సాక్షిప్రతినిధి, ఖమ్మం: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు సమయం ముంచుకొస్తుండడంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రచార ఊపు పెంచాయి. జాతీయ నేతలు జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తదితరులు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం.. ప్రధాన రాజకీయ పక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించడంతో పార్టీల మధ్య మాటలు తూటాలవుతున్నాయి. ఈనెల 19న సీఎం కేసీఆర్ తొలివిడత ఎన్నికల ప్రచారం ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టారు. ఖమ్మం, పాలేరు అభ్యర్థులైన పువ్వాడ అజయ్‌కుమార్, తుమ్మల నాగేశ్వరరావుల విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్, టీడీపీలపై విమర్శనాస్త్రాలు గుప్పించారు.
ప్రధానంగా ఒకవైపు తెలంగాణలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు వరప్రదాయినిగా ఉన్న సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేసేందుకు కేంద్ర జలవనరుల సంఘానికి లేఖలు రాసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు వస్తే అడ్డుకోవాలని.. సీతారామ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ప్రారంభమైన మాటల యుద్ధం ప్రధాన రాజకీయ వర్గాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ సభలో సీఎం కేసీఆర్.. టీడీపీ, కాంగ్రెస్ వ్యవహార శైలిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మరుసటిరోజు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ప్రజాకూటమి అభ్యర్థి నామా నాగేశ్వరరావు.. కేసీఆర్ వ్యాఖ్యలపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఘాటుగానే స్పందించారు. ప్రాజెక్టులను అడ్డుకోవాల్సిన అవసరం టీడీపీకి లేదని, రీ డిజైనింగ్‌కు సంబంధించి రాసిన లేఖలను రాజకీయం చేయడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
అనంతరం రాహు ల్, చంద్రబాబుల సంయుక్త బహిరంగ సభ ఖమ్మంలో నిర్వహించిన నేపథ్యంలో మంత్రి తమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌లు తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీతారామ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అభ్యంతరం తెలపడంపై, ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలని కేంద్రానికి లేఖ రాయడంపై సభాముఖంగా సమాధానం చెప్పాలని విలేకరుల సమావేశంలో చేసిన డిమాండ్‌తో జిల్లాలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
బుధ వారం జరిగిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో సుదీర్ఘంగా ప్రసంగించినా.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోబోనని స్పష్టం చేశారే తప్ప.. టీఆర్‌ఎస్ చేసిన అంశాలవారీ ఆరోపణలకు మాత్రం సభావేదిక నుంచి సమాధానం లభించలేదు. అయితే సభా వేదికపై చంద్రబాబు సమాధానం ఇవ్వకపోవడం గమనార్హం. ఖమ్మం ప్రజాకూటమి అభ్యర్థి, టీడీపీ నేత నామా నాగేశ్వరరావు మాత్రం టీడీపీ ప్రాజెక్టులను అడ్డుకోబోదని అదే వేదికపై చంద్రబాబు సమక్షంలో చెప్పారు.
రాష్ట్రస్థాయి నేతలు, సినీ నటులు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ప్రజాకూటమి అభ్యర్థుల విజయం కోసం మరోసారి రాష్ట్రస్థాయి నేతలు, సినీ నటులు ఎన్నికల ప్రచారానికి రానున్నారు. సీఎం కేసీఆర్ మలివిడత పర్యటనలో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, పినపాకల్లో పర్యటిస్తుండగా.. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అదేరోజు పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలంలో పర్యటించి.. పాలేరు అభ్యర్థి కందాళ ఉపేందర్‌రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ తిరుమలాయపాలెంలో జరిగే సభలో ప్రసంగించనున్నారు.
ఖమ్మం బీజేపీ అభ్యర్థి ఉప్పల శారదతోపాటు జిల్లాలోని బీజేపీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఇప్పటికే బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి తదితరులు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వచ్చేనెల 2వ తేదీన ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేటలో పోటీ చేస్తున్న ప్రజాకూటమిలోని టీడీపీ అభ్యర్థుల గెలుపును కోరుతూ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జిల్లాలో పర్యటించనున్నారు. ఇప్పటికే సినీ నటుడు వేణు.. నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అలాగే వచ్చేనెల 4న రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు ఖమ్మం నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించనున్నారు. బీజేపీ అభ్యర్థి ఉప్పల శారద విజయాన్ని కాంక్షిస్తూ ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ వచ్చేనెల 3న ఖమ్మం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
వచ్చేనెల 3న సీఎం కేసీఆర్ పర్యటన
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో మరోసారి పర్యటించనున్నారు. డిసెంబర్ 3న సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారికంగా పర్యటన ఖరారైంది. సీఎం పర్యటన కోసం టీఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ప్రారంభించాయి. ప్రధానంగా ప్రజాకూటమి నుంచి పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థులు ఈ నియోజకవర్గంలో ఉండడంతో సీఎం పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మధిర నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా.. సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థిగా ప్రజాకూటమి తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పోటీ చేస్తుండడంతో టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఈ రెండు నియోజకవర్గాల్లో సీఎం పర్యటన విజయవంతంపై దృష్టి పెట్టాయి. మధిరలో టీఆర్‌ఎస్ అభ్యర్థి విజయానికి చెమటోడుస్తూ పూర్తిగా నియోజకవర్గంపై దృష్టి సారించిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే జిల్లాలో సీఎం పర్యటన ఏర్పాట్ల విజయవంతంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టి సారించి.. పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment