సాక్షి, హైదరాబాద్: ఆయనో మాజీ ఎంపీ.. చాలా ఏళ్లపాటు ప్రజాప్రతినిధిగా ఉన్నారు.. కానీ సభ్య సమాజానికి చెప్పుకోలేని రీతిలో ఓ మహిళను వేధించారు.. మరో మహిళను వేధించిన అంశంపై నిలదీయడంతో దాడికి దిగారు.. అసభ్య పదజాలంతో దూషించారు.. నగ్న చిత్రాలను బయట పెడతానంటూ బ్లాక్‌మెయిల్ చేశారు.. గతంలో ఆయనపై కర్ణాటకకు చెందిన ఓ మాజీ మహిళా ఎమ్మెల్సీ వేధింపుల మిగతా కేసు పెట్టడం.. ఇప్పుడా వ్యవహారాన్ని హైదరాబాద్‌కు చెందిన మహిళ వెలుగులోకి తీసుకురావడంతో ఆ మాజీ ఎంపీ లీలలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఈ ఆరోపణల్లోని ప్రజాప్రతినిధి ఖమ్మం టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు.. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన బాధితురాలు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిలదీయడంతో వేధింపులు
తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు తనను వేధిస్తున్నారంటూ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వద్ద తన నగ్న చిత్రాలు ఉన్నాయంటూ బెదిరిస్తున్నారని, వాటిని బయటపెట్టి సమాజంలో తలెత్తుకోలేకుండా చేస్తానంటూ దాడికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. తను ఒంటరిగా నివసిస్తున్నానని, నామా నాగేశ్వర్‌రావు నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు చెప్పారు. 2013 నుంచి నామా నాగేశ్వర్‌రావు తనకు స్నేహితుడని, అప్పుడప్పుడు ఇంటికి వచ్చి వెళ్తుండేవారని తెలిపారు. అయితే గతంలో కర్ణాటకకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ నామాపై వేధింపుల కేసు పెట్టిందని.. దీనిపై తాను నిలదీయడంతో తనపైనా వేధింపులు మొదలుపెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ మాజీ ఎమ్మెల్సీతో తాను మాట్లాడానని, నామా నాగేశ్వర్‌రావు పెళ్లి పేరుతో ఆమెతోపాటు చాలా మంది మహిళలను మోసం చేసినట్టుగా ఆమె చెప్పారని వెల్లడించారు. ఆమె నామాపై ఢిల్లీ కోర్టులో వేధింపుల కేసు కూడా పెట్టిందని వివరించారు. దీనిపై ప్రశ్నించడంతో తనను టార్గెట్ చేశారని, తన నగ్నచిత్రాలు బయటపెడతానని, అంతు తేలుస్తానని బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది మే, జూలై నెలల్లో నామా నాగేశ్వర్‌రావుతో పాటు ఆయన సోదరుడు నామా సీతయ్య తన ఇంటికి వచ్చి దుర్భాషలాడారని, దాడికి దిగారని ఆరోపించారు.
ఫిర్యాదు చేసిన రెండున్నర నెలలకు..
నామా బెదిరింపులపై బాధితురాలు ఆగస్టు 10వ తేదీన జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఈ నెల 25న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నామా తనను దూషించిన సెల్‌ఫోన్ ఆడియో రికార్డులను, ఇంటికి వచ్చి దూర్భాషలాడిన వీడియోను సైతం ఫిర్యాదుకు ఆధారంగా జతపరిచినా.. నామా ఒత్తిడి కారణంగా పోలీసులు ఇంతకాలం కేసు నమోదు చేయలేదని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నామా వేధింపులపై బాధితురాలు ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదుచేసినట్టు తెలుస్తోంది.
నామా సోదరుడిపైనా..
బాధితురాలిని వేధించిన వ్యవహారంలో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతోపాటు ఆయన సోదరుడు నామా సీతయ్యపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. నమోదు చేసి రెండు రోజులైనా కేసు విషయం బయటకు పొక్కకుండా పోలీసులు ప్రయత్నించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంత్రి తుమ్మల పంపాండంటూ ఆరోపణలు!
నామా నాగేశ్వర్‌రావు తన స్నేహితులకు, సంబంధీకులకు తనపై లేనిపోని విషయాలు గుప్పించి దుష్ప్రచారం చేస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్‌మెయిల్ చేసేందుకు తనను మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు పంపించాడంటూ నామా ప్రతి ఒక్కరికి చెబుతున్నారని, దానిపై క్షమాపణ చెప్పాలని తాను కోరినా పట్టించుకోలేదని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాకుండా అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని స్పష్టం చేశారు. అసలు మంత్రి తుమ్మల తనకు పరిచయమే లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment