తెలంగాణ వాహనాలకు టీజీ సిరీస్ కేటాయింపు | Centre issue notification on Telangana vehicle number | Sakshi
Sakshi News home page

తెలంగాణ వాహనాలకు టీజీ సిరీస్ కేటాయింపు

Published Thu, May 29 2014 10:38 PM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM

Centre issue notification on Telangana vehicle number

* నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలకు  కేంద్రప్రభుత్వం ‘టిజి’ సిరీస్‌ను కేటాయించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్ర , శనివారాల్లో అధికారికంగా నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. తెలంగాణ ఆంగ్ల పదం పొడి అక్షరాలుగా టిజి ఉండనున్నా... జిల్లాలవారీగా ప్రస్తుతం అమలులో ఉన్న నెంబర్లనే కొనసాగించనున్నారు. ఈ నెంబర్లు అవే ఉండాలా, కొత్తవి కేటాయించాలా అన్న అధికారాన్ని కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించింది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆ నిర్ణయం వెలువడే వరకు టిజి సీరీస్‌లో పాత నెంబర్లనే అధికారులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీరీస్‌తో ఒక్కో జిల్లాకు ఒక్కో నెంబరు అమలులో ఉంది. ఖైరతాబాద్‌కు ఎపి-09, మెహిదీపట్నంకు ఎపి-13, వరంగల్‌కు ఎపి-36 ఇలా ఆయా ప్రాంతాల అక్షరక్రమం ఆధారంగా నెంబర్ కొనసాగుతోంది. కొత్తగా తెలంగాణకు టిజి సీరీస్ వచ్చినా జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న నెంబర్లే అమలులో ఉంటాయి. ఆ నెంబర్లు కాకుండా తెలంగాణలోని జిల్లాలకు మళ్లీ 01 నుంచి వరసగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ నెంబర్లు అమలులోకి వస్తాయి.

అయితే అది ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను విడగొట్టి 25కు పెంచాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో... ఆ విభజన జరిగితేనే నెంబర్ల కేటాయింపు సాధ్యమవుతుంది. ప్రస్తుత పది జిల్లాల అక్షర క్రమం ఆధారంగా ఇప్పుడే కేటాయిస్తే... జిల్లాల విభజన తర్వాత అయోమయం నెలకొనే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాల నెంబర్లను మార్చుకోవాలా, ఎపి సీరీస్‌తోనే కొనసాగవచ్చా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement