కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, సభకు హాజరైన ప్రజలు
సాక్షి, కొత్తగూడెం: ‘పాలనాపరంగా వ్యవస్థలను దెబ్బతీసిన కాంగ్రెస్, టీడీపీలు అనైతిక పొత్తు పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నాయి. చైతన్యం ఎక్కువ కలిగిన జిల్లా ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఆ కూటమిని తరిమికొట్టాలి.’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లాలోని ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరుల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. గత 58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీల పాలనలో రాష్ట్రంలో పూర్తిగా జీవన విధ్వంసం జరిగిందని అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకసార్లు ఈ ప్రాంతానికి వచ్చానని, రాజకీయంగా చైతన్యవంతమైన ఆలోచనా శక్తి ఉన్న ఇక్కడి ప్రజలతో అనేక విషయాలు పంచుకున్నానని గుర్తుచేశారు. టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. దీంతో అందరి సహకారంతో 14 ఏళ్లు ఉద్యమం చేసి తెలంగాణ సాధించామన్నారు. గత నాలుగున్నరేళ్లలో ప్రజాభీష్టానికి అనుగుణంగా పాలనాపరంగా అద్భుతమైన విధానాలు చేపట్టామన్నారు. ప్రజలు పరిణతితో ఆలోచించి ప్రజా ఎంజెండా అమలు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్నారు.
కమీషన్లు దండుకున్న చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదే..
ఆరు దశాబ్దాలుగా రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్, టీడీపీలు కమీషన్లు భారీగా దండుకున్నాయని కేసీఆర్ విమర్శించారు. టీఆర్‌ఎస్ హయాంలో రైతుల మేలు కోసం సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులను రీడిజైన్ చేస్తే కమీషన్ల కోసమే చేసినట్లు రాహుల్‌గాంధీ ఆరోపణలు చేసి జోకర్ అయ్యారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశామని, సీతారామ, భక్తరామదాసు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
జిల్లాలో ప్రతీ అంగుళానికి నీరిచ్చేందుకు రీడిజైన్ చేస్తే కమీషన్ల కోసమని ఆరోపించడం ఏమిటన్నారు. రాహుల్‌కు దమ్ముంటే ఇక్కడకు వస్తే చూపిస్తానన్నారు. దేశంలో అనేక ప్రాజెక్టులకు రాహుల్ కుటుంబ సభ్యుల పేర్లే పెట్టడం ఏమిటన్నారు. మేము మాత్రం దేవుళ్ల పేర్లు పెట్టామన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో ప్రజాజీవితాన్ని విధ్వంసం చేసిన కాంగ్రెస్, టీడీపీలు కలిసిపోయి హిమాలయాలకు వెళ్లి ఆకుపరస తాగి వచ్చి పవిత్రమైనారా లేక చంద్రమండలం నుంచి దిగివచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్ నిధులు మింగిన చరిత్ర ఉన్న రాహుల్‌కు కమీషన్ల గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాహుల్‌కు స్క్రిప్టు ఎవరు రాసిస్తారో కానీ సొల్లు విమర్శలు చేస్తున్నారన్నారు.
స్థానికంగా స్వయంపాలన తెచ్చాం
రాష్ట్రవ్యాప్తంగా 3,500 గిరిజన గూడేలను, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్థానికంగా స్వయంపాలన సాగించేలా చేశామన్నారు. జనవరిలో కొత్త పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. ఇంతకు ముందు కొత్త జిల్లాలతో పాలన మరింత చేరువ చేశామన్నారు.రాష్ట్రంలో కంటివెలుగు పథకం ద్వారా 90లక్షల మందికి కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లజోళ్లు, మందులు ఇస్తున్నామన్నారు. తరువాత దశల్లో చెవి, ముక్కు, గొంతు, దంత, శిబిరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
అనంతరం ప్రతీ ఒక్కరి రక్తనమూనాలు సేకరించి బీపీ, షుగర్ తదితర వివరాలన్నింటినీ డేటాబేస్‌లో నిక్షిప్తం చేసి తగినవిధంగా వైద్యసేవలు, అత్యవసర వైద్యం సైతం అందిస్తామన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రైతుబంధు, రైతుబీమా రైతులకు ఎంతో మేలు చేశాయన్నారు. గొర్రెల పెంపకం పథకం కింద 4వేల కోట్లతో 70లక్షల గొర్రెలను ఇచ్చి సంతతి పెంచామన్నారు. మహారాష్ట్ర నుంచి మాంసం దిగుమతి చేసుకునే స్థితి నుంచి దుబాయ్‌కు మాంసం ఎగుమతి చేసే స్థాయికి ఎదిగామన్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బలమైన అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రం ఆదాయం పెంచి రైతులకు, వివిధ వర్గాలకు పంచుతున్నామన్నారు. తమ హయాంలో ఇసుక ద్వారా ఆదాయం పెంచామని అన్నారు. విద్య విషయంలో ఒక్కో విద్యార్థికి రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు.
కొత్తగూడెంలో మైనింగ్ వర్సిటీ, ఏరోడ్రోమ్ ఏర్పాటు చేస్తాం..
సింగరేణి ప్రధాన కార్యాలయం కలిగి కొత్తగా జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామన్నారు. కొత్తగూడెంలో విమానాల రాకపోకలకు వీలుగా ఏరోడ్రోమ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇల్లెందులో సింగరేణి భూగర్భగని కొత్తగా ప్రారంభిస్తామన్నారు. బయ్యారంలో సింగరేణి ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పోడు భూముల సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామన్నారు.
జిల్లాలో మంచి నాయకులు..
జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు మంచి నాయకులు ఉన్నారని కేసీఆర్ అన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జలగం ప్రసాదరావు, జలగం వెంకట్రావులు అభివృద్ధికాముకులన్నారు. జలగం వెంకట్రావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారణంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు అయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకున్న కొత్తగూడేనికి చెందిన మహిళ నాగమణిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ ‘ముఖ్యమంత్రి కేసీఆర్ నీ తమ్ముడిలాంటివాడు. నీ విషయం నేను చూసుకుంటాను’ అని అన్నారు. కొత్తగూడెంలో జలగం వెంకట్రావు, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లెందులో కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సభల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.
పోడు భూములకుపట్టాలిప్పిస్తాం
పోడు భూముల సమస్య కొంత ఉందని, ఈసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే వారందరికీ పోడు భూములకు హక్కును కల్పిస్తూ పట్టాలు ఇప్పిస్తామని మాజీ మంత్రి జలగం ప్రసాదరావు అన్నారు. వయసు అయిపోయింది, ఆఖరుసారి అని ఓట్లను అర్జించే నాయకులను నమ్మవద్దని, వయసు అయిపోతే ఓటెందుకని ఆయన వ్యాఖ్యానించారు. జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు నీచమైన పాలన చేశాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment