టీఆర్‌ఎస్‌ పొత్తు ప్రజలతోనే.. | Thummala Nageswara Rao Comments On Congress Khammam | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ పొత్తు ప్రజలతోనే..

Published Wed, Sep 26 2018 8:34 AM | Last Updated on Wed, Sep 26 2018 8:34 AM

Thummala Nageswara Rao Comments On Congress Khammam - Sakshi

మాట్లాడుతున్న మంత్రి తుమ్మల. చిత్రంలో ఎంపీ పొంగులేటి, తాజా మాజీ ఎమ్మెaల్యే అజయ్‌

సాక్షిప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్‌కు ప్రజలతోనే పొత్తు తప్ప మరే పార్టీతోనూ పొత్తు లేదని, ప్రభుత్వం చేసిన అభివృద్ధే వచ్చే ఎన్నికల్లో పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నగరంలోని టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఖమ్మం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభకు తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ అధ్యక్షత వహించగా.. మంత్రి తుమ్మల మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జిల్లాకు ప్రత్యేకత ఉందని, జిల్లాలో పార్టీ అంత బలంగా లేదన్న భావన అనేక మందిలో నెలకొని ఉందని, వచ్చే ఎన్నికల్లో పది ఎమ్మెల్యే స్థానాలను గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్‌కు అప్పగించడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తా ఏమిటో చాటాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల కురుక్షేత్రంలో కార్యకర్తలు కలిసికట్టుగా ప్రత్యర్థి పార్టీపై రాజకీయ యుద్ధానికి సిద్ధం కావాలని.. పార్టీ పరంగా, అంతర్గతంగా ఏ సమస్యలున్నా కుటుంబ సభ్యులుగా మాట్లాడుకుని పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు.

టీఆర్‌ఎస్‌కు జిల్లాలో అనుకూల పవనాలున్నాయని, ఈ అంశం గత ఖమ్మం నగర కార్పొరేషన్‌ ఎన్నికల్లో రుజువైందని, సీఎం కేసీఆర్‌ ఒక్కసారి ఖమ్మం వచ్చి చేసిన అభివృద్ధి వివరిస్తే కారు గుర్తుపై 33 మంది కార్పొరేటర్లు గెలిచారని, జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభంజనానికి ఇదొక మచ్చుతునక అని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే పువ్వాడ అజయ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. వివిధ రాజకీయ పక్షాల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి ఒక్కరూ అజయ్‌ విజయానికి కృషి చేస్తే ప్రత్యర్థి పార్టీకి ఓట్లే ఉండవని అన్నారు. త్వరలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలో పర్యటించనున్నారని, హుస్నాబాద్‌ తరహాలో జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టాలని మంత్రి తుమ్మల కోరారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు ఉన్న అనుకూలమైన వాతావరణాన్ని కార్యకర్తలు ఒడిసిపట్టుకుని ఓట్ల రూపంలో మార్చుకోవాలని, పార్టీ గెలిస్తే కార్యకర్తలకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు.

సీఎం కేసీఆర్, జిల్లా మంత్రి తుమ్మల అభివృద్ధి పనులకు నిర్వచనంలా ఉన్నారని, జిల్లాలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఓటరుకు వివరించాలని, ఖమ్మం నియోజకవర్గంలో పువ్వాడ అజయ్‌కుమార్‌ విజయం ఎప్పుడో ఖాయమైందని, అయితే కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు యుద్ధంలో పాల్గొనే సైనికుల్లా అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే ఈ విజయం తీరానికి చేరుతుందని వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదన్నారు. పువ్వాడ అజయ్‌కుమార్‌ ప్రజల తలలో నాలుకలా మారారని, వారంలో ఐదు రోజులపాటు నియోజకవర్గంలో పర్యటిస్తూ.. ప్రజల మనిషిగా ఉన్నారన్నారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతోందని, పువ్వాడ అజయ్‌కు  ప్రజలతో ఉన్న సాన్నిహిత్యం దీనికి తోడు కావడంతో ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమన్నారు.

గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ నుంచి ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులందరూ ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో ఉండటంతో ఇక టీఆర్‌ఎస్‌ మెజార్టీ అదే స్థాయిలో పెరిగి తీరాలన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ఖమ్మం నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసే అవకాశం శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదటి సారే రావడం, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేశానన్న గుర్తింపు లభించడం తనకు ఎంతో సంతృప్తి ఇస్తోందన్నారు. గత ఎన్నికల్లో తన తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు మాత్రమే అండగా ఉంటే.. ఈ ఎన్నికల్లో తన విజయానికి మరో నాగేశ్వరరావు తుమ్మల రూపంలో తనకు లభించడం ఆనందంగా ఉందని, పార్టీ కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యేంత వరకు అనుక్షణం అప్రమత్తంగా ఉండి.. పార్టీ విజయానికి తోడ్పాటు అందించాలని, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ సూచించినట్లుగా కార్యకర్తలతో అరమరికలు లేకుండా మాట్లాడుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు శ్రమిస్తానన్నారు. సభలో కార్పొరేషన్‌ చైర్మన్లు కొండబాల కోటేశ్వరరావు, బేగ్, మేయర్‌ పాపాలాల్, ఆర్జేసీ కృష్ణ, పార్టీ నాయకులు సాధు రమేష్‌రెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, టీఆర్‌ఎస్‌ నగర కన్వీనర్‌ కమర్తపు మురళి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

హాజరైన నాయకులు, కార్యకర్తలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement