Telangana Vehicles
-
'టీ' వాహనాల నుంచి రూ.1.30 కోట్ల పన్ను వసూలు
జగ్గయ్యపేట, తిరువూరు: తెలంగాణ వాహనాలపై పన్ను రవాణా పన్ను అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొలిరోజు స్వల్ప వ్యవధిలోనే మంచి ఆదాయం సమకూరింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి రూ.1.30కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు. వీటిలో 95 బస్సులు కాగా, 105 లారీలు ఉన్నాయి. తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది 30 వాహనాల నుంచి రూ.80 వేల మేర పన్ను రాబట్టారు. కాగా, పన్ను వసూళ్లలో గరికపాడు చెక్‌పోస్ట్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి పన్ను అమల్లోకి రాగా, అంతకు గంట ముందే చెక్‌పోస్ట్ సిబ్బంది తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ వాహనాల డ్రైవర్లు, యజమానులు ఆందోళనకు దిగారు. నిర్ణీత సమయానికి ముందు నుంచే ఇలా చేయడం ఏమిటంటూ అర్ధరాత్రి 2.30 గంటల వరకూ ధర్నా చేశారు. చివరికి చేసేది లేక పన్నులు చెల్లించి వెళ్లిపోయారు. -
తెలంగాణ వాహనాలపై ఏపీ పన్ను
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు పన్ను విధించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శుక్రవారం నిర్ణయించింది. శుక్రవారం అర్థరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. ఏపీలో ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాల వలే తెలంగాణ నుంచి వచ్చే రవాణ వాహనాలపై పన్ను వసూలు చేస్తారు. తెలంగాణ నుంచి ఏపీలోకి ప్రవేశించే అన్ని చెక్‌పోస్టుల వద్ద ఈ విధానం అమలుకానుంది. అందుకు సంబంధించిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రతి 3 నెలలకు ఓ సారి ఏపీ ప్రభుత్వం పన్ను వసూలు చేయనుంది. ఈ పన్ను వసూలు ద్వారా ఏడాదికి సుమారు రూ. 50 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇప్పటికే ఏపీ నుంచి వచ్చే వాహనాలకు తెలంగాణ ప్రభుత్వం పన్ను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఏపీ బదులు ఇక టీఎస్
* తెలంగాణ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ గెజిట్ * 4 నెలల్లో పాత వాహనాల నంబర్లు మార్చుకోవాలి * రెండు మూడు రోజుల్లో కొత్త వాహనాలకు నంబర్లు తీసుకోవచ్చు * ప్రతి జిల్లాకో కోడ్ ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి * నంబర్లు కూడా మారతాయంటూ గందరగోళానికి తెరతీసిన మంత్రి * సిరీస్ సరే, నంబర్లు మారడమేమిటని తలపట్టుకుంటున్న వాహనదారులు * డబ్బుపెట్టి కొన్న ఫ్యాన్సీ నంబర్లను మారిస్తే ఎలాగంటూ ప్రశ్న సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనాలు ఇక నుంచి ‘టీఎస్’తో మొదలుకానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పాత వాహనాల నంబర్లను నాలుగు నెలల్లో మార్చుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్, ఆర్డర్ ఇస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే కొత్త వాహనాలకు ‘టీఎస్’తో నంబరు తీసుకోవచ్చన్నారు. పాత వాహనాల నంబర్లను ముందుగా దరఖాస్తు చేసుకొని మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల సమయం సరిపోకపోతే మరికొంత సమయం ఇస్తామన్నారు. పాత వాహనాలకు ‘ఏపీ’ బదులుగా ‘టీఎస్’తోపాటు నంబరు కూడా మారుతుందని చెప్పారు. వాహనదారులు అందుకోసం కొంత ఫీజు చెల్లించాలన్నారు. తెలంగాణ వచ్చినందుకు ఇది ప్రజలకు కానుకగా వేస్తున్న భారమా? అని విలేకరులు ప్రశ్నించగా... భారం వేయకుండా చూస్తామన్నారు. ప్రస్తుత నంబరును యథావిధిగా ఉంచి, ‘ఏపీ’ స్థానే ‘టీఎస్’ను వాహనదారులే మార్చుకునే వెసులుబాటు చేయవచ్చు కదా? అని అడగ్గా అలా చేయడం సాధ్యం కాదన్నారు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వీటిపై ఇంకా కసరత్తు చేస్తున్నామన్నారు. ఆటోల ట్యాక్స్‌లను ఎత్తివేస్తున్నామన్నారు. తెలంగాణలో 73 లక్షల వాహనాలు తిరుగుతున్నాయనీ... అందులో 50 లక్షలు ద్విచక్ర వాహనాలేనన్నారు. విధి విధానాలు ఖరారయ్యాకే రిజిస్ట్రేషన్లు తెలంగాణ రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేంద్రం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో రాష్ట్రంలో మారో నాలుగైదు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దీంతో ఏ జిల్లాకు ఏ నంబర్ కేటాయించాలనే విషయంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధారణంగా అక్షర క్రమం ఆధారంగా వీటి కేటాయింపు ఉంటుంది. అదే ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు 01 కోడ్ కేటాయింపుతో ఇది మొదలుకానుంది. అయితే ఈ కేటాయింపు ఎలా ఉండాలనే విషయంలో గురు, శుక్రవారాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా, వీటిని విభజించి ఆ సంఖ్యను 24కు పెంచాలనే ఆలోచన కూడా ఉంది. అక్షర క్రమం ప్రకారం కేటాయిస్తే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మళ్లీ గందరగోళం తలెత్తుతుంది. అలాంటప్పుడు అక్షరక్రమం కాకుండా సాధారణంగా నెంబర్లు కేటాయించాలా, లేదా ముందస్తుగా కొన్ని బఫర్ నెంబర్లు గుర్తించి బ్లాక్ చేసి పెట్టడమా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కోడ్ నెంబర్ల వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నందున ఈ కసరత్తును వీలైనంత తొందరలో పూర్తి చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నంబర్ల మార్పంటూ గందరగోళం తెలంగాణ రాష్ర్టంలోని వాహనాలకు టీఎస్ సిరీస్ కేటాయించడాన్ని వాహనదారులు స్వాగతిస్తున్నా.. నంబర్లు కూడా మారుతాయంటూ మంత్రి గందరగోళానికి తెరలేపారంటూ వాహనదారులంటున్నారు. సిరీస్ మార్పు సరే నంబర్లు ఎందుకు మార్చాలని ప్రశ్నిస్తున్నారు. అలా మారితే, డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్ల పరిస్థితి ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో ఖర్చు చేసి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్లు తమకే దక్కుతాయా? లేక మళ్లీ కొనుక్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతుందా? అన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. -
తెలంగాణ వాహనాలకు టీఎస్ సిరీస్!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పరిధిలోని వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పటికే కేంద్రం ‘టీజీ’ సిరీస్‌ను నోటిఫై చేసిన విషయం తెలిసిందే. కానీ టీఎస్ సిరీస్ కావాలని తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరటంతో కేంద్రం మళ్లీ దాన్ని మార్చే పనిలో పడింది. తెలుగు అక్షరాల్లో ‘స’ అక్షరాన్ని శుభకరంగా భావించే కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్‌లో కూడా ‘స’ ధ్వనించేలా ‘ఎస్’ అనే ఆంగ్ల అక్షరం ఉండాలని భావిం చినట్టు రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. టీఎస్ పొడి అక్షరాలు ‘తెలంగాణ స్టేట్’ అనే పదానికి ప్రతిబింబంగా ఉంటున్నందున దాన్నే ఖాయం చేయాలని విజ్ఞప్తి చేయటంతో కేంద్రం కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం టీజీ సిరీస్‌ను నోటిఫై చేస్తున్నట్టు ఢిల్లీ నుంచి స్థానిక రవాణా శాఖాధికారులకు సమాచారం రావటంతో వారు ఆ మేరకు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. కానీ ఇప్పుడు సిరీస్ మార్పుపై వార్తలు వస్తుండటంతో స్పష్టత కోసం అధికారులు ఢిల్లీలోని అధికారులను సంప్రదించడానికి ప్రయత్నించారు. దీంతో టీజీ ఉంటుందా టీఎస్ ఉంటుందా అన్న విషయంలో అయోమయం నెలకొందని రవాణా శాఖ సీనియర్ అధికారి ఒకరు సాక్షితో చెప్పారు. శనివారం అర్ధరాత్రి వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, లేదంటే సోమవారం వస్తుందని తెలిపారు. జిల్లాల వారీగా నంబర్ సిరీస్‌ను ప్రస్తుతానికి పాతదే కొనసాగించే వీలుందన్నారు. -
తెలంగాణ వాహనాలకు టీజీ సిరీస్ కేటాయింపు
* నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వాహనాలకు కేంద్రప్రభుత్వం ‘టిజి’ సిరీస్‌ను కేటాయించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. శుక్ర , శనివారాల్లో అధికారికంగా నోటిఫికేషన్ ప్రచురించనున్నారు. తెలంగాణ ఆంగ్ల పదం పొడి అక్షరాలుగా టిజి ఉండనున్నా... జిల్లాలవారీగా ప్రస్తుతం అమలులో ఉన్న నెంబర్లనే కొనసాగించనున్నారు. ఈ నెంబర్లు అవే ఉండాలా, కొత్తవి కేటాయించాలా అన్న అధికారాన్ని కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే కేటాయించింది. కొత్త ప్రభుత్వం కొలువుదీరి ఆ నిర్ణయం వెలువడే వరకు టిజి సీరీస్‌లో పాత నెంబర్లనే అధికారులు కేటాయిస్తారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ సీరీస్‌తో ఒక్కో జిల్లాకు ఒక్కో నెంబరు అమలులో ఉంది. ఖైరతాబాద్‌కు ఎపి-09, మెహిదీపట్నంకు ఎపి-13, వరంగల్‌కు ఎపి-36 ఇలా ఆయా ప్రాంతాల అక్షరక్రమం ఆధారంగా నెంబర్ కొనసాగుతోంది. కొత్తగా తెలంగాణకు టిజి సీరీస్ వచ్చినా జిల్లాల వారీగా ప్రస్తుతం ఉన్న నెంబర్లే అమలులో ఉంటాయి. ఆ నెంబర్లు కాకుండా తెలంగాణలోని జిల్లాలకు మళ్లీ 01 నుంచి వరసగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ నెంబర్లు అమలులోకి వస్తాయి. అయితే అది ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపించటం లేదు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను విడగొట్టి 25కు పెంచాలని కేసీఆర్ భావిస్తున్న నేపథ్యంలో... ఆ విభజన జరిగితేనే నెంబర్ల కేటాయింపు సాధ్యమవుతుంది. ప్రస్తుత పది జిల్లాల అక్షర క్రమం ఆధారంగా ఇప్పుడే కేటాయిస్తే... జిల్లాల విభజన తర్వాత అయోమయం నెలకొనే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పాత వాహనాల నెంబర్లను మార్చుకోవాలా, ఎపి సీరీస్‌తోనే కొనసాగవచ్చా అన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు.