ఏపీ బదులు ఇక టీఎస్
* తెలంగాణ వాహనాలపై కేంద్ర ప్రభుత్వ గెజిట్
* 4 నెలల్లో పాత వాహనాల నంబర్లు మార్చుకోవాలి
* రెండు మూడు రోజుల్లో కొత్త వాహనాలకు నంబర్లు తీసుకోవచ్చు
* ప్రతి జిల్లాకో కోడ్ ఇస్తామన్న రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి
* నంబర్లు కూడా మారతాయంటూ గందరగోళానికి తెరతీసిన మంత్రి
* సిరీస్ సరే, నంబర్లు మారడమేమిటని తలపట్టుకుంటున్న వాహనదారులు
* డబ్బుపెట్టి కొన్న ఫ్యాన్సీ నంబర్లను మారిస్తే ఎలాగంటూ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనాలు ఇక నుంచి ‘టీఎస్’తో మొదలుకానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ గెజిట్‌లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో పాత వాహనాల నంబర్లను నాలుగు నెలల్లో మార్చుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. సచివాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో ప్రతి జిల్లాకు కోడ్, ఆర్డర్ ఇస్తామన్నారు. ఈ రెండు మూడు రోజుల్లోనే కొత్త వాహనాలకు ‘టీఎస్’తో నంబరు తీసుకోవచ్చన్నారు. పాత వాహనాల నంబర్లను ముందుగా దరఖాస్తు చేసుకొని మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. నాలుగు నెలల సమయం సరిపోకపోతే మరికొంత సమయం ఇస్తామన్నారు. పాత వాహనాలకు ‘ఏపీ’ బదులుగా ‘టీఎస్’తోపాటు నంబరు కూడా మారుతుందని చెప్పారు. వాహనదారులు అందుకోసం కొంత ఫీజు చెల్లించాలన్నారు.
తెలంగాణ వచ్చినందుకు ఇది ప్రజలకు కానుకగా వేస్తున్న భారమా? అని విలేకరులు ప్రశ్నించగా... భారం వేయకుండా చూస్తామన్నారు. ప్రస్తుత నంబరును యథావిధిగా ఉంచి, ‘ఏపీ’ స్థానే ‘టీఎస్’ను వాహనదారులే మార్చుకునే వెసులుబాటు చేయవచ్చు కదా? అని అడగ్గా అలా చేయడం సాధ్యం కాదన్నారు. ఫ్యాన్సీ నెంబర్ల విషయంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. వీటిపై ఇంకా కసరత్తు చేస్తున్నామన్నారు. ఆటోల ట్యాక్స్‌లను ఎత్తివేస్తున్నామన్నారు. తెలంగాణలో 73 లక్షల వాహనాలు తిరుగుతున్నాయనీ... అందులో 50 లక్షలు ద్విచక్ర వాహనాలేనన్నారు.
విధి విధానాలు ఖరారయ్యాకే రిజిస్ట్రేషన్లు
తెలంగాణ రాష్ట్రంలోని వాహనాల రిజిస్ట్రేషన్‌కు కేంద్రం టీఎస్ సిరీస్‌ను కేటాయించిన నేపథ్యంలో రాష్ట్రంలో మారో నాలుగైదు రోజుల్లో వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాబోతోంది. దీంతో ఏ జిల్లాకు ఏ నంబర్ కేటాయించాలనే విషయంలో అధికారులు కసరత్తు ప్రారంభించారు. సాధారణంగా అక్షర క్రమం ఆధారంగా వీటి కేటాయింపు ఉంటుంది. అదే ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు 01 కోడ్ కేటాయింపుతో ఇది మొదలుకానుంది. అయితే ఈ కేటాయింపు ఎలా ఉండాలనే విషయంలో గురు, శుక్రవారాల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 10 జిల్లాలు మాత్రమే ఉండగా, వీటిని విభజించి ఆ సంఖ్యను 24కు పెంచాలనే ఆలోచన కూడా ఉంది. అక్షర క్రమం ప్రకారం కేటాయిస్తే కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మళ్లీ గందరగోళం తలెత్తుతుంది. అలాంటప్పుడు అక్షరక్రమం కాకుండా సాధారణంగా నెంబర్లు కేటాయించాలా, లేదా ముందస్తుగా కొన్ని బఫర్ నెంబర్లు గుర్తించి బ్లాక్ చేసి పెట్టడమా అన్న విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కోడ్ నెంబర్ల వ్యవహారం తేలితేనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నందున ఈ కసరత్తును వీలైనంత తొందరలో పూర్తి చేయనున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.
నంబర్ల మార్పంటూ గందరగోళం
తెలంగాణ రాష్ర్టంలోని వాహనాలకు టీఎస్ సిరీస్ కేటాయించడాన్ని వాహనదారులు స్వాగతిస్తున్నా.. నంబర్లు కూడా మారుతాయంటూ మంత్రి గందరగోళానికి తెరలేపారంటూ వాహనదారులంటున్నారు. సిరీస్ మార్పు సరే నంబర్లు ఎందుకు మార్చాలని ప్రశ్నిస్తున్నారు. అలా మారితే, డబ్బులు పెట్టి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్ల పరిస్థితి ఏమిటనీ వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఎంతో ఖర్చు చేసి కొనుక్కున్న ఫ్యాన్సీ నంబర్లు తమకే దక్కుతాయా? లేక మళ్లీ కొనుక్కొవాల్సిన పరిస్థితి ఎదురవుతుందా? అన్న ఆందోళన వాహనదారుల్లో నెలకొంది.