
జహీరాబాద్‌లో నిర్వహించిన సభకు హాజరైన ప్రజలు, సభలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, చిత్రంలో బీజేపీ అభ్యర్థి జంగమ గోపి
జహీరాబాద్: బీజేపీతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. జహీరాబాద్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మోదీ ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారన్నారు. వ్యవసాయరంగంతో పాటు ప్రాధాన్యతా రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. వాజ్‌పేయి ప్రభుత్వం చేపట్టిన రహదారుల అభివృద్ధి పనులను మోదీ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. దేశంలో ఫోర్‌లైన్, సిక్స్ లైన్స్, 8 లైన్స్ రోడ్ల నిర్మాణం చేపట్టిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
అన్ని గ్రామాలకు పక్కా రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. పేదల కోసం ప్రారంభించిన ఆయుష్మాన్‌భవ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. రూ.5లక్షల విలువైన ఉచిత వైద్య సేవలు అందుతున్నాయన్నారు. 50 రోజుల్లోనే 3లక్షల మందికి ఈ పథకం కింద వైద్యసేవలు అందాయన్నారు. ప్రతి పేదవాడికి గూడు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిరుద్యోగ సమస్యను నిర్మూలించి యువతకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ధ్యేయంతో ముందకు సాగుతున్నామన్నారు.
అధికారం ఇవ్వండి.. అభివృద్ధి చూపిస్తాం
రాష్ట్రంలో బీజేపీకి అధికారం అప్పగిస్తే రానున్న ఆరు నెలల్లోనే లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారు. నిరుద్యోగ నిర్మూలన విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రూ.2లక్షల మేర రుణమాఫీ అందిస్తామని, వృద్ధులకు రూ.2వేల పింఛన్ ఇప్పిస్తామన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో నాలుగోసారి అధికారాన్ని చేపట్టబోతున్నట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ హయాంలో కేవలం రెండు మొబైల్ కర్మాగారాలు ఉంటే తమ ప్రభుత్వం వచ్చాక దీన్ని 120కి పెంచినట్లు గుర్తు చేశారు. వ్యవసాయ రంగం చితికిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నందున వారికి మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో పలు ధాన్యం ధరలకు గిట్టుబాటు ధరలను ప్రకటించడం జరిగిందన్నారు.
జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న జంగమ గోపిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. విజయం సాధించాక తాను విజయోత్సవ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. సమావేశంలో బీజేపీ అభ్యర్థి జంగమ గోపి, పార్టీ సీనియర్ నాయకులు ఆవుల గోవర్ధన్, గీతామూర్తి, టి.లక్ష్మారెడ్డి, అరుణ కౌళాస్, సోమాయప్ప, సాంబమూర్తి, సూరజ్‌సింగ్, శ్రీనివాస్‌గౌడ్, అవినాశ్‌కుల్‌కర్ణి, జనార్ధన్‌రెడ్డి, రాచప్ప, శ్రీనివాస్‌గుప్తా, బక్కయ్యగుప్తా, విశ్వనాథ్‌యాదవ్, సుధీర్‌భండారి పాల్గొన్నారు.
గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా..
జహీరాబాద్: తనను గెలిపిస్తే ఐదేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని బీజేపీ అభ్యర్థి జంగమ గోపి అన్నారు. జహీరాబాద్‌కు నిమ్జ్ మంజూరైనందున రైతులకు న్యాయమైన పరిహారం ఇప్పించేలా చూస్తానన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పించేలా పాటుపడుతానన్నారు. ఇప్పటి వరకు గెలుపొందిన నేతలు జహీరాబాద్ ప్రాంతాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. గత రెండు పర్యాయాలు స్థానికేతర వ్యక్తిని ఎన్నుకోవడం వల్ల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. తనను గెలిపిస్తే వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతానన్నారు. జహీరాబాద్‌లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment