మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి
కూసుమంచి : దేశాన్నే ఆకర్షిస్తున్న రైతుబంధు పథకంపై విమర్శలు చేయడమంటే అది కోడిగుడ్డుపై ఈకలు పీకడం లాంటిదని, అలాంటి వారికి పుట్టగతులుండవని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పెరికసింగారం గ్రామంలో ఆయన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పలు పథకాలు విజయవంతమయ్యాయని, రైతుబంధు పథకం ప్రజలు, రైతుల గుండెల్లో నిలుస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ నాయకులు మాత్రం ఈ పథకంపై విమర్శలు చేస్తున్నారని, చేతనైతే రైతులకు సహాయం చేసేగుణం ఉంటే, ఈ పథకంలో పాలుపంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ హయాంలో చెరువులు ఎండి, సాగునీరు లేక ప్రాజెక్టుల్లో అవినితి జరిగి రైతులు ఎంతో నష్టపోయారని తెలిపారు. తెలంగాణా వచ్చాక అట్టి కష్టాలు తీర్చామని అన్నారు. భట్టి విక్రమాక్ర వట్టి మాటలు కాకుండా గట్టి మాటలు మాట్లాడాలని హితవు పలికారు. ఆయన చేసే సవాల్‌కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ చర్చకు సిద్ధం అని ప్రకటించారు.
గాంధీభవన్ పైరవీలకే పరిమితం అయిందని, కాంగ్రెస్ చరిత్ర అంతా అవినీతి మయమేనని మంత్రి తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ జొన్నలగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment