శనివారం గచ్చిబౌలిలోని కరోనా ప్రత్యేక ఆస్పత్రిని పరిశీలిస్తున్న కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదైన హైదరాబాద్‌పైనే కేంద్ర బృందం దృష్టిసారించింది. ఇక్కడెందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయన్న దానిపై అధ్యయనం చేయనుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరణ, ఉధృతిని పరి శీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి అరుణ్ భరోకా ఆధ్వర్యంలో ప్రజారోగ్య సీనియర్ స్పెషలిస్టు డాక్టర్ చంద్రశేఖర్, ఎన్‌ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, నేషనల్ కన్జూమర్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌కు చెందిన శేఖర్ చతుర్వేది లతో కూడిన బృందం 3 రోజుల రాష్ట్ర పర్యటనకు శనివారం హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందాన్నే ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీఆర్)గా పిలుస్తున్నారు. వికారాబాద్, సూర్యాపేట జిల్లాల్లోనూ ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నా హైదరాబాద్‌లో అంతకన్నా ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో కేంద్ర బృందం జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రాంతాల్లోనే పర్యటించాలని నిర్ణయించింది.
గచ్చిబౌలి ఆసుపత్రిలో సమీక్ష...
గచ్చిబౌలిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1,500 పడకల కరోనా ఆసుపత్రిని కేంద్ర బృందం తొలుత సందర్శించింది. ఆసుపత్రిలోని ఐసీయూ, ఎమర్జెనీ వార్డులను, ఐసోలేషన్ వార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వేర్వేరు ప్రొటోకాల్ కమిటీలను ఏర్పాటు చేశారా లేదా అని బృంద సభ్యులు రాష్ట్ర అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగులకు చికిత్స అందించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఎటువంటి శిక్షణ ఇచ్చారన్న అంశాన్ని వాకబు చేశారు. టెస్టింగ్ కిట్లు, వ్యక్తిగత పరిరక్షణ పరికరాలు, మాస్కులు, వెంటిలేటర్ సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు.
‘అక్షయపాత్ర’పై ఆసక్తి...
గచ్చిబౌలి ఆసుపత్రి సందర్శన అనంతరం కేంద్ర బృందం రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని కోకాపేటలో ఉన్న అక్షయపాత్ర ఫౌండేషన్‌ను పరిశీలించింది. లాక్‌డౌన్ సమయంలో హైదరాబాద్‌లోని అన్నార్థుల ఆకలి బాధలు తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలను బృంద సభ్యులు స్థానిక అధికారులు, ఫౌండేషన్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని 200 కేంద్రాల్లో లక్షన్నర మందికి నిత్యం మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందిస్తున్నట్లు నిర్వాహకులు బృందానికి వివరించారు.
అక్షయపాత్రలో పూర్తి పారిశుద్ధ్య వాతావరణంతోపాటు మంచి పోషకాలున్న కూరగాయలతో వంటలను తయారు చేయడంపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సమావేశమయ్యారు. చివరగా నగర పోలీస్ కమిషనరేట్‌లోని కంట్రోల్ రూంను పరిశీలించారు. నగర పోలీస్ కమిషనరేట్ అధికారులు కంటైన్మెంట్ ప్రాంతాల్లోనూ, నగరంలో చేపడుతున్న కరోనా నియంత్రణ చర్యలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాతబస్తీలో కేంద్ర బృందం సభ్యులతో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్
సీఎస్ బృందంతో భేటీ...
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను కేంద్ర బృందానికి సీఎస్ సోమేశ్ కుమార్ సమగ్రంగా వివరించారు. బీఆర్కే భవన్ చేరుకున్న బృంద సభ్యులకు సీఎస్, ఇతర ఉన్నతాధికారులు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేసేందుకు కరోనా మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేశామని వారికి తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, కంటైన్మెంట్ జోన్‌ల నిర్వహణ, క్వారంటైన్ సెంటర్లు, అసుపత్రుల సన్నద్ధత, నిఘా బృందాల ఏర్పాటు, వైద్య పరీక్షలు, హెల్ప్‌లైన్, వైద్య పరికరాల సేకరణ, తెల్ల రేషన్‌కార్డు లబ్దిదారులకు ఉచిత బియ్యం పంపిణీ, వలస కార్మికులకు అన్నపూర్ణ సెంటర్లు, షెల్టర్లు, తదితర అంశాలపై సీఎస్ వివరణాత్మకంగా కేంద్ర బృందానికి తెలియజేశారు. చదవండి: ఎత్తివేయాలా.. వద్దా..!
ప్రజల ప్రాణాలు కాపాడటమే ముఖ్యమని, పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని వారికి వివరించారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం ప్రశంసించింది. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు షెడ్యూల్ ఇలా..
కేంద్ర బృందం ఆదివారం ఉదయం డీజీపీతో సమావేశమై ఆ తర్వాత కంటైన్మెంట్ జోన్లను సందర్శిస్తుంది. నేచర్‌క్యూర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌ను పరిశీలించడంతోపాటు మొహిదీపట్నంలోని రైతుబజార్, మంగర్‌బస్తీలోని బస్తీ దవాఖానా, నైట్ షెల్టర్‌ను పరిశీలించనుంది. సోమవారం జీహెచ్‌ఎంసీ కంట్రోల్ రూంకు వెళ్లి చివరగా మరోసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సమావేశం కానుంది. అనంతరం గాంధీ ఆసుపత్రికి చేరుకొని కరోనా పరీక్షలు నిర్వహించే వైరాలజీ ల్యాబ్‌ను తనిఖీ చేయనుంది. పర్యటన ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించి ఢిల్లీ చేరుకొని క్షేత్రస్థాయి పరిస్థితిపై కేంద్రానికి నివేదిక అందజేయనుంది.
చదవండి: ‘తాలు’ తీస్తున్నారు!
Comments
Please login to add a commentAdd a comment