‘అగ్రకులాలకు 25 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి’
► క్రిమిలేయర్ పద్దతిని పాటించి అమలు చేయాలి
► అన్ని పార్టీలు సహకరించి చట్టం తేవాల్సి ఉంది
► కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే
సాక్షి, హైదరాబాద్: జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకూ రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49.5 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు. మిగతా 50.5 శాతం కోటాలో జనరల్ కేటగిరీలో ఉన్న కులాలకు 25శాతం వరకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. క్రిమిలేయర్ పద్దతిలో ఈ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేస్తే సరిపోతుందన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ తెలుగు రాష్ట్రాల్లో కమ్మ, కాపు, రెడ్డి, వెలమ కులాలు, మహారాష్ట్రలో మరాఠాలు, గుజరాత్‌లో పటేల్, హర్యానాలో జాట్, రాజస్థాన్‌లో రాజ్‌పుథ్ కులాలు రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్నాయి. అగ్రవర్ణాలైనప్పటికీ ఆయా కులాల్లో కొందరు పేదలున్నారు. ఆర్థిక స్థితిని బట్టి వారికి కూడా ప్రయోజనాలు కల్పించాలి.. ఈ ప్రక్రియంతా పూర్తి పారదర్శకతతో జరగాలి’ అని అన్నారు.
కేంద్ర మంత్రి మండలి మొదలు, రాజ్యసభలోనూ రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. అదేవిధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, రైల్వేశాఖల్లోనూ రిజర్వేషన్ల వారీగా ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. వికలాంగుల రిజర్వేషన్ల పెంపు అంశాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం 3 శాతం ఉన్న వికలాంగుల రిజర్వేషన్లు 4 శాతానికి పెంచనున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వికలాంగులకు ఉద్యోగావకాశాలపై దృష్టి పెట్టామని, అన్ని శాఖల్లో బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందని, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు విజన్ ఉన్న నాయకుడన్నారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాలల ఏర్పాటు ప్రశంసించదగ్గ కార్యక్రమమని, మైనార్టీల కోసం కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం శుభపరిణామమన్నారు.
అనంతరం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తరపున రూ.702 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరారు. ఈమేరకు అథవాలేకు వినతి పత్రాన్ని సమర్పించాడు. రాష్ట్రంలో తలపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు రూ.100 కోట్ల సాయం కావాలని కేంద్రమంత్రిని కోరారు. అదేవిధంగా గురుకులాల అభివృద్ధి రూ.400 కోట్లు ఇస్తే వీటిని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.