట్ చేశారని, తన నగ్నచిత్రాలు బయటపెడతానని, అంతు తేలుస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే, జూలై నెలల్లో నామా నాగేశ్వర్రావుతో పాటు ఆయన సోదరుడు నామా సీతయ్య తన ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, దాడికి దిగారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన రెండున్నర నెలలకు.. నామా బెదిరింపులపై బాధితురాలు ఆగస్టు 10వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ నెల 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నామా తనను దూషించిన సెల్‌ఫోన్ ఆడియో రికార్డులను, ఇంటికి వచ్చి దూర్భాషలాడిన వీడియోను సైతం ఫిర్యాదుకు ఆధారంగా జతపరిచినా.. నామా ఒత్తిడి కారణంగా పోలీసులు ఇంతకాలం కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నామా వేధింపులపై బాధితురాలు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేసినట్టు తెలుస్తోంది. నామా సోదరుడిపైనా.. బాధితురాలిని వేధించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావుతోపాటు ఆయన సోదరుడు నామా సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసి రెండు రోజులైనా కేసు విషయం బయటకు పొక్కకుండా పోలీసులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి తుమ్మల పంపాండంటూ ఆరోపణలు! నామా నాగేశ్వర్రావు తన స్నేహితులకు, సంబంధీకులకు తనపై లేనిపోని విషయాలు గుప్పించి దుష్ప్రచారం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్మెయిల్ చేసేందుకు తనను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పంపించాడంటూ నామా ప్రతి ఒక్కరికి చెబుతున్నారని, దానిపై క్షమాపణ చెప్పాలని తాను కోరినా పట్టించుకోలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని స్పష్టం చేశారు. అసలు మంత్రి తుమ్మల తనకు పరిచయమే లేదన్నారు. -
జిల్లా కేంద్రాల్లోనూ వైట్‌టాపింగ్: తుమ్మల
సాక్షి, హైదరాబాద్: నగరంలో ప్రయోగాత్మకంగా చేస్తున్న వైట్‌టాపింగ్ కాంక్రీట్ పనుల్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ విస్తరించే అంశాన్ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో జరుగుతున్న వైట్‌టాపింగ్ పనుల్ని మంత్రి శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో ప్రస్తుతం ఉన్న బీటీ రోడ్ల నిర్వహణ వ్యయం ఎక్కువగా ఉందని, భారీ వర్షాలకు ఇవి త్వరగా దెబ్బతింటున్నాయని అన్నారు. అయితే వైట్‌టాపింగ్ రోడ్లు 20 ఏళ్లకు పైగా మన్నికగా ఉంటాయని చెప్పారు. వైట్‌టాపింగ్ నిర్మాణం సత్ఫలితాలను ఇస్తే దీన్ని అన్ని జిల్లా కేంద్రాల్లో చేపడతామని చెప్పారు. సీసీ రోడ్ల కంటే వైట్‌టాప్ నిర్మాణం అత్యంత ఆధునికమైనదన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ ఈ వైట్‌టాపింగ్ పనుల్ని నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కార్యక్రమంలో ఈఎన్సీ ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు.