మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
కొణిజర్ల : రైతులు మాకు ఇక పంట సాయం వద్దు అని చెప్పే వరకు ప్రభుత్వం రైతు బంధు కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతుబంధు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని కొంత మంది రైతులకు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశారు. అంతకు మందు ఏర్పాటు చేసిన సభలో రైతుల నుద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతు పచ్చగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. అందుకే రైతులకు కరెంట్ ఇబ్బందులు తొలగించారన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు సకాలంలో రైతులకు వచ్చే విధంగా చేశామన్నారు. పండించిన పంటలను నిల్వ చేసుకునేందుకు 24 లక్షల టన్నుల సామర్ధ్యం కలిగిన గోడౌన్‌ల నిర్మాణం చేపట్టామన్నారు.
పెట్టుబడి కోసం బ్యాంకుల చుట్టూతిరిగే పనిలేదు..
రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేయాలని పెట్టుబడి కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే పంట సాయం అందించాలని నిర్ణయించి రైతు బంధు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. చరిత్రలో ఎక్కడా, ఏ దేశంలో లేదని అన్నారు. కృష్ణా జలాలు రాష్ట్రానికి వచ్చే పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటంతో గోదావరి జలాలను జిల్లాకు మళ్లించి వైరా ప్రాంతంలో కొణిజర్ల మండల రైతులు 3 పంటలు పండించేలా సాగు నీరు అందించబోతున్నామన్నారు.
వైరా ఎమ్మెల్యే బాణొత్ మదన్‌లాల్, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఖమ్మం ఆర్డీఓ తాళ్లూరి పూర్ణచంద్ర మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయసమితి మండల కోఆర్డినేటర్ దొడ్డపనేని రామారావు, జిల్లా సమితి సభ్యులు పాముల వెంకటేశ్వర్లు, డేరంగుల సునీత, గుత్తా వెంకటేశ్వరరావు, ఆత్మ చైర్మన్ బోడపోతుల వెంకటేశ్వర్లు, వైరా ఏఎంసీ చైర్మన్ బాణోత్ నరసింహారావు, ఎంపీపీ వడ్లమూడి ఉమారాణి, తహసీల్దార్ ఎం.శైలజ, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ అరుణజ్యోతి, ఆర్‌ఐలు కొండలరావు, వినీల, వీఆర్‌ఓ భూక్యా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
సాయాన్ని వదులుకున్న వినయ్‌కుమార్ ..
తనకు వచ్చిన పెట్టుబడి సాయాన్ని రైతు సమన్వయసమితి సంక్షేమ నిధికి ఇస్తున్నట్లు కొణిజర్లకు చెందిన రైతు దొడ్డా వినయ్‌కుమార్ తన మామ కొమ్మినేని సత్యం ద్వారా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు లేఖ ఇచ్చారు. వినయ్ అమెరికాలో నివశిస్తున్నారు. ఆయనకున్న భూమికి గాను లభించిన రూ. 19,100 చెక్కును తిరిగి ఆయన తన మామ సత్యనారాయణ ద్వారా అధికారులకు అందజేశారు. దీంతో మంత్రి తుమ్మల ఆయనను అభినందించారు.
జన్నారంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ
కొణిజర్ల : రైతులు అప్పుల పాలు కాకూడదనే వారిని రుణబాధలు నుంచి విముక్తులను చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశ పెట్టి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్నారని వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ అన్నారు. మండలంలోని జన్నారంలో శుక్రవారం రైతు బం«ధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ బీడు భూములను సస్యశ్యామలం చేసి రైతు మోమున నవ్వు చూడాలన్నదే కేసీఆర్ ధ్యేయం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్ట్‌లు పూర్తతే రాష్ట్రం హరిత లెంలంగాణగా మారుతుందన్నారు. రూ 800 కోట్లు నీటి తీరువా రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నారపోగు అరుణ, ఏఓ బాలాజీ, రైతు సమన్వయ సమితి జిల్లా కమిటీ సభ్యుడు గుత్తా వెంకటేశ్వరరావు, మండల కోఆర్డినేటర్ యండ్రాతి మోహనరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సక్రునాయక్, ఎంపీటీసీ సభ్యులు మేడా ధర్మారావు, నాయకులు గిద్దగిరి సత్యనారాయణ, మేడ రమేష్, కొమ్మూరి వెంకటేశ్వరరావు, వీఆర్‌ఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment