'టీ' వాహనాల నుంచి రూ.1.30 కోట్ల పన్ను వసూలు
జగ్గయ్యపేట, తిరువూరు: తెలంగాణ వాహనాలపై పన్ను రవాణా పన్ను అమల్లోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తొలిరోజు స్వల్ప వ్యవధిలోనే మంచి ఆదాయం సమకూరింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు 200 వాహనాల నుంచి రూ.1.30కోట్ల రూపాయల పన్ను వసూలు చేశారు. వీటిలో 95 బస్సులు కాగా, 105 లారీలు ఉన్నాయి. తిరువూరు చెక్‌పోస్ట్ వద్ద సిబ్బంది 30 వాహనాల నుంచి రూ.80 వేల మేర పన్ను రాబట్టారు. కాగా, పన్ను వసూళ్లలో గరికపాడు చెక్‌పోస్ట్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి పన్ను అమల్లోకి రాగా, అంతకు గంట ముందే చెక్‌పోస్ట్ సిబ్బంది తెలంగాణ వైపు నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. దీంతో ఆ వాహనాల డ్రైవర్లు, యజమానులు ఆందోళనకు దిగారు. నిర్ణీత సమయానికి ముందు నుంచే ఇలా చేయడం ఏమిటంటూ అర్ధరాత్రి 2.30 గంటల వరకూ ధర్నా చేశారు. చివరికి చేసేది లేక పన్నులు చెల్లించి వెళ్లిపోయారు.