అభివృద్ధిని యజ్ఞంలా భావించా.. | Others Parties Leaders Join In TRS Khammam | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని యజ్ఞంలా భావించా..

Published Fri, Nov 2 2018 6:42 AM | Last Updated on Tue, Nov 6 2018 9:13 AM

Others Parties Leaders Join In TRS Khammam - Sakshi

సదాశివపురం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న తుమ్మల నాగేశ్వరరావు

సాక్షి, నేలకొండపల్లి: ఒక యజ్ఞంలా భావించి పాలేరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మండలంలోని అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లి, మంగాపురంతండాలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లా డుతూ రైతు తన కాళ్లమీద తాను నిలబడే వరకు పెట్టుబడి, రైతు బీమా కొనసాగుతుందన్నారు. వచ్చే ఏడాది నుంచి పెట్టుబడి సొమ్ము  రూ.10వేల చొప్పున ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా గోదావరి జలాలను పాలేరు రిజర్వాయర్‌లో కలిపేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వాలు వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తే.. కేసీఆర్‌ ప్రభుత్వం 24 గంటలు ఉచిత విద్యుత్‌ అందించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రూ.17వేల కోట్ల రుణాలను మాఫీ చేసిందన్నారు. దేశంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని సమానంగా చూసిన ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు.

మీరిచ్చిన అవకాశంతో రెండేళ్లలో వేల కోట్ల రూపాయలతో పాలేరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. మరోసారి అవకాశం ఇస్తే మిగిలిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. కేసీఆర్‌ను మరోసారి ఆశీర్వదిస్తే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. పేద ప్రజలు బాగుపడే వరకు అభివృద్ధి పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. కారు గుర్తుకు ఓటేసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా.. సదాశివపురంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తుమ్మల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

కార్యక్రమాల్లో పాలేరు డివిజన్‌ సమన్వయకర్త సాధు రమేష్‌రెడ్డి, ఎంపీపీ కవితారాణి, జెడ్పీటీసీ సభ్యురాలు అనిత, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్‌ సైదులు, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు వెన్నపూసల సీతారాములు, కోటి సైదారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైసా శంకర్, నాయకులు వున్నం బ్రహ్మయ్య, నెల్లూరి భద్రయ్య, నల్లాని మల్లికార్జున్‌రావు, కొడాలి గోవిందరావు, నంబూరి సత్యనారాయణ, అనగాని నరసింహారావు, మల్లెల శ్రీనివాసరావు, కడియాల శ్రీనివాసరావు, కాసాని నాగేశ్వరరావు, గండు సతీష్, నేరళ్ల నరసింహారావు, కడియాల నరేష్, భూక్యా సుధాకర్, చిర్రా ముక్కంటి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

టీఆర్‌ఎస్‌ కండువా కప్పుతున్న తుమ్మల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement