కొత్త రైలు.. కూ చుక్‌ చుక్‌! | Central Minister Rajen Gohain Foundation Stone To Railway Development Works | Sakshi
Sakshi News home page

కొత్త రైలు.. కూ చుక్‌ చుక్‌!

Published Thu, Sep 27 2018 1:38 AM | Last Updated on Thu, Sep 27 2018 6:48 AM

Central Minister Rajen Gohain Foundation Stone To Railway Development Works - Sakshi

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో రైల్వే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న రాజెన్‌ గోహేన్‌. చిత్రంలో మల్లారెడ్డి, దత్తాత్రేయ, వినోద్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌ : రైల్వే స్టేషన్‌ల్లో ప్రయాణికుల సదుపాయాలు, మౌలిక వసతుల ఏర్పాటుకు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్‌ గోహేన్‌ పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన కరీంనగర్‌–లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ ముంబై (11206/11205) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఇప్పటివరకు నిజామాబాద్‌–ముంబై మధ్య నడుస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌.. ఇక నుంచి కరీంనగర్‌–లోకమాన్య తిలక్‌ టెర్మినల్‌ ముంబై వరకు రాకపోకలు సాగించనుంది. మల్కాజిగిరి రైల్వే స్టేషన్‌లో రైళ్ల రాకపోకల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసే ఎలక్ట్రానిక్‌ గైడెన్స్‌ వ్యవస్థను ప్రారంభించారు. ఈ ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ వల్ల ప్లాట్‌ఫారాలపై ఏ కోచ్‌ ఎక్కడ ఉంటుందో తెలుసుకోవచ్చు. రిమోట్‌ కంట్రోల్‌ ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్‌ జంట నగరాలతోపాటు, కాజీపేట, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల తదితర చోట్ల సుమారు రూ.2వేల కోట్ల అంచనాలతో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలకు శంకుస్థాపన చేశారు.

రూ.125 కోట్లతో పూర్తి చేసిన పలు సదుపాయాలను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చా రు. కాజీపేట్‌–కొండపల్లి మధ్య 3వ రైలు మార్గానికి శంకుస్థాపన చేశారు. మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన 3వ లైన్‌ను ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో 6/7 ప్లాట్‌ఫాంపై ఒక లిఫ్టు నిర్మాణానికి, బేగంపేటలో రూ.1.5 కోట్లతో 3 లిఫ్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్ట్స్‌ కాలేజీ రైల్వే స్టేషన్‌లో 238 మీటర్‌ల నుంచి 330 మీటర్‌లకు పొడిగించిన 2 ప్లాట్‌ఫారాలను ప్రారంభించారు. లింగంపల్లి, కాజీపేట స్టేషన్లలో రూ.3 కోట్లతో చేపట్టనున్న 3 ఎస్కలేటర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. బొల్లారం, వరంగల్‌ రైల్వే స్టేషన్ల పాదచారుల వంతెన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మల్లారెడ్డి, బండారు దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ప్రాధాన్యత.. 
ఈ సందర్భంగా మంత్రి రాజెన్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులను ఈ నాలుగేళ్లలో పూర్తి చేసినట్లు తెలిపారు. కొత్త లైన్ల విస్తరణ, సదుపాయాలకు రూ.వేల కోట్లు వెచ్చించినట్లు చెప్పారు. ఈ ఏడాది సుమారు 50 కిలోమీటర్లకు పైగా కొత్తలైన్లు వేయడంతోపాటు, 76 కిలోమీటర్ల రైల్వే లైన్లను డబ్లింగ్‌ చేసినట్లు వివరించారు. మరో 345 కిలోమీటర్ల రైల్వే లైన్లను విద్యుదీకరించినట్లు పేర్కొన్నారు. రూ.106 కోట్లతో మంచిర్యాల–పెద్దంపేట మధ్య నిర్మించిన మూడో రైలు మార్గాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. దీనివల్ల సరుకు రవాణాకు ఈ మార్గంలో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.

కాజీపేట–కొండపల్లి మధ్య రూ.1693.45 కోట్ల అంచనాలతో ప్రస్తుతం చేపట్టిన మూడో రైలు మార్గం వల్ల ప్రయాణికులకు అదనపు సదుపాయం అందుబాటులోకి రావడమే కాకుండా సరుకు రవాణాలో ఇతోధికమైన అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. మల్కాజిగిరి స్టేషన్‌ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి మంత్రిని కోరారు. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు ఇంకా విస్తరించాల్సి ఉందని అన్నారు. లాలాగూడ కేంద్రీయ రైల్వే ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. ఎంఎంటీఎస్‌ రెండో దశను సత్వరమే పూర్తి చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తగిన నిధులు కేటాయించకపోవడంతోనే ఈ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదని, యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ పొడిగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వేలో కాపలా లేని రైల్వే గేట్లను పూర్తిగా తొలగించనున్నట్లు జనరల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement